బ్లాగాయనమః
టైటిల్
ఆసక్తికరంగా ఉందికదూ?
గతంలో
ఒకసారి ‘పెళ్లి రోజు’ శీర్షికన యదార్ధంగా జరిగిన కొన్ని సందర్భాలను బ్లాగు ద్వారా పంచుకున్నప్పుడు
ఆడవాళ్ళని ఉద్దేశించి హాస్యాస్పదంగా వ్రాయడం అంత నచ్చలేదన్నారు నాకు ఆత్మీయులయిన కొందరు పాఠకులు.
కాబట్టి, నేటి ‘బ్లాగాంశం’ గనుక ఒకవేళ అదే పంథాలో నడిస్తే, వారిని అన్యథా
భావించవద్దని (ముందు జాగ్రత్త చర్యగా) మనసారా కోరుతూ, ఈ అంశం మీద వ్రాయమని నాకు మా తోటికోడలు సలహా ఇచ్చిందని మనవిచేస్తూ...కలం కదిలిస్తాను. (వేళ్ళు కదిలిస్తాను కీబోర్డు
మీద అనాలేమో?). ఈమధ్య చాలా ఇళ్ళల్లో నేను గమనించిన ఒక పోకడ గురించి ప్రస్తావిస్తా...
వేరే ఎవరింటి గురించో ఎందుకూ? మా ఇంటితోటే మొదలెడితే పోలా? చిత్తగించండి!
వేరే ఎవరింటి గురించో ఎందుకూ? మా ఇంటితోటే మొదలెడితే పోలా? చిత్తగించండి!
మా
వంటింటి సామ్రాజ్యానికి నేను మా అత్తగారు ‘మహారాణులం’.
అంటే ఆవిడ మహారాణి అయితే నేను ‘ఉప’ మహారాణిని అన్నమాట. ఎటువంటి ఏక(ద్వి)చత్రాధిపత్యం సాగుతుందంటే
అంటే మా ఇంటి మగమహారాజుల్ని సైతం అందులోకి అప్పుడప్పుడు మాత్రమే అడుగు పెట్టనిస్తాం. మా సంస్థానం
లోని ప్రతీ వస్తువు మాకు అపురూపం. అందులో ఇద్దరం కదా! ఒక్కో వస్తువుతో ఒకో అనుబంధం,
ఒకే వస్తువు తో వేరే వేరే అనుబంధం పెంచుకున్నాం.
ఈ కోవకి చెందిన అపురూపాలు ఎన్నేన్నో వున్నా, లిస్టులో అతిముఖ్యమయినవి ‘డబ్బాలు’. (హమ్మయ్య!
కష్టపడి అసలు విషయానికి వచ్చేసా). అబ్బా! ఈ డబ్బా!ల వ్యవహారం భలే తమాషాగా వుంటుందండోయ్.
మా ఒక్క ఇంట్లోనే అనుకుంటున్నారా?
అన్నీ
ఒకే రకం (రంగు, షేపు, సైజు) డబ్బాలు ఉంటే, చూడ ముచ్చటగా ఉంటుందనే ఒక అభిప్రాయంతో ఏరి
కోరి కొనుక్కుని వాటిల్లో సరుకులు నింపుకునేవీ కొన్నయితే, వున్న జాగాని బట్టి గూళ్ళల్లో సరిపడేటట్టు తప్పనిసరిగా కోనేవి మరికొన్ని. గాజువి బద్దలవుతాయని స్టీలువీ, స్టీలు
వాటిల్లోంచి వస్తువులు కనపడవని ప్లాస్టిక్ వీ, మైక్రో వేవ్ లో పెట్టుకోవచ్చు వాటిల్లోని
వస్తువులు పాడవవంటూ టప్పర్ వేర్ వీ, మళ్ళీ ఇప్పుడు అన్నిటికంటే మంచివని గాజువీ, రాయల్ గా వుంటాయని పింగాణీవీ... ఇలా ఏదోక
కొత్త రకం మార్కెట్లో సందడి చేయడం, అలా మా గూటికి
చేరడం జరుగుతూనే వుంటుంది. ముఖ్యంగా మా ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ పక్కన వుండే గూట్లో అన్నీ
ఒకేలా వుండే ‘కన్తైనర్స్’ కొనడం మా ఇరువురి ఆడవాళ్ళ కంటే మా మావగారికి మహా ఎక్కువ సరదా.
కానీ
అసలు చిక్కంతా ఎక్కడొస్తుందంటే, ఒక పెళ్లికనీ, పెరంటానికనీ పిలిచి ‘రిటర్న్ గిఫ్ట్’
అంటూ ఒక డబ్బా చేతిలో పెడతారు చూడండి, అప్పుడు మొదలుతుంది. డబ్బా చూస్తే ఎంతో
బావుంటుంది. గూట్లో పెడితే తులసి వనంలో గంజాయి మొక్కలా, ఒంటికాయ సొంఠికొమ్ములా కొట్టొచ్చినట్లు ముచ్చటయిన అమరికలోంచి తేడాగా
తొంగి చూస్తూంటుంది. పైగా
అలాంటి డబ్బాలకి భలే గమ్మత్తుగా నామకరణం కూడా జరుగుతూంటుంది. ఉదాహరణకి ‘రామం కొడుకు ఒడుగు డబ్బా’, ‘పప్పీ గృహప్రవేశం
డబ్బా’, ‘భగవాన్లు గారి షష్టిపూర్తి డబ్బా’, ‘శ్రావణి పెళ్లి డబ్బా’ మొదలుగునవి మా వంటింటి గూళ్ళల్లో కొలువుతీరి వున్నాయి. ఒక్కోసారి ఎవరైనా స్వర్గస్తులయితే కూడా వారి
జ్ఞాపకార్ధం డబ్బాలు పంచుతారు. అలాంటి ఓ డబ్బాకి ‘మేడం వాళ్ళ నాన్నగారి డబ్బా’ అని
నామధేయం. ఇంకా చెప్పాలంటే టిన్ను రేకుల్లాంటి మా కాఫీపొడి, టీపొడి డబ్బాలు ఇలాంటి సెంటిమెంట్ జ్ఞాపకాలని రోజూ పొద్దున్నే వేడిగా అందిస్తూ గట్టిపోటీ తట్టుకుంటూనే మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాయి.
గూట్లో తేడాగా వున్నాయనో, జాగా చాలడంలేదనో పాపం వాటిని తీసేసి, ‘అనంత పద్మనాభుని నేల మాళిగళ్’ ని
తలపించే సొరుగుల్లో దాచేస్తూ వుంటాం. ఎందుకంటే నాకూ మా అత్తగారికీ అంటూ రెండేసి రిటర్న్ గిఫ్ట్
లు వచ్చి చేరుతుంటాయి మా ప్రాణానికి. పోనీ ‘ఎంతో ఇదిగా ఇచ్చిన వాటిని ఇలా దాచేయడం
ఏమిటి? వాడదామమ్మా!’ అన్న అత్తగారి అవస్థకి వాటిని ఎప్పుడైనా మా చుట్టాలకీ, ఇరుగు
పొరుగుకీ ఏవైనా వండిన, ఇంట్లో పండిన వస్తువులు
రవాణా చేయడానికని వాడదామా అంటే, వాళ్ళు కూడా అదే ఫంక్షన్ కి ఒకవేళ వచ్చినట్లయితే, వాళ్ళకీ
అదే రకం డబ్బా వుంటుంది కదా! అప్పుడు మనది వాళ్ళతో కలిసిపోదూ! ఇదో బాధ. అటువంటి
ప్రమాదం లేకుండా నేను గోళ్ళ రంగుతో నీశానీలు పెడుతుంటాననుకొండి. ఎందుకంటే కొంతమందికి
డబ్బాలు తిరిగి ఇచ్చే అలవాటు అంతగా ఉండదు. అంతా మనదే! అన్నీ మనవే అనే ధోరణిలో ఎంచక్కా తర తమ భేదం లేకుండా వాడేసుకుంటారు.
వాళ్ళు తమంతట తామే చాన్నాళ్ళకు డబ్బా తెచ్చిస్తే ‘అబ్బే! దీనికేముందండీ తొందర. డబ్బా
ఇవ్వడానికోచ్చారా?’ అని భారీ డైలాగేసేసి వాళ్ళ మార్కులు కొట్టేస్తుంటా. వాళ్ళు
గనుక జాతీయం చేసే ఆలోచన లో వున్నారనే బలమయిన అనుమానం తలెత్తితే మటుకూ వాళ్ళతో ఫోన్లో
మాట్లాడినప్పుడో, వాళ్ళని కలసినప్పుడో డబ్బాల విషయం ప్రస్తావించకుండా ఉండలేను బాబూ!, ఇంటి మగవాళ్ళు
వింటే వాళ్లకి ఎక్కడ లేని చికాకు.
ఫలానా
డబ్బా కనబడుట లేదు అని ‘నేల మాళిగళ్’ లో కూడా వెతికిన తరువాత నిర్ధారించుకోగానే మా అత్తయ్యగారు ఒక లాయర్, నేనొక దిటెక్టివ్ అవతారం ఎత్తుతాం. ‘మీ అమ్మగారికి గానీ మీ వసుధ మేడం కి గానీ ఏవైనా పంపించామేమో అమ్మా జ్ఞాపకం తెచ్చుకో?’ అని ఆవిడ అడగడం, కాస్సేపు
దీర్ఘంగా ఆలోచించి ‘లేదత్తయ్యగారూ, క్రితం వారం అక్కదగ్గర (మా తోటికోడలు) ఉన్నట్టు గుర్తు.... ఆ! గుర్తొచ్చింది మా అమ్మకీ మేడంకీ కాదు ఛాయ పిన్నికో (ఆవిడ చెల్లెలే!) సిరికో (మా ఆడపడుచే)
పంపిచారనుకుంటా మీరే! చింతకాయపులుసుతో మొన్న ఆదివారం’ అని ఘంటాపథంగా నేను జవాబు ఇవ్వడం ...'
ఇలా డబ్బాల కదలికల్ని ట్రాక్ చేస్తూ వాటి ఉనికిని పట్టుకునే మా తీవ్ర ప్రయత్నాన్ని మా
మావగారు ఎన్నో సార్లు అపార్ధం చేసుకుంటూంటారు. ‘వాటి గురించి అంత అవస్థ ఎందుకర్రా! నాకు గానీ
కోపం వచ్చిందంటే వంద డబ్బాలు ఒకేసారి కొని పారేస్తాను చూసుకోండి’ అని మా ఇంటి సీనియర్
పురుష పుంగవుడు శపథం చేస్తుంటారు మా ‘సొంత డబ్బావేదన’ విని. త్వరలో డబ్బాలకి 'ట్రాకింగ్ చిప్' తగిల్చి తయారుచేస్తారేమో! ఎంచక్కా 'సొంత డబ్బా' ఎక్కడుందో వారు ట్రాక్ చేసుకోగలిగితే మనశ్శాంతి కూడానూ.
ఇలా
జనాల్లో ప్రబలి పోయిన డబ్బాల మమకారాన్ని కంపెనీలు భలే క్యాష్ చేసుకుంటున్నాయి
కూడానూ. కాఫీపొడితో , ఇంగువతో, సర్ఫ్ పొడితో ‘డబ్బా ఉచితం’ అంటూ మొదలెట్టి మగవాళ్ళ
ప్యాంటు షర్టు బిట్టుల దగ్గర్నుంచీ ఆడవాళ్ళ లోదుస్తుల వరకూ కూడా అన్నీ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి విక్రయిస్తున్నారు.
బట్టలతో పాటూ డబ్బాలు కూడా వాడేసుకుని సంబరపడిపోతామని. నిజ్జంగానండీ! మా
చిన్నాన్నగారి అమ్మాయి పెళ్ళికి ఎన్ని డబ్బాల్లో బట్టలు పెట్టుబడికి కొన్నారంటే...
అలా వచ్చిన డబ్బాల్లోనే మా అందరికి తిరుగు ప్రయాణమప్పుడు రైల్లోకి ఫలహారాలు సర్దిచ్చింది
మా పిన్ని. దగ్గిర బంధువులందరికీ కనీసం ఇంటికి రెండు డబ్బాలు ఉచితం (మగపెళ్లివారికి ఒక్క డబ్బా ఇస్తే ఒట్టు! ఎంత నష్టపోయారో!). ఇది బాగానే వుంది కానీ ఓసారి మా ఇంటికి లోదుస్తుల డబ్బాలో మిరపళ్ళ
పచ్చడి వచ్చింది వేరొక ఇంటి నుంచి. అప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించిందంటే నమ్మండి. పచ్చడి లాగించేసి వాళ్ళ డబ్బా తిరిగివ్వలేదు. ఇంకేవరికయినా ఇలాగే పంపుతారేమోనని.
అసలు
పై దేశాల్లో ఇలాంటి ఇబ్బందులే వుండవట! నెల సామాన్లతో పాటూ ‘టేకవే బాక్సులు’ అనబడే
డిస్పోసబుల్ డాబ్బాలు కొనేస్తారట. వాటిల్లోనే ఎవరికయినా ఏమయినా పంపడం అంటూ ఆస్ట్రేలియా అనుభవాలు తరచు
తలుస్తారు అత్తయ్యగారు. ఈ మధ్య మనకి కూడా దొరుకుతున్న డిస్పోసబుల్ డబ్బాలని సైతం కడిగేసుకుని
ఎందుకయినా మంచిదని దాచేసుకోవడం వాడేసుకోవడం వంటి జాగ్రత్తపరులు చాలామందిని మనం చూడొచ్చు. హతవిధీ!
సర్లెండి! చుట్టూ ఇలాంటివి పోకడలు వున్నాయి కాబట్టే ఈ అఖిలం మధురం. కదా!
అన్నట్టు మాటల్లోపడి మర్చిపోతాను. మా ‘సొంత డబ్బా’ ఏదయినా మీ ఇంట్లో ఉండిపోతే దయచేసి మర్చిపోకుండా పంపించేయండే! నాకసలే ఏ ఒక్కటి కనపించక పోయినా నిద్రపట్టదు!
అన్నట్టు మాటల్లోపడి మర్చిపోతాను. మా ‘సొంత డబ్బా’ ఏదయినా మీ ఇంట్లో ఉండిపోతే దయచేసి మర్చిపోకుండా పంపించేయండే! నాకసలే ఏ ఒక్కటి కనపించక పోయినా నిద్రపట్టదు!
మరి ఉంటానే!