Friday, 19 July 2019

మా రాయలు


మావగారికి  చేతినిండా  మనుషులే, ఏ అవసరానికయినా  కాకి చేత కబురంపితే  చాలు , వచ్చి  కావలసిన పని చేసి  వెళ్తారు.  మా ఇరుగు పొరుగు వారూ, బంధువులే కాకుండా ఎక్కడెక్కడినుంచో  జనాలు   ‘మేము  ఫలానా  పని చేయించుకోవాలి సార్ . మీకు తెలిసిన  వాళ్లేవరయినా వున్నారా ?’ అని  ఫోన్ చేసి  మరీ  మావగారి  ‘కాంటాక్ట్స్’  వాడుకుంటూంటారు.  పని చేయించుకోవడం  ఓ కళ  అని  నమ్ముతూ ,  ఎవరినీ  ప్రతికూల  దృక్పథంతో  చూడకూడదని భావిస్తూ, ఎవ్వరూ  మరీ అంత మోసం చెయ్యరని  ఊహిస్తూ  అందరినీ  తన  మాంచి  మాటల చేతల  గారడీ తో ఏ పనికయినా  ‘ఎవరక్కడ!’ అనగానే  పలికేలా  దిగ్గజాల్లాంటి  వారిని  మలచుకున్నారు  మావాశ్రీ .   వీరిలో  కొందరితో  ఆయనకున్న   ఆహ్లాదకరమయిన  అనుబంధాన్ని చవిచూడండి.



మావగారి  ఆస్థాన  చిరకాల చాకలి  అప్పారావు 

                   దాదాపు  నాల్గు దశాబ్దాల  క్రితం  మా ఇంట్లో  ‘తళ  తళ లాడే తెలుపు !’ అంటూ  సైకిలు  మీద ఎంటర్  అయ్యాడు  మా చాకలి  అప్పారావు.  మావగారు  ఉద్యోగరీత్యా  పై వూరు  బదిలీ  అయినప్పుడు  తప్ప ,  విశాఖలో  మా ఆస్థాన  చాకలి  అతనే.  ఐదడుగుల  పొడవుతో  లావుగా  గుండ్రంగా  వుండే  అప్పారావుకి   పేరుకు తగ్గట్టుగానే  ఎప్పుడూ అడ్వాన్స్ లోనే నడుస్తుంది  ఖాతా. ‘అమ్మగారు  చాలా  మంచోరు , ఓ  వెయ్యి రూపాయలు  ఇమ్మన్నారు , మీరివ్వప్పోతే  ఎవరిస్తారయగారూ ? మీ మీదే నా ఆశ’  అని  భారీ  డైలాగులు  కొడుతూ, మావగారి ఎదురుగా  చేతులు కట్టుకుని  అతి వినయం ప్రదర్శిస్తూ  ఉంటాడు  నాటకాల మీద  విపరీతమయిన  మోజున్న  మా  నటరత్న.    ఇద్దరు  ఆడపిల్లల్ని  ఎంతో బాగా చదివి స్తున్న  అప్పరావంటే  ఒక పక్క ముచ్చటపడే మావగారు    ‘అంత డబ్బు  అడ్వాన్స్  లెంటయ్యా? అసలే వాషింగ్  మిషన్  వుండడం వల్ల  నీకు రాను రాను  బట్టలు  తగ్గిపోతున్నాయి.  నువ్వు ఎంత బాకీ ఉన్నావో  ముందు లెక్ఖ  చూడందే  మరి లేదు ’ అని  మరో పక్క గద్దించక మానరు.   వాళ్ళావిడ   రైతు బజార్  నుంచి కూరలు  తెమ్మందని  నాకు,  సైకిల్  రిపైర్  అని  మా అత్తగారికీ, బాలకృష్ణ  సినిమా  రిలీజయ్యిందని  మావారికీ, ఇలా వచ్చిన ప్రతీసారీ ఏదోక  కధ చెప్పి తన పంట పండించుకునే  ప్రయత్నం  చేస్తునేఉంటాడు మా అప్పుల  అప్పారావు .  ఆ మధ్య  ఓరోజు  బట్టలకని    వచ్చినప్పుడు చాలా హుషారుగా  ‘మొన్న పండుక్కి వేషం కట్టానండీ!’ అంటూ పౌరాణిక గెటప్  లో ఉన్న తన  ఫొటో ఒకటి  చూపించాడు,  ఒకప్పుడు  నాటకాలడి  ప్రస్తుతం  కళాపోషకునిగా  స్థిరపడిన  మావగారికి. ‘భలే ఉన్నావ్ వోయ్ ! ఏం వేషం వేసావేవిటి?’ అని  ఆయన అనగానే  అంత  మనిషీ  ముప్ఫై మూడు  మెలికలు తిరిగి పోతూ, ‘రాముడు  తండ్రి ‘ అన్నాడు  గొప్పగా.  అబ్బో! అంటూన్న  మావగారి పొగడ్త  మొదలవ్వక ముందే,  ‘అదేనండీ! విభీష్ముడు ‘ అన్నాడు  మా  నట చక్రవర్తి  అప్పారావు. ఇక  చూడాలి  అవాక్కయిన మావగారి అవస్థ. వంటింట్లోంచి విన్న మాకు  నవ్వు ఆగితే ఒట్టు .  ఆ రోజంతా  స్టేజ్  మీద అప్పారావు  రాముడి తండ్రి  విభీష్ముడి  గెటప్ లో  ఏమి  డైలాగులు  చెప్పి ఉంటాడా  అనే  చర్చ  మా ఇంట్లో  సుదీర్ఘంగా కొనసాగింది.



మావగారి  ఆస్థాన కార్పెంటర్ శశి భూషణం

                   మా యింట  వడ్రంగి పని చేయడానికి  మా పెళ్ళయిన కొత్తలో ఒక కుర్రవాడు  వచ్చాడు .   అతని పేరు  ‘చంద్ర భూషణం ‘. చిన్న చిన్న పనులన్నీ  చక చకా చేసేసి  మావగారి  దగ్గర  మార్కులు కొట్టేసాడు.  తరువాత  కొన్నేళ్ళకు  మా ఆడపడుచు  కొత్తగా కొనుక్కున్న ఇంట్లో  పనికి  అతను  అవసరమైయ్యాడు. ఆ రోజుల్లో  ఇంకా సెల్ ఫోనులు  లేక, మావగారు వాళ్ల పేటకి  ఏకంగా  ఉత్తరం వ్రాసేసారు.  అంతవరకూ  బాగానేవుంది . ఉత్తరం హస్తభూషణం కాగా  మండుటెండలో  మా ఇంట్లో వాలాడు భూషణం. ఊహించిన రీతిలో  తన ఉత్తర  ప్రయత్నం ఫలించినందుకు  ‘హమ్మయ్య ! దొరికాడ్రా!’ అనుకుంటూ  తెగ సంబరపడి పోయారు  మావగారు. మొత్తం  పని వివరణా, బేరసారాలు  అయ్యాక  ఎంతో వినమ్రతతో  ‘సార్ ! మీ  ఉత్తరం  వల్ల  మా పేటలో  చాలా  హడావిడి  జరిగింది సార్!  నా పేరు చంద్రభూషణం  అయితే  మీరు  శశి  భూషణం   అని రాసారు సార్ ! మా అమ్మగారు సైతం  తనకి ఇంకో కొడుకు ఎక్కడినుంచి వచ్చాడని  ఖంగారు  పడ్డారు’ అన్నాడు భూషణం .  ‘చంద్ర  అన్నా  శశి  అన్నా అర్ధం ఒకటేనయ్యా  భూషణం! అసలు నన్నడితే  శశి చాలా  లేటెస్ట్ గా ఉంది’ అని  భుజం మీద  తడుతూ  తన  తప్పు  సమర్ధించుకోవడమే  కాకుండా   అతని పేరు  సునాయాసంగా మార్చేసారు  మావగారు.  మొదట్లో  కొంచం  కష్టంగా  అనిపించినా పేరు మారిస్తే మార్చారుగానీ  బోలెడు పనులివ్వడంతో  చంద్ర  భూషణా నికి  శశి  భూషణంగా మారడం    రాను రాను  అలవాటైపొయిం దనుకొం డి.



మావగారి  ఆస్థాన  తోటమాలి  కృష్ణ

                   మా హైటెక్  తోటమాలి  అయిన  కృష్ణ ని మీకు  మావగారి మొక్కల పెంపకం  నేపధ్యంలో  పరిచయం చేసాను  కదా? అతను పండగలకు ఇల్లు దులపటం వంటి పనుల్లో కూడా సహాయం చేస్తూంటాడు. ఒకసారి తెగ సిగ్గుపడిపోతూ నాతో ‘అమ్మగోరూ! మీరు ఇందువులేనా’ అని అడిగాడు. నా సంగతి అటుంచి మా అత్తగారు సలక్షణమైన హైందవ స్త్రీ లా వుంటారే అని  ఆలోచిస్తూ ‘నీకెందుకు ఆ అనుమానమొచ్చింది కృష్ణా?’ అని తిరిగి  ప్రశ్నించాను.  అతను  బుర్ర గోక్కుంటూ ‘అదేనమ్మా! మేడ మీద గదిలో యేసు పెభు మాత పోటో యెట్టు కున్నారు కదా’ అనేసరికీ ఆలోచనలో పడ్డాన్నేను. తీరా చూస్తే అది మా మావగారు ఎంతో ముచ్చటపడి దుబాయ్ లో కొనుక్కున్న ‘మోనాలిస’ పెయింటింగ్ అని అర్ధం అయ్యాక నాకు నవ్వాగలేదు. విషయం తెలిసిన మావగారు క్రిష్ణకి ‘చిత్రకారుడు డా వించి’ ని టూకీగా, మా వంశాన్ని విస్తారంగా పరిచయంచేస్తేగాని వదలలేదు.  ఎంత క్లారిటీ ఇచ్చారంటే ,ఒకసారి కాశీ యాత్ర  చేసివచ్చిన కృష్ణ   మావగారికి  ప్రసాదం తో  పాటూ  గంగ గుళ్ళీ కూడా  తెచ్చి  సమర్పించుకున్నాడు .  



మావగారి ఆస్థాన పాలవాడు   నరసింగ రావు

                   తన చిన్నతనం నుంచీ మా ఇంటికి గేదెపాలు  సరఫరా  చేస్తూ  ఎదిగినవాడు  కావడం వల్లా,  ఆ పాలల్లోంచి  ఎంతో కొంత నెయ్యి వస్తుందనే మా అత్తగారి  వాదన  వల్లా,  సరఫరా  కేంద్రాల  పుణ్యమా  అని పాలు సమృద్ధిగా  దొరుకుతున్నా,  అతన్ని వదిలించుకోలేక పోతున్నారు  మా  మావగారు.  గుండమ్మ కథలో  గంటన్న  అన్నట్టు,  చిక్కటి పాలు అరిగించుకునే  మొనగాడు  ఎవడనే   లేఖ్ఖలో, మా పాలలో  నీళ్ళు  కలుపుతూ  మా ఆరోగ్యానికి  తన వంతు  కృషి  చేస్తుంటాడు నరసింగరావు. ‘బాబ్బాబు! కాస్త  మినరల్  వాటర్ లాంటిది కలుపుదూ, కనీసం  మునిసిపల్  కుళాయి  నీళ్ళు  కలుపు,  నీకు పుణ్యముంటుంది’  అని  చమత్కరిస్తుంటారు  మావాశ్రీ .  కనీసం వారానికి ఒక్కసారయినా  పాలు అంత బాగాలేవనే  బెదిరింపులు అత్తగారి  వైపు నుంచీ వస్తుంటాయి .  కానీ  అతని  అలవాట్లు షరా మామూలే. మా మొక్కల సంరక్షణార్ధం అత్యంత మెరుగైనది ‘పేడ గెత్తం’ అనీ, దానికోసం  ఇదే పాల నరసింగరావు మీద మొదట్లో ఆధారపడ్డారు మా మావగారు. స్వతహాగానే  అతనొక  అయోమయం,  అతను  వచ్చేసరికీ ఆ రోజు మా ఇంట్లో మెనూ నిశ్చయించేసుకుని  కూరగాయలు తరిగేసి తోక్కులన్నీ సంచీలోకి ఎత్తి  పసువులకోసం  భద్రపరుస్తుంటారు  ఎంతో  సామాజిక బాధ్యతతో  మా అత్తగారు.  కానీ అతని  చేతికి సంచీ  అందిస్తేగాని  జ్ఞాపకంగా పట్టుకెళ్లడు  మా మతిమరుపు  పాలవాడు. రోజులో కనీసం ఒక్క వాడుక వాళ్ళకైనా పాలు పోయడం మరచిపోవటం  అతగాడికి ఆనవాయతీ. అలాంటి వాడు విత్తనం వేసినప్పుడు గెత్తం తెమ్మంటే కాయ కాసాక తెస్తే గొప్ప. గుర్తు చేసీ చేసీ  విసిగిపోయిన మావగారు సరాసరి  అతని  ఇంట్లో ప్రత్యక్షమయ్యేవారు  ఏదోకరోజున స్కూటేరేసుకుని. అయ్యగారూ! అంటూ మెలికలు తిరిగిపోతున్న అతడిమీద  ‘పోన్లేద్దూ మరీనూ!’ అని  అత్యంత సకారాత్మకంగా తన విసుగు కనబరుస్తూ కాస్త సమయం పట్టినా ‘పేడ గెత్తం’ బస్తాకి ఎత్తించి స్కూటర్ ముందు పెట్టుకుని విజయోత్సాహంతో ఇల్లు చేరేవారు.   



మావగారి ఆస్థాన  డ్రైవరు జగదీషు

                    అచ్చం  సప్తపది  సినీమాలో  హీరోలా  వుండే  మా డ్రైవర్  జగదీష్, విపరీతమయిన  దైవ భక్తుడు.  రోజూ తెల్లవారుఝామునే   తన  ఇంటిదగ్గర  బాబాగుడిలో   హారతికి హాజారయి, అప్పుడు తన సొంత ఆటోతో  రోడ్డెక్కుతాడు.   దీనివల్ల  మా  కారు  తీసినప్పుడు  మాత్రమే  రోజులో  అప్పుడప్పుడు  తనకి  కునుకు తీసే వ్యవధి  దొరుకుతుంది.  ఆ కునుకునుంచి  తనని  మేల్కొల్పాలంటే  కుంభకర్ణుడికి  చేసినంత  యత్నం చెయ్యాలి.  ఓ సారి  సతీసమేతంగా  మావగారు  ఒక  పెళ్ళికి  జగదీష్  కారు తీయగా బయలుదేరారు.  మండపం  దగ్గర  పార్కింగ్  దొరక్క  ‘మీరెళ్ళండి  సార్,  ఎక్కడ ఖాళీ వుందో  చూస్తాను. బయటికొచ్చి  ఫోన్ చెయ్యండి, బండి తెస్తాను ‘ అని భరోసా ఇచ్చేసి  ముందుకి లాగించాడు  కుంభకర్ణుడి  తమ్ముడైన  మా వాహనచోదకుడు.   రాత్రి  పదకొండు  గంటల  ముహూర్తం  అయినప్పటికీ   పెళ్ళివారు  బాగా పరిచయస్తులు  కావడంతో, తాపీగా విందు భోజనాలయ్యాక  ముహూర్తానికి  కూడా  వుండి, లైనులో  నిలబడి  మరీ  వధూవరులను దీవించి,   కల్యాణ మండపం నుంచి  అర్దరాత్రి  కావొస్తుండగా  బయటకు నడిచారు  మావగారూ  అత్తగారు.  ఎటు చూసినా, ఎంతసేపు చూసినా  మా జగదీష్ జాడ  లేదు సరికదా  తన సెల్ కి  ఫోను చేస్తే  ‘మీరు కాల్ చేసిన  సబ్స్క్రైబర్  ప్రస్తుతం ఏ కాల్ నూ స్వీకరించుటలేదు’ అన్న  మెసేజ్  విసుగేత్తించసాగింది.  చేసేదిలేక  ఆటో  కట్టించుకుని  దేవుడా మని  అర్దరాత్రి  దాటాక  ఇల్లు  చేరారు  సీనియర్  దంపతులిద్దరూ . ఇక  దాదాపు  తెల్లవారుతుండగా  ఉలిక్కిపడి  గాఢ  ‘కారునిద్ర’లోంచి  మేల్కొన్న  మా  చాలకుడు  విషయం  గ్రహించుకుని  గప్ చుప్ గా మా గేటులోకి  కారు  పెట్టడమే  కాకుండా   వెంటనే  కారు  కడిగేయడం (మార్కులు  కొట్టెయ్యడానికి )  కూడా  జరిగాయి.  మార్నింగ్  వాక్ కోసం  బయటకి  వచ్చిన మావగారు  చిరునవ్వుతో  గుడ్  మార్నింగ్  చెప్పి,  తాళంచెవి  అందుకుని  ఇంక ఏమీ  అనకుండా  అతన్ని  ఆ రోజుకి  పంపించేసి  తరువాత  నెమ్మదిగా  తీసుకోవలసిన  క్లాస్  తీసుకున్నారు.



మావగారి ఆస్థాన  క్షురకుడు 

                   యుక్తవయసులో  శోభన్ బాబు  క్రాఫును తలపించిన  మావగారి కేశ సంపద  క్రమేపి  శిరస్సు పైభాగంలో క్షీణించినా, వెనుక మటుకూ  ఇప్పటికీ  ఉంగరాలు తిరిగడంవల్ల , కనీసం  రెండు నెల్లకి  ఓమాటు  అయినా   సెలూన్  షికారు  తప్పడంలేదు  ఆయనకి .  మనవలికి  కూడా  గడ్డాలూ  మీసాలూ  రావడంతో   తన  పుత్ర పోత్రుల సమేతంగా  ఆయన  పోషించే  క్షురకుడోకడున్నాడు.   సెలూన్ లో  అడుగుపెట్టగానే  ముగ్గురు చుట్టముట్టారనీ,  ఆ స్టైల్  చేస్తాం సార్, ఈ  రంగు  రాస్తాం  సార్  అని  ఒకటే  మొహమాటపెట్టారనీ మోర పెట్టుకున్నారీమధ్య.  అయితే  ఆయన  తెలివిగా  ‘ఏవర్రా , మీకు  ఐదుగురు జమాజేట్టీల్లాంటి వాళ్ళని  అప్పజెప్పాను  వాళ్లకి  చేసుకోండి  ఇవన్నీ, అయినా  అసలు  నా వయసెంత నుకుంటు న్నారు?’ అని ప్రశ్నించారట . ఓ  ఏనభై  ఉంటాయా సార్? అన్న  అతని ఎదురు ప్రశ్నకి  అవాక్కయి, వెంటనే  తేరుకుని, ‘నేను మరీ  అలా  కనిపిస్తున్నానా?  అయినా  ఎనభై ఏళ్ళ  వారు కూడా  వస్తారేంటోయ్  మీ  దగ్గరకి?’ అంటూ  మాటమార్చి   త్వరగా  వెళ్ళిన పని ముగించుకుని  ఇల్లు  చేరారన్నమాట.  అంతటితో  ఆగక ‘ఒరేయ్ ! నా దగ్గిరా  యాభై  రూపాయలు  తీసుకున్నాడు, నీ దగ్గర కూడా  అంతే  తీసుకున్నాడు కానీ  నా జుట్టు చాలా తగ్గించేసాడు రా, పైగా  నాకు  పది నిముషాల్ల్లో  క్షవరం చేసి పంపేశాడు చూడు, నిన్నేమో  గంటలకొద్దీ కూర్చోబెడాతాడు   ’ అని మనవడితో  అంటున్న మావగార్ని  ‘బావుందండీ ! మీకూ వాడికీ తేడాలేదూ! మీకేమయినా  తుప్పలా  జుట్టుందా?  బోలెడు సేపు  పట్టడానికీ, కటింగ్ అయ్యాక  కనబడడానికీ ’ అని  గాలి తీసేశారు  ఆయన సతీ సూర్యం.



మావగారి  ఆస్థాన  ఎలక్త్రిషియన్ కం  ప్లంబర్  గోవిందు.  

              కాలనీ మొత్తం  కాలినడకనే  బెరాలన్నీ  చక్కబెట్టడం వల్ల  అవసరానికి  పిలువగానే  ఇదిగో!  అదిగో! అంటూ  వాయిదా వేస్తూ   గోవిందు సమయానికి  తాను వెళ్ళవలసిన  ఇంటికి చేరుకోలేకపోతున్నాడని మావగారి  అభిప్రాయం.  'నీ మాట నీటిలో  మూటయ్యా  గోవిందూ'  అని మందలిస్తూ    అతనిచేత  ఎలాగయినా  ఓ సైకిల్  కొనిపించే  ప్రయత్నం ఏళ్ళ క్రితమే  మొదలుపెట్టారు.  సైకిల్  వల్ల  బేరాలు పెరుగుతాయనీ, ఆరోగ్యానికి  కూడా  చాలా  మంచిదనీ, ఎవరి చేతా  మాట పడక్కర్లేదనీ, కావాలంటే  తాను డబ్బులు సర్దుతాననీ  ఇలా  రకరకాలుగా  అతన్ని మోటివేట్ చేస్తున్నారేగానీ  పాపం  ఆయన  ప్రయత్నం ఇంకా  ఫలించలేదు, కానీ  అతని అవసరం మటుకూ రోజు రోజుకీ పెరుగుతూనే  వుండడం  వల్ల  గోవిందనామ స్మరణ  తప్పడంలేదు  మావగారికి.



మావగారి ఆస్థాన పైంటర్ ధర్మ

                   చాలా చిన్న వయసులో  మావగారి  సంస్థానంలో  చేరినవాడు  ధర్మ . పేరుకి తగ్గట్టుగా  చాలా  శ్రద్ధగా  పనిచేస్తాడని  మావగారికి  అతనంటే ప్రత్యేకమయిన  అభిమానం.  మావగారు అప్పజెప్పిన  ఏ పనయినా  నా బొందో  అని  చేస్తాడు  ధర్మ , తన వృత్తికి  సంబంధించినది  కాకపోయనా.  ప్రతీ  సంవత్సరం  క్రిస్మస్ కి   తన  కుటుంబ సమేతంగా  మా ఇంటికి వచ్చి  మావగారికి  భక్తి పూర్వకంగా కేకు సమర్పించుకుని, ఆయన అశీస్సులు  తీసుకుని మరీ  వెళ్తుంటాడు.



                    ఇలా  చెప్పుకుంటూ  పోతే  చిట్టా  పెద్దది  అవుతుంది  తప్ప  ఈ కధ  కంచికి  వెళ్లడమంటూ వుండదు కాబట్టి , తన వృత్తిని  అత్యంత శ్రద్ధతో  నిర్వర్తించేవాడు  ఎవరయినా  దిగ్గజమే  అనే  భావనతో  ఈ  ‘అష్టదిగ్గజాల’తో  సరిపెడదాం . ముక్తాయింపుగా  ఒక చిన్న  విషయం. పైన  పేర్కొన్న  వారందరూ  మావగారికి  పని చేసిపెట్టినట్టు  ఎవరికీ  చెయ్యరని  కూడా ఓ టాక్ వుంది. ఆయన  పాపులారిటీకి  కారణం  ఆయన చెదరని చక్కని  చిరునవ్వు,మెత్తని మాట . వీటితో  ఆయన   గనుక మా  నియోజక  వర్గం  ఎమ్మెల్యే గా  పోటీ చెయ్యలేగానీ, ప్రత్యర్ధికి  డిపాజిట్లు  కూడా  మిగల్చకుండా  బహుముఖ  మెజారిటీ తో  గెలుస్తారనేది  నా  ప్రగాఢ  విశ్వాసం. మీ  ఓటు  మా రాయల వారికే  వేస్తారు కదూ ?

No comments:

Post a Comment