Thursday, 12 January 2017

సంక్రాంతి సంబరాలు



బ్లాగాయనమః

నా  నేస్తం  ఒకరు , వాళ్ల   అమ్మగారు వేసే  ముగ్గుల ఫోటోలు   ఫేస్బుక్కులో  పెట్టి    సంక్రాంతి ముచ్చట్లు    గుర్తు తెచ్చుకుంది .  వెంటనే  నేనూ  రింగులు తిప్పుతూ  ‘ప్లాష్ బ్యాక్ ‘లో కి  వెళ్ళా .  ముగ్గులతో   అల్లుకున్న   జ్ఞాపకాలు  బోలెడు.   అమ్మ  దగ్గర ముగ్గులు  నేర్చుకోవడం  మొదలు పెట్టాక,   ప్రతీ  నోట్ బుక్కులోనూ   ప్రాక్టీసే. ఒకవేళ   ఎక్కువ చుక్కలుంటే   మధ్యకుట్టు నుంచి  పేజీలు  మాయమయ్యేవి .     

మా  ఇంటి ముందు   స్కూటర్  బయటకి  జారడానికి  వీలుగా  చప్టా వుండేది . దానివల్ల   వాకిలికి   మూడు పక్కల  ముగ్గులు పెట్టే   అవకాశం  వుండేది.     మధ్యలో   బారెడు  ముగ్గు    అమ్మ వేస్తే ,   ఇరుపక్కలా   వున్న  చారెడు  జాగాలో   మూరెడు ముగ్గు  వేసి   సరిపెట్టుకోవలసివచ్చేది  నేను.    క్రమేపి   నాకూ   సీనియారిటీ  వచ్చి ,  బారెడు   వాకిలి మొత్తాన్ని   ఆక్రమించాననుకోండి.    

ధనుర్మాసంలో   దోమలు  ఎక్కువవటం చేత ,   మా  నానమ్మ   పాపం   నేను ముగ్గు వేసే  సమయం అంతా ,  దోమలు కుట్టకుండా   విసినకర్ర తో  విసురుతూ   పక్కనే కూర్చునేది    ఓపిక  చేసుకొని .   కొన్నిసార్లు   పక్కనే   దోమల చక్రం కూడా  వెలిగించేది.
 
ఇక  పేడనీళ్ళ తో   కళ్ళాపి  జల్లితే    చాలా  బావుండేది .   స్కూలు నుంచి   ఇంటికి వచ్చే దారంతా    పేడ  కోసం వేటే .  ఎక్కడయినా కనపడిందా !   ఇంటికొచ్చి   మాకు  పనిలో సాయం చేసే అమ్మాయిని    సైకిలె క్కిం చుకుని  వెళ్లి   ఇద్దరం  అయోమయం లాగ   గోమయం (?) ఇంటికి తెచ్చే వాళ్ళం.   వేసిన ముగ్గు వెయ్యకుండా   పండుగ  దగ్గిర పడుతున్నకొద్దీ   చుక్కలు  పెంచుకుంటూ పోవడం   చాలా  ఉత్సాహంగా  అనిపించేది.   
    
ఇక రంగుల ముగ్గు  వెయ్యా ల్సి వచ్చిన రోజు    దాదాపు  జాగారమే .   అంటే  రాత్రంతా  ముగ్గు వేసేదా న్ననుకుంటు న్నారా?   అబ్బే  లేదండీ !  అర్దరాత్రి  వరకూ   కష్టపడి వేసిన  ముగ్గు   తెల్లారేసరికీ   అలాగే  వుంటుందో?  లేదో?   అని  ఒకటే   టెన్ ష న్.  ఎందుకంటే   తెల్లారి   ఇళ్ళ ముందు   పాలు పితకడానికి  గేదెల ని  తోలుకెళ్ళేవాళ్ళూ ,   ఏమీ తోచని  ఊరు కుక్కలూ   ఇలా ఏవో ఒకటి  ముగ్గు మీద  తైతక్కలాడి   ముగ్గు కి   ‘ఆబ్స్ట్రాక్ట్  పెయింటింగ్ ‘  లుక్కు ఇచ్చేవి  .   

ఓ సారి   నా దగ్గర  వున్న రంగులు కాక   ఇంకో  రంగు  అవసరమై,   సర్ఫ్  గుండ  వాడేసాను.   మరునాడు   వాకిలి కడిగినప్పుడు   వచ్చిన నురుగు కి   వీధంతా  శుభ్రమయ్యింది .   ఒక్క విషయం   మటుకు   ఒప్పుకోవాల్సిందే ,  మెలికెల ముగ్గులు  వేయడం  చాలా కష్టం సుమండీ !   కనుమ నాటి  మెలికల రథం  ముగ్గు  వెయ్యాలంటే ,  నాకు తాతలు  దిగి  వచ్చినట్లే .  అందుకని,  పిండి వంటలు చేసి చేసి   అలసిపోయాక కూడా  అమ్మే వేసేది మరి.

 ఫ్లాష్ బ్యాక్  లోంచి   ప్రస్తుతానికి  వస్తే , ఈ మధ్యకాలంలో    మట్టిజాగా  బాగా తగ్గిపోయి ,  సుద్దతో ముగ్గులే  శరణ్యం  అయ్యాయి.  ఇంకా   సుళువయిన పని  ఏమిటంటే ,  సంవత్సరానికి  ఒక సారి   పెయింట్ తో  ముగ్గు వేసెయ్యడం.   రోజూ గంటల  తరబడి   నడ్డి వంచే పని లేదు .   వాకిలి  కడిగాక    శాస్త్రానికి   సుద్దతో  అలా అలా   నాలుగు గీతలు  పెడితే  సరి.

చిన్నపట్నుంచీ   పట్నవాసం  అవ్వటం  చేత  గొబ్బెమ్మల సరదా  తీరలేదనే చెప్పాలి.   అన్నట్టు  'గొబ్బెమ్మలు'  అనగానే,  ఒక విషయం  మీకు  చెప్పే దాకా తోచదు నాకు  .   నినన్నే  తెలిసిన వార్త   ఏమిటంటే,    అమజాన్ లో   ‘పిడకలు ‘  అమ్ముతున్నారు ట .   అయిదు  పిడకల సెట్టు   జస్ట్   పద్నాలుగు  వందలు   అంతే!  

 ఒకవేళ  మీరు  పట్నావాసులైవుండి   భోగి మంటలోకి  పిడకలు   దొరకకపోతే    వెంఠనే  అంతర్జాలంలోకి   వెళ్లి   ఆర్డరు పెట్టయ్యడమే!   ఇది విని   మా మేడం  ఒకరు  భవిష్యవాణి  చెప్పారం డోయ్ !  రాబోయే  రోజుల్లో   ‘ఫ్రోజెన్ గొబ్బెమ్మలు’ కూడా  రావచ్చ ట .   అంటే  బట్టలూ, పిండి వంటలతో పాటూ  అన్నీ 'ఆన్ లైనే ' ఇంకేం  మరి,   ‘ హై టెక్కు  సంక్రాంతి’   సంబరంగా   జరుపుకుందాం .   నాకయితే  మా శ్రీవారి పుట్టినరోజు  కూడా   కావటం విశేషం.  అంటే మా  సంక్రాంతి   డబల్  ధమాకా . 

మళ్ళీ కలుద్దా మే!