Monday, 26 December 2016

శ్రీవారి షాపింగ్ ముచ్చట్లు



బ్లాగాయనమః

ఈమధ్య   నన్ను  ఒకరు  ‘బ్లాగుష ‘ అని సంబోధించారు, ఒకరేమో  నా  ‘బ్లాగాభిమాని ‘  అట . వీళ్లి ద్దరికీ వీర తాడు  వేయ్యోద్దూ మరి! మాయాబజార్  లో  ఘటోత్కచుడు   అన్నట్లు,  ఎవరూ   కనిపెట్టక పోతే  కొత్త పదాలు  ఎలా  పుడతాయి ?  అవునంటారా? కాదంటారా?


సాధారణంగా  షాపింగ్  అనగానే  ఆడవాళ్ళకు    అత్యంత ప్రియమైన  'వ్యాపకం ’ లేదా   ‘వ్యసనం’   అని  మనము  తెల్చేస్తుం టాము .  కానీ  అస్తమానం  ఆడవాళ్ళనే  అనడం  తప్పండీ.  ఇలా  ఎందుకు  అంటున్నానో   మా  శ్రీవారి   షాపింగ్ ముచ్చ ట్లు   చవి చూస్తే   మీకే  తెలుస్తుంది .


షాపింగ్  అంటే  శ్రీవారికి  మహా ఇష్టం.  అరవై నాలుగు  కళలలో   షాపింగ్   ఓ ‘కళ’  అనుకుంటే  అందులో  ‘కళా తపస్వి’  బిరుదుకు   అర్హులు  మా వారు.   ఆఫీసు పని రిత్యా  బోలెడు  కొత్త  ప్రదేశాలు  తిరిగే  ఆయనకు,  తన  కళ కు  మెరుగులు దిద్దే   అవకాశం   తరచూ  వస్తూంటుంది. 

కాశ్మీరు  నుంచి   కుంకం పువ్వు ,  టీ పొడి, ఇంక  అదేదో ‘కావా’ అనే  పానీయం  చేసుకునే  గుండ , 

 అస్సాం  నుంచి  కూడా  టీ పొడి, 'నల్ల' బియ్యం ( మీరు సరిగ్గానే చదివారు, ఆ  బియ్యంతో  కూడా  పాయసం చేస్తారుట )  ఇంక  ‘భూత్ ఝలోకా ‘  (మన భాషలో  ‘దెయ్యం దెబ్బ’   లేక   ‘గూబ గుయ్’ అనొచ్చేమో !)   అని  పిలువబడే   ఎండు మిర్చి  (వీటిని  బాంబుల తయారీలో  వాడుతారట !   ...అవాక్కయ్యారా?).  

కేరళ నుంచి   మసాలా   దినుసులు,   గోవా నుంచి  కూడా  ఎండు  మిర్చి,  నై నితాల్  నుంచి   సంచు లు ,  ఒరిస్సా నుంచి   స్వీట్లు .   

వీటన్నిటినీ  మించి   ఆయా ప్రదేశాల   ‘మేటి వస్త్రశ్రేణి ‘  -లింగ వివక్ష   లేకుండా  బట్ట లు,  దుప్పట్లు,  తువాళ్ళు,  రు మా ళ్ళు   ఒకటేమిటి  రకానికి  ఒకటయినా   ఆయన  కొనాల్సిందే .  కాశీ   వెళ్ళినప్పుడ యితే,  ఏకంగా   బనారస్   చేనేత మగ్గాల  దగ్గరకి   వెళ్లి మరీ   పర్సు  బరువు  తగ్గించుకున్నారంటే   ఇహ  ఆలోచించండి.


ఆయన   ‘టెష్టు'  అనగా  ఎంపిక  బహు గొప్పదనే  వార్త     నాలుగు దిక్కులా  వ్యాపించేసింది.   ఇది   మటుకూ  సత్యం  సుమండీ!   నా   ‘చీరల  కలక్షన్ ’ కి   దెశ విదేశాలలో   ఫాన్స్   వున్నారండో య్ .   ఆయన్ని తమతో  షాపింగ్  కి  వెంట రమ్మనే  వారు  కొందరయితే,  'ఈసారి  మీరు  ఎక్కడికెళ్ళినా మాకూ  ఏమనుకోకుండా  ఏదయినా   తెచ్చిపెట్టండి ' అనేవారు  కొందరు.   దాంతో  ఇక చెప్పేదేముంది,  తర-తమ  అనే బేధం   లేకుండా ,  కార్డులు  గోకుతూ మరీ    స్వైరవిహారం   చేస్తూంటారు  మా సారువారు .


ఎప్పుడో గానీ   ఆయనతో   షాపింగుకి   వెళ్ళడానికి   సాహసించను నేను.  అందులోనూ  బట్టల షాపింగ్ కి  అయితే   అడగొద్దు మరి.   దీనికీ  కారణం లేకపోలేదు. ఆస్వాదించం డి !


ఇదివరకూ  దుకాణాలలో ,  ఒక కౌంటరు ,  దాని వెనుక   సేల్స్ మాన్   మనకి కావలసినవి   ఎంచక్కా  ఓర్పుగా  నేర్పుగా  చూపించి    అమ్మేవాడు.  మనం  కూర్చోవడానికి  కావలసినన్ని కుర్చీలు   ఉండేవి . కానీ  ఇప్పటి మాల్స్ లో  కౌంటర్లు   బిల్లు ల  వరకే  పరిమితం.  ‘నిను వీడని నీడను  నేనే'  అంటూ మన  చుట్టూ  ప్రదక్షణం  చేస్తూ  వుంటారు   సేల్స్ మెన్ .  కొన్ని చోట్ల అయితే      సీసీ  కెమెరాల  ధర్మమా  అని   మనల్ని  వంటరిగా  వదిలేసి ,               ‘హలో ఎవరక్కడ!’  అని  మనం   దాదాపు   అరిస్తే గానీ    ప్రత్యక్షమవ రు   సేల్స్ మెన్ .  కుర్చీల్లాంటివి  ఎక్కడో  గానీ   కనపడవుగా.   నిండా  నిలువు జీవితమే . ఎటునుంచి   లోపలికివెళ్తామో,  ఎలా  బయటకి  వస్తామో    అంతా,  ఆగమ్యగోచరం.   


ఇలాంటి   ‘మయసభ’ల్లాంటి  మాల్స్ లో  తనకి    కావలసినదాని కోసం  చుట్టూ  చూస్తూ, వెదుకుతూ   పద్మవ్యూహం లా    అమ ర్చ బడిన     ‘డిస్ప్లే  ర్యాకు’ల  మధ్య   అంటే   ‘అలమర ‘ల  మధ్య   శ్రీవారి     ‘పాద యాత్ర ‘కి  అంతు లేదు .  ఆయన  వెనకే   చేతుల మీద   కనీసం   పది రకాల   సెలెక్టెడ్ ఐటమ్స్ తో    కాళ్ళీడుస్తూ   నీరసంగా,   నడుస్తున్న  ‘స్టా ట్యూ  ఆఫ్  లిబర్టీ ‘ ని  తలపిస్తూ   పాపం నేను .   పైగా   ఒకవేళ  అడుగున  వు న్న  అరల్లో  ఆయనకి   కావలసిన  సైజో,   మో డ లో  , డిజైనో,  రంగో   ఉందేమో   అన్న  అనుమానం  కలిగిందా,  అంతే!  నిర్మొహమాటంగా   గొంతికల్లా   కూర్చుని మరీ   అన్వేషణ   సాగిస్తా రు.    ఇది   ఆయన   సూక్ష్మ సెలక్షన్ కు   నిదర్శనం . 


 ‘క్షణక్షణం’ లో  బ్రహ్మానందం   గుర్తున్నాడా?   మొన్నీమధ్య   అచ్చు  అలాంటి   సేల్స్ మాన్   ఒక డు   తారస పడ్డాడు మాకు .    మావారిని  చూస్తే నెమో  నిలువెత్తు   గాంభీర్యం , వాడేం   చెయ గలడు  పాపం .  అర్భకుడు!   అయినా  ప్రయత్నించాడు .

‘సార్ ! నేను  చూపిస్తాను   సార్ ‘,  అంటూ  ముందుకొచ్చాడు.

 ‘సార్ ! నేను   ఆల్రెడీ   అక్కడ వెదికాను   సార్’ ,  అంటూ  వాదించాడు .

 ‘సార్! మీరు   అడిగినది    స్టాకు లో లేదేమో   సార్ ‘, అంటూ  సంజాయిషీ   చెప్పాడు .

‘సార్ ! నన్ను  చూపించమంటారా   సార్ ?‘అంటూ  ప్రాధేయపడ్డాడు .

‘సార్ !   ఇది  ఇంకా  బావుంది  చూడండి  సార్ ‘  అంటూ   సలహా  ఇవ్వబోయాడు .   

ఇలా  శత  విధాల   ప్రయత్నించి   చివరకి  కుక్కిన పేనులా    జాలిగా నా వైపు చూసాడు   ‘ఈయనెప్పుడూ  ఇంతేనా  మేడం ‘  అనే   లుక్కిచ్చి .   నేను  అంతకంటే  జాలి మొహం పెట్టి   నిర్లిప్తంగా ,  నిస్సహాయంగా   బిల్లు కట్టబోయే   సగటు సాధారణ ‘భర్త’ లా గ   ఒక మూల   నిలబడ్డా .    

ఒసారయితే   ఈయన   ఫ్రెండ్   ఒకరు   షాపు లో కలిసి  ‘సార్ ! మేడం  గారికి   ఎనర్జీ డ్రింకు లాంటిది   ఎదైయినా   ఇప్పించండి ‘  అని  ఉచిత   సలహా   పారేసాడు  నా  అవస్థ  చూసి.

అన్నింటినీ మించి    ‘పొరుగింటి  మీనాక్షమ్మను  చూసారా?  వాళ్ల  ఆయన  చేసే  ముద్దూ ముచ్చట   విన్నారా ? ‘  అనే  పాత పాట   గుర్తు తెచ్చుకుని  మరీ  మా బంధువర్గం లోని  చాలా మంది  స్త్రీలు  తమ తమ  భర్తలని   మా వారిలా   షాపింగ్  చేయరని   ‘మీరూ  వున్నారు  ఎందుకూ?  దేనికైనా  సరదా  వుండాలి ‘  అంటూ   దెప్పుతూ వుంటారు .  సుబ్బి పెళ్లి  వెంకి చావుకి  రావడం  అంటే  ఇదేనేమో !

అన్నట్లు ,  ఈరోజు  నేను  మీతో చెప్పినవన్నీ  వుత్త మాటలే  సుమండీ !   అన్నీ  బుర్రలోంచి  తుడిచేయండి .   ఏమిటీ ట్విస్ట్   అనుకుంటున్నారా?  భలేవారే!   మళ్ళీ  మా    'షాపింగ్  కింగ్ '    ఏదైనా కేంపు కి   గనుక వెళితే  నాకోసం  ఏమైనా    తేవాలికదామరి ?         ......అర్ధం చేసుకోరూ !

నూతన సంవత్సర  శుభాకాంక్షలు !

కొత్త సంవత్సరంలో  కలుద్దాం !

Monday, 19 December 2016

పెళ్లి రోజు



బ్లాగాయనమః 

మళ్ళీ వచ్చేసానోచ్! 

భలే మంచి రెస్పాన్సు ఇచ్చారండీ అందరూ .   
మొదటి  బ్లాగు మరునాడే  ఒక రు నాకు ఫోను చేసి 'ఏమ్మా ! ఈ రోజు ఏమీ రాయలేదా ?' అని అడిగారు.  'సపరివార పత్రిక లాగ ఇది సపరివార బ్లాగు' అన్నా నేను . 
నిజమే మరి, అఖిలం మధురం ఒక 'సకుటుంబ సపరివార బ్లాగు'  కావాలని నా ప్రయత్నం. 

'మా అక్క త్వరలో తెలుగు లోంచి ఇంగ్లీషులోకి  ఉత్తీర్ణు రాలు అవ్వాలి 'అని పై దేశంలో ఉన్న  మా  ఎన్ ఆర్ ఐ    చుట్టమొకడు          ఫే స్బుక్కు లో కామెంటు వదిలాడు. వాడు తెలుగు నేర్చుకోవడం, సప్త సముద్రాలు దాటడం కన్నా  కష్టమని   తెల్చేసాడ న్నమాట.

మరొకరు నాతో   'ఉష గారూ ! మీరు  మరీ శుద్ధ  తెలుగులో రాసేసారు 'అని అభిప్రాయపడ్డారు.  అంటే పాపం  అందరికీ           'సుద్ద 'తెలుగు  లేక  'క్షుద్ర'తెలుగు  బాగా అలవాటయి పోయింది.  ఏం  చేస్తాం . 

నేను మటుకూ మన మంచి తెలుగు లోనే  , 'పెళ్లిరోజు ' నేపథ్యంలోనే  మరిన్ని విషయాలు మీ అందరితో ఇంకొంచం సేపు ముచ్చటిం చాలనుకుంటున్నాను . 

మొన్నొక పెళ్ళిలో మా పెళ్లి జరిపించిన  పురోహితుడు  కనిపించగానే వయసు పైబడిన ఆయన కి ,  మేమి ద్దరం నమస్కరించాము.  ‘ఏరా ! మీ పెళ్లి  కూడా నేనే చేయిన్చాను         కదు ట్రా?’ అన్నారు ఎంతో చను వుగా.  టక్కున శ్రీవారు, ‘అవును  ఆ పాపం మీదేనండీ!’ అనగానే నోట మాట రాలేదు పెద్దాయనకి.  నా సావాస దోషం బాగానే పట్టిందనుకున్నా. 

పైగా ఒక సెలవు రోజున ఇంటిల్లిపాదీ పెళ్లి వీడియోలు, ఫోటోలు చూద్దాం అనుకుంటే  ‘పాత గాయాలని రేపకూడదు. చేసిన తప్పులు పదే పదే  తలచుకోవడం అనవసరం ‘ అని సెలవిచ్చారు మా పురుషోత్తముడు. ఆర్నె ల్లుంటే వారు వీరవుతారని ఊరకే అనలేదు పెద్దలు.


ఇలంటి దే మరో  సంఘటన మీతో  పంచుకోవాలి. మా  చెల్లెల్నీ మరిదిగార్నీ వాళ్ల పెళ్లి రోజు సందర్భం లో విష్ చేద్దామని ఫోన్ చేయడం జరిగింది.  మా మరిదిగారితో  (ఉత్త మొక్కుబడిగా కాకుండా ఎదో మాట్లాడాలిగా) ‘అప్పుడే రెండే ళ్ళం డీ  మరిదిగారూ! ‘ అనగానే  ఆయన  జవాబిచ్చిన వైనం చదివి ఆనందించండి.
 ‘అదేవిటండీ, అప్పుడే అంటారు?  ఇంకా రెండేళ్ళే !’(రెండే నా గడిచాయి ? అన్నట్లు )  
‘రెండేళ్లండీ !’(రెండు యుగాల్లా ఉన్నాయండీ బాబూ!  అన్నట్లు )
 ‘రెండే నండీ బాబూ! ‘(ఎప్పటికి గడిచెనురా భగవంతుడా? అన్నట్లు) ,
‘రెండేళ్ళు!’ (బాబోయ్ !ఎలా గడిచాయో, నా తిప్పలు మీకేం తెలుసు అన్నట్లు )  
ఇలా నాటకీయ ఫక్కీ లో ఆయన మాటలు తూటాల్ల్లా దూసుకెళ్ళి పోతూంటే, 'ఇదేవిట్రా ఇలా దొరికిపోయా ' అనుకుంటూ నేను ,  ‘అతి ‘ చమత్కారి అయిన భర్తతో అవతలై వైపు న్న మా చెల్లి అవస్థ ఊహించుకుని   ‘ఉందిలే మంచీ కాలం ముందూ ముందూన ‘ అని ధైర్యం చెప్పి   సంభాషణ ముగించక తప్పలేదు. 

మరోకసారయితే, ఒక జంట ‘సిల్వర్ జూబిలీ ‘ వేడుకలో స్వయానా బావమరిది, ‘మా బావగారికి సన్మానమండీ  ఈరోజు, ఎందుకంటే పాతికేళ్ళు మా అక్కతో వేగినందుకు ‘అని పుబ్లిగ్గా అన్నాడంటే నమ్ముతారా?  మనసులో ఆనందం  ట పాసుల్లా పేల్తున్నా,  పైకి వెలక్కాయ  మింగిన  ఫీలింగిచ్చాడా భర్త  తన భార్య వైపు చూడ కుండా.

నాకు తెలిసిన  మరొక పెద్దమనిషయితే ప్రతీ సంవత్సరం పెళ్లి రోజున రెండు నిముషాలు  మౌనం పాటించాలంటూ ఉంటారు.  (అంటే సంవత్సరం పొడవునా వాళ్ళావిడ ఆయన కి  నోరు విప్పే చాన్సు ఇస్తుందన్నమాట –ఇది  గ్రహించుకుని సంతోషించోద్దూ?)

అయినా నాకు తెలీక అడుగుతాను , అస్తమానం పెళ్లి మీద  ఛలోక్తులు కేవలం మగవాళ్ళే  ఎందుకు వేస్తారండీ? 
ఆడవాళ్ళు ‘వెరీగుడ్ ‘కాబట్టి ! అవునా?

ఈ సారికి ఇంతటితో సరి!

Monday, 12 December 2016

ఓ శుభముహూర్తాన



బ్లాగాయనమ: 

సరదాగా అందరితో కబుర్లు చెప్పాలనిపించింది.  నన్ను ఆపకుండా, నా మాటలు మీరందరూ వినాలంటే కబుర్లు చెప్పడం కంటే రాయడం బెటరనితో చింది. 
కానీ చేత్తో 'పుస్తకాలు' చదివే తీరిక లు, ఓపికలు బాగా తగ్గాయి కాబట్టి   ‘బ్లాగే బహు బాగు  ‘అని ఫిక్సయ్యా!.   

ముందుమాట గా  అక్షరం నేర్పిన అమ్మకి, సదా స్ఫూ ర్తి  నిచ్చిన  నాన్నమ్మకి , వెన్ను తట్టి ప్రోత్సహించే నా మెంటార్ వసుధ గారికి, ప్రేరణ గా నిలిచిన నేస్తం ప్రశాంతికి  బోలెడు కృత జ్ఞత లు. 

ఇంతకీ ఈ రోజు ఏమిటి ప్రత్యేకం  అంటే.. నేను పంతుల వారింట మెట్టి  నేటికి పంతొమ్మిది ఏళ్ళు  పూర్తయ్యాయి .  అనగా             ‘మాధ వాయస్వాహా ‘అని ఔపోసన పడుతూ  దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తోంది. 

నా బాణీ లో మా జంట ని మీ అందరికీ పరిచయం చేస్తాను.  (ఎదో మీ ఎవ్వరికీ  పెద్ద తెలీనట్టు)

ఆయన ‘మిత భాషి’, నేనేమో ‘అమిత భాషి’.  అంటే ఎస్సే రాయమంటే ఒక పదం తో సరిపెడతారాయన, ఖాళీ పూరించమంటే ఎస్సే రాస్తాను నేను.
ఇప్పటికీ ఆయన నోటి ముత్యాలు సరిపడినన్ని జారక,  నా ముత్యాలహారం చేయించు కోవాలనే  కోరిక వాయిదా పడుతూనే వుందంటే నమ్మండి.   

ఆయనది చిరుమందహాసం, నాదేమో  అట్టహాసమ్. కామెడీ సినిమాని కూడా చాలా సీరియస్సుగా తీసుకుంటా రాయన, సెంటిమెంటు సినిమా మీద జోకులేస్తాను  నేను.

క్రికెట్టు మ్యాచు విన్నింగ్ మూమెంట్ల ని సైతం  'అచంచలంగా'  తిలకించే 'స్థిత ప్రజ్ఞత'  ఆయనది.  గెలుపు-ఓటమి  నిమిత్తం  లేకుండా,ప్రతీ బంతికి కెవ్వు కేక , గావు కేక  పెట్టే 'చంచలత్వం' నాది.

ఆయనదేమో   అనౌంన్సుమెంటుని కూడా చెవిలో రహస్యంగా చెప్పే  గుట్టు, నాదే మో రహస్యాన్ని కూడా బహిరంగంగా                  వె ల్లడించే  రట్టు .  

ఆయన కి కుటుంబమే ప్రపంచమయితే, నాకేమో  జగమంతా జట్టే.

ఆయన కు ఇల్లే స్వర్గం. నాకేమో ఇరుగూ పొరుగూ కూడా మెరుగే మరి.

ఆయనకి ఆరు నూరయినా, నూరు ఆరైనా, ససేమిరా కుదరదు. నాకేమో ఆరు నూరయితే, నూరు ఆరయినట్టే! (మాయా శశిరేఖ గుర్తొచ్చిందా?). పెద్దగా పట్టించు కొను .

ముందూ –వెనుకా, మంచీ -చెడూ  అన్నీ ఆచి తూచి  చాలా తీవ్రంగా అలోచించి గానీ అడుగు వెయ్యరాయన . మరేమో,ఒక్క ఉదుటన క్షణంలో ముందుకి దూకేసే హడావిడి  నాది. 

‘ఏమం డో య్ ! ఏడు జన్మల బంధం అంటారు కదా! ‘ అని           నేనం టే , ‘మరే, ఖచ్చి తంగా  ఇది మన ఎడో జన్మే !’ అంటూ చల్లగా తేల్చి చెప్పే చతురత అప్పుడప్పుడు తళుక్కు మంటుంది. నిజ్జంగా!


ఏదయితేనేం, స్వర్ణ కమలం లో మన  భాను ప్రియ చెప్పినట్లు , గంత కు తగ్గ బొంతలాగ, ఆయన  వేణు నాదమంత  మధురమయితే , నేను హు షారంత ఉషస్సునయి  సంసార సాగరం జోరుగా ఈదేస్తున్నాం. ఇలాగే  కలకాలం ఉండడానికి మీ అందరి అభినందనలు, ఆశీస్సు లు ఎల్లప్పుడూ కావాలి సుమండీ.. .

మరి వుంటా
మళ్ళీ కలుద్దాం!