Tuesday, 12 December 2017

వార్షికోత్సవం



బ్లాగాభిమానులందరికీ బోలెడు కృతజ్ఞతలు చెప్పుకుంటున్న బ్లాగుష. 

అదేవిటి ‘వెల్కం స్పీచ్’ లేకుండా ఈ ‘వోట్ ఆఫ్ థ్యాంక్స్’  అనుకుంటున్నారా? భలే వారే! సిసలు విషయం ఏమిటంటే ‘అఖిలం మధురం’ మొదలయ్యి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం గడిచింది. బ్లాగు ద్వారా నేను మీతో పంచుకున్న ప్రతీ చిన్న విషయాన్నీ పెద్ద మనసుతో ఆస్వాదించారు కదా! మరి ఆ మాత్రం కృతజ్ఞత తెలపాలిగా? (ముందర కాళ్ళకి బంధం వెయ్యొద్దూ?). అసలే ఎదో ఒక రూపంలో మా బంధు మిత్ర సపరివారమంతా బ్లాగులో తళుక్కుమంటూంటారు కదా? బ్లాగు పుణ్యమా అని మా అబ్బాయిని కొద్దిగా, శ్రీవారిని సుమారుగా, అత్తగారిని ఓ మాదిరిగా, మావగారిని దాదాపు సంపూర్తిగా అందరికీ పరిచయం చేసేసాగా. మిగతా వాళ్ళకీ క్లుప్తంగా అయినా న్యాయం చెయ్యొద్దూ!

ముందుగా మా ఇంటి ఆడపడుచు, మా ‘సిరి’ గురించి ప్రస్తావిస్తాను. అర్ధమోగుడే అయినా జగదేక వీరుని కథలోలా ‘ఓ హలా! ఒసేయ్! ఏమే! ఏమిటే!’ అనుకునే అంత చనువు ఇచ్చేసి పెత్తనం చలాయించే హక్కు వదిలేసుకుంది పాపం. మా ఇద్దరికీ ఇష్టమయిన సంగీతంలో నాతో గొంతు కలుపుతూ సరదాగా సరిగమలు పలకడం, మేమిద్దరం ఎంతో ఎంజాయ్ చేసే వ్యాపకం (శ్రోతల అభిప్రాయాల సంగతి మాకనవసరం అనుకోండి). ఇక ఆడపడుచు శ్రీవారయిన మా అన్నగారు రవి సంగతి చెప్పకనే చెప్పాలి. అపర కుబెరుడే అయినా, ఎటువంటి భేషజం లేకుండా   పిల్లల్లో పిల్లాడిలా ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ, నాకు సొంత చెల్లెలికిచ్చే స్థానమిచ్చేసి ఆప్యాయంగా డార్లింగ్ బ్రదర్ అయిపోయారాయన. 

బావగారు సుధాకరుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. చాలా విషయాల్లో పెద్దరికం కనబరుస్తూనే, ‘ఎంటమ్మాయ్! సంగతులు’ అంటూ తమ్ముడితో కంటే మరదలినయిన నాతోనే ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకుని ‘నేను ఎల్లప్పుడూ అమ్మాయి నే’ అనే సంతూర్ యూత్ ఫీలింగ్ కలిగిస్తుంటారు. ఇక నాదీ మా తోటికోడలు  అరుణదీ నక్షత్రం ఒకటే. పుట్టింట్లో నేనే పెద్దదాన్నవడంతో ‘అక్కచేసే ముద్దు’ నాకు మా తోటప్ప దగ్గరే తీరుతుంది. దబాయించేసే చొరవ కూడా ఇచ్చేసి పాపం ‘నీ లాగ నేను ఉండలేనే’ అని అంటూ వుంటుంది. అది అలా అన్నప్పుడల్లా ‘తన లా వుండడం నాకెంత కష్టమో!’ అని అనిపిస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కని చూసిన ఎవరికయినా ‘దేవత’ సినిమాలో సావిత్రి స్ఫురించక మానదు. మాట, చేత, హైటు మరియు వెయిటు తో సహా. గలగలా గోదారి నేనయితే నిండు నిశ్చల కృష్ణవేణి మా అక్క అని కితాబు(?) ఇచ్చారు మా పిన్నత్తగారు. వీళ్ళే నా చీర్ లీడింగ్ టీం కూడా.

ఇలా భిన్న వ్యక్తిత్వాలున్న వీళ్ళందరితో ఆనందంగా ఆహ్లాదంగా సాగే మా ఇంటి రామాయణం (సు)వర్ణాల మేళణమ్.

 ‘సిసలు’ సంగతి బ్లాగు వార్షికోత్సవం అయితే ఈ రోజుయొక్క ‘అసలు’ విశేషం మా ‘సప్తపది’కి రెండు దశాబ్దాలు గడిచాయి. అంటే మా ఇంటి ఇంద్రధనుస్సు లో నేనూ ఓ వర్ణమయి మెరుస్తూ ఇరవై సంవత్సరాలు పూర్తయ్యాయి. 

శ్రీవారి సమేతంగా మీ అందరి అభినందనలూ సదా కోరుతూ.... మీ బ్లాగుష

Saturday, 11 November 2017

సొంత డబ్బా


బ్లాగాయనమః 

టైటిల్ ఆసక్తికరంగా ఉందికదూ?

              గతంలో ఒకసారి ‘పెళ్లి రోజు’ శీర్షికన యదార్ధంగా జరిగిన కొన్ని సందర్భాలను బ్లాగు ద్వారా పంచుకున్నప్పుడు ఆడవాళ్ళని ఉద్దేశించి హాస్యాస్పదంగా వ్రాయడం అంత నచ్చలేదన్నారు నాకు ఆత్మీయులయిన కొందరు పాఠకులు. కాబట్టి, నేటి ‘బ్లాగాంశం’ గనుక ఒకవేళ అదే పంథాలో నడిస్తే, వారిని అన్యథా భావించవద్దని (ముందు జాగ్రత్త చర్యగా) మనసారా కోరుతూ, ఈ అంశం మీద వ్రాయమని నాకు మా తోటికోడలు సలహా ఇచ్చిందని మనవిచేస్తూ...కలం కదిలిస్తాను. (వేళ్ళు  కదిలిస్తాను కీబోర్డు మీద అనాలేమో?). ఈమధ్య చాలా ఇళ్ళల్లో నేను గమనించిన ఒక పోకడ గురించి ప్రస్తావిస్తా...

           వేరే ఎవరింటి గురించో ఎందుకూ? మా ఇంటితోటే మొదలెడితే పోలా? చిత్తగించండి!

          మా వంటింటి సామ్రాజ్యానికి  నేను మా అత్తగారు ‘మహారాణులం’. అంటే ఆవిడ మహారాణి అయితే నేను ‘ఉప’ మహారాణిని అన్నమాట. ఎటువంటి ఏక(ద్వి)చత్రాధిపత్యం సాగుతుందంటే అంటే మా ఇంటి మగమహారాజుల్ని సైతం అందులోకి  అప్పుడప్పుడు మాత్రమే అడుగు పెట్టనిస్తాం. మా సంస్థానం లోని ప్రతీ వస్తువు మాకు అపురూపం. అందులో ఇద్దరం కదా! ఒక్కో వస్తువుతో ఒకో అనుబంధం, ఒకే వస్తువు తో వేరే  వేరే అనుబంధం పెంచుకున్నాం. ఈ కోవకి చెందిన అపురూపాలు ఎన్నేన్నో వున్నా, లిస్టులో అతిముఖ్యమయినవి ‘డబ్బాలు’. (హమ్మయ్య! కష్టపడి అసలు విషయానికి వచ్చేసా). అబ్బా! ఈ డబ్బా!ల వ్యవహారం భలే తమాషాగా వుంటుందండోయ్.  మా ఒక్క ఇంట్లోనే అనుకుంటున్నారా?

        అన్నీ ఒకే రకం (రంగు, షేపు, సైజు) డబ్బాలు ఉంటే, చూడ ముచ్చటగా ఉంటుందనే ఒక అభిప్రాయంతో ఏరి కోరి కొనుక్కుని వాటిల్లో సరుకులు నింపుకునేవీ కొన్నయితే, వున్న జాగాని బట్టి గూళ్ళల్లో సరిపడేటట్టు తప్పనిసరిగా కోనేవి మరికొన్ని. గాజువి బద్దలవుతాయని స్టీలువీ, స్టీలు వాటిల్లోంచి వస్తువులు కనపడవని ప్లాస్టిక్ వీ, మైక్రో వేవ్ లో పెట్టుకోవచ్చు వాటిల్లోని వస్తువులు పాడవవంటూ టప్పర్ వేర్ వీ, మళ్ళీ ఇప్పుడు అన్నిటికంటే మంచివని గాజువీ, రాయల్ గా వుంటాయని పింగాణీవీ... ఇలా ఏదోక కొత్త రకం మార్కెట్లో సందడి చేయడం, అలా మా  గూటికి చేరడం జరుగుతూనే వుంటుంది. ముఖ్యంగా మా ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ పక్కన వుండే గూట్లో అన్నీ ఒకేలా వుండే ‘కన్తైనర్స్’ కొనడం మా ఇరువురి ఆడవాళ్ళ కంటే మా మావగారికి మహా ఎక్కువ సరదా. 

       కానీ అసలు చిక్కంతా ఎక్కడొస్తుందంటే, ఒక పెళ్లికనీ, పెరంటానికనీ పిలిచి ‘రిటర్న్ గిఫ్ట్’ అంటూ ఒక డబ్బా చేతిలో పెడతారు చూడండి, అప్పుడు మొదలుతుంది. డబ్బా చూస్తే ఎంతో బావుంటుంది. గూట్లో పెడితే తులసి వనంలో గంజాయి మొక్కలా, ఒంటికాయ సొంఠికొమ్ములా  కొట్టొచ్చినట్లు ముచ్చటయిన అమరికలోంచి తేడాగా తొంగి చూస్తూంటుంది. పైగా అలాంటి డబ్బాలకి భలే గమ్మత్తుగా నామకరణం కూడా జరుగుతూంటుంది. ఉదాహరణకి  ‘రామం కొడుకు ఒడుగు డబ్బా’, ‘పప్పీ గృహప్రవేశం డబ్బా’, ‘భగవాన్లు గారి షష్టిపూర్తి డబ్బా’, ‘శ్రావణి పెళ్లి డబ్బా’ మొదలుగునవి మా వంటింటి గూళ్ళల్లో కొలువుతీరి వున్నాయి. ఒక్కోసారి ఎవరైనా స్వర్గస్తులయితే కూడా వారి జ్ఞాపకార్ధం డబ్బాలు పంచుతారు. అలాంటి ఓ డబ్బాకి ‘మేడం వాళ్ళ నాన్నగారి డబ్బా’ అని నామధేయం.  ఇంకా చెప్పాలంటే టిన్ను రేకుల్లాంటి మా కాఫీపొడి, టీపొడి డబ్బాలు ఇలాంటి సెంటిమెంట్ జ్ఞాపకాలని రోజూ పొద్దున్నే వేడిగా అందిస్తూ గట్టిపోటీ తట్టుకుంటూనే మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాయి.

        గూట్లో తేడాగా వున్నాయనో, జాగా చాలడంలేదనో పాపం వాటిని  తీసేసి, ‘అనంత పద్మనాభుని నేల మాళిగళ్’ ని తలపించే సొరుగుల్లో దాచేస్తూ వుంటాం. ఎందుకంటే  నాకూ మా అత్తగారికీ అంటూ రెండేసి రిటర్న్ గిఫ్ట్ లు  వచ్చి చేరుతుంటాయి మా ప్రాణానికి.  పోనీ ‘ఎంతో ఇదిగా ఇచ్చిన వాటిని ఇలా దాచేయడం ఏమిటి? వాడదామమ్మా!’ అన్న అత్తగారి అవస్థకి వాటిని ఎప్పుడైనా మా చుట్టాలకీ, ఇరుగు పొరుగుకీ  ఏవైనా వండిన, ఇంట్లో పండిన వస్తువులు రవాణా చేయడానికని వాడదామా అంటే, వాళ్ళు కూడా అదే ఫంక్షన్ కి ఒకవేళ వచ్చినట్లయితే, వాళ్ళకీ అదే రకం డబ్బా వుంటుంది కదా! అప్పుడు మనది వాళ్ళతో కలిసిపోదూ! ఇదో బాధ. అటువంటి ప్రమాదం లేకుండా నేను గోళ్ళ రంగుతో నీశానీలు పెడుతుంటాననుకొండి. ఎందుకంటే కొంతమందికి డబ్బాలు తిరిగి ఇచ్చే అలవాటు అంతగా ఉండదు. అంతా మనదే! అన్నీ మనవే  అనే ధోరణిలో ఎంచక్కా తర తమ భేదం లేకుండా వాడేసుకుంటారు. వాళ్ళు తమంతట తామే చాన్నాళ్ళకు డబ్బా తెచ్చిస్తే ‘అబ్బే! దీనికేముందండీ తొందర. డబ్బా ఇవ్వడానికోచ్చారా?’ అని భారీ డైలాగేసేసి  వాళ్ళ మార్కులు కొట్టేస్తుంటా. వాళ్ళు గనుక జాతీయం చేసే ఆలోచన లో వున్నారనే బలమయిన అనుమానం తలెత్తితే మటుకూ వాళ్ళతో ఫోన్లో మాట్లాడినప్పుడో, వాళ్ళని కలసినప్పుడో డబ్బాల విషయం ప్రస్తావించకుండా ఉండలేను బాబూ!, ఇంటి మగవాళ్ళు వింటే వాళ్లకి ఎక్కడ లేని చికాకు. 

        ఫలానా డబ్బా కనబడుట లేదు అని ‘నేల మాళిగళ్’ లో కూడా వెతికిన తరువాత నిర్ధారించుకోగానే మా అత్తయ్యగారు ఒక లాయర్, నేనొక దిటెక్టివ్ అవతారం ఎత్తుతాం. ‘మీ అమ్మగారికి గానీ మీ వసుధ మేడం కి గానీ ఏవైనా పంపించామేమో అమ్మా జ్ఞాపకం తెచ్చుకో?’ అని ఆవిడ అడగడం, కాస్సేపు దీర్ఘంగా ఆలోచించి ‘లేదత్తయ్యగారూ, క్రితం వారం అక్కదగ్గర  (మా తోటికోడలు) ఉన్నట్టు గుర్తు.... ఆ! గుర్తొచ్చింది మా అమ్మకీ మేడంకీ కాదు ఛాయ పిన్నికో (ఆవిడ చెల్లెలే!) సిరికో (మా ఆడపడుచే) పంపిచారనుకుంటా మీరే! చింతకాయపులుసుతో మొన్న ఆదివారం’ అని ఘంటాపథంగా నేను జవాబు ఇవ్వడం ...' ఇలా డబ్బాల కదలికల్ని ట్రాక్ చేస్తూ వాటి ఉనికిని పట్టుకునే మా తీవ్ర ప్రయత్నాన్ని మా మావగారు ఎన్నో సార్లు అపార్ధం చేసుకుంటూంటారు.  ‘వాటి గురించి అంత అవస్థ ఎందుకర్రా! నాకు గానీ కోపం వచ్చిందంటే వంద డబ్బాలు ఒకేసారి కొని పారేస్తాను చూసుకోండి’ అని మా ఇంటి సీనియర్ పురుష పుంగవుడు శపథం చేస్తుంటారు మా ‘సొంత డబ్బావేదన’ విని. త్వరలో డబ్బాలకి 'ట్రాకింగ్ చిప్' తగిల్చి  తయారుచేస్తారేమో! ఎంచక్కా 'సొంత డబ్బా' ఎక్కడుందో వారు ట్రాక్ చేసుకోగలిగితే మనశ్శాంతి కూడానూ.

        ఇలా జనాల్లో ప్రబలి పోయిన డబ్బాల మమకారాన్ని కంపెనీలు భలే క్యాష్ చేసుకుంటున్నాయి కూడానూ. కాఫీపొడితో , ఇంగువతో, సర్ఫ్ పొడితో ‘డబ్బా ఉచితం’ అంటూ మొదలెట్టి మగవాళ్ళ ప్యాంటు షర్టు బిట్టుల దగ్గర్నుంచీ ఆడవాళ్ళ లోదుస్తుల వరకూ కూడా అన్నీ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి విక్రయిస్తున్నారు. బట్టలతో పాటూ డబ్బాలు కూడా వాడేసుకుని సంబరపడిపోతామని. నిజ్జంగానండీ! మా చిన్నాన్నగారి అమ్మాయి పెళ్ళికి ఎన్ని డబ్బాల్లో బట్టలు పెట్టుబడికి కొన్నారంటే... అలా వచ్చిన డబ్బాల్లోనే మా అందరికి తిరుగు ప్రయాణమప్పుడు రైల్లోకి ఫలహారాలు సర్దిచ్చింది మా పిన్ని. దగ్గిర బంధువులందరికీ కనీసం ఇంటికి రెండు డబ్బాలు ఉచితం (మగపెళ్లివారికి ఒక్క డబ్బా ఇస్తే ఒట్టు! ఎంత నష్టపోయారో!). ఇది బాగానే వుంది కానీ ఓసారి మా ఇంటికి లోదుస్తుల డబ్బాలో మిరపళ్ళ పచ్చడి వచ్చింది వేరొక ఇంటి నుంచి. అప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించిందంటే నమ్మండి. పచ్చడి లాగించేసి వాళ్ళ డబ్బా తిరిగివ్వలేదు. ఇంకేవరికయినా ఇలాగే పంపుతారేమోనని.
  
         అసలు పై దేశాల్లో ఇలాంటి ఇబ్బందులే వుండవట! నెల సామాన్లతో పాటూ ‘టేకవే బాక్సులు’ అనబడే డిస్పోసబుల్ డాబ్బాలు కొనేస్తారట. వాటిల్లోనే ఎవరికయినా ఏమయినా పంపడం అంటూ ఆస్ట్రేలియా అనుభవాలు తరచు తలుస్తారు అత్తయ్యగారు. ఈ మధ్య మనకి కూడా దొరుకుతున్న డిస్పోసబుల్ డబ్బాలని సైతం కడిగేసుకుని ఎందుకయినా మంచిదని దాచేసుకోవడం వాడేసుకోవడం వంటి జాగ్రత్తపరులు చాలామందిని మనం చూడొచ్చు. హతవిధీ!

         సర్లెండి! చుట్టూ ఇలాంటివి పోకడలు వున్నాయి కాబట్టే ఈ అఖిలం మధురం. కదా!
అన్నట్టు మాటల్లోపడి మర్చిపోతాను. మా ‘సొంత డబ్బా’ ఏదయినా మీ ఇంట్లో ఉండిపోతే దయచేసి మర్చిపోకుండా పంపించేయండే! నాకసలే ఏ ఒక్కటి కనపించక పోయినా నిద్రపట్టదు!

మరి ఉంటానే!

Friday, 22 September 2017

Daddyకి ప్రేమతో!



బ్లాగాయనమః 

        చాలామంది నన్ను ' మీ నాన్నగారి గురించి కూడా వ్రాయండి ' అని కోరారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నన్ను మలచిన మా నాన్నని మీకు పరిచయం చేసే ప్రయత్నం ఇది.

     సరిగ్గా డబ్భై సంవత్సరాల క్రితం బాపట్లలో జడ్జీగారింట మొదటి మనవడిగా పుట్టారు మా డాడీ అనబడే  మన ఈ సంచిక హీరో.  వారి అక్షరాభ్యాసం  అయ్యాక  వారిని ఓపెన్ టాప్ కార్లో ఊరేగించారంటే, ఇక వారికి  జరిగిన ముద్దు ముచ్చట గురించి వేరే  చెప్పక్కర్లేదు.  మా తాతగారి పోలీసు ఉద్యోగ బదిలీల రీత్యా డాడీ  చదువు  విజయవాడ , కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు  మీదుగా  డిగ్రీ వరకూ పూర్తయ్యి, హైదరాబాదులో ఎల్ ఎల్ బీ తో సంపూర్ణమయ్యింది. ఓ రెండేళ్ళు  చె.కిం.ప్లీ. గా, జూనియర్  న్యాయవాదిగా  నల్లకోటు సరదా తీర్చేసుకుని, ఒక మూడు సార్లు  కలక్టర్ అయ్యే ప్రయత్నం చేసి (ఇంటర్వ్యూ దాకా వెళ్ళారండోయ్), తన వేలు విడిచిన మేనమామ  అమూల్యమయిన సలహా మేరకు  బ్యాంకు  పరీక్ష వ్రాసి  భారతీయ స్టేట్ బ్యాంకులో  గుమాస్తాగా చేరారు మన హీరో. నేటికీ మొదటి ముద్ద నోట్లో పెట్టుకునే ముందు ఆ మేనమామని కృతజ్ఞతతో స్మరించుకుంటారు.

     హీరో అంటే హీరోయే మరి. ఆ రోజుల్లో ఓసారి ‘ఇంతకంటే లేత వంకాయలు లేవా?’ అని ఆయన అడిగితే ‘అవును మరి అన్నీ నీ అంత లేతగా ఉంటాయా?’ అని గడుసు జవాబిచ్చిందిట కూరలమ్మాయి. బ్యాంకులోని ఒక సీనియర్ ఉద్యోగి అయితే తన అరడజను కూతుర్లలో ఎవరో ఒకరిని నిర్మొహమాటంగా ఆఫర్ చేయబోతే, ‘నాకు మేనరికం వుందండీ!’ అని తప్పించుకున్నారు మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచేలర్. ఆయన మేనమామ కూతురికి అప్పట్లో కేవలం రెండు సంవత్సరాల వయసనుకోండి. అది వేరే విషయం. 

       ఇక మన చాక్లెట్ బాయ్ కి అష్టకష్టాలూ పడి ఆయనకి ధీటుగా వుండే ‘రమ’ ని కట్టబెట్టేసి హమ్మయ్య అనుకున్నారు మా నానమ్మ తాతగారు.
కూర్చున్నా, నించున్నా, తుమ్మినా ఆయనకి ఉన్న ‘రామా’ అని నిట్టూర్చే అలవాటుని గమనించి,  ఏరా? హ్రస్వమా (రమా)?దీర్ఘమా (రామా)? అని ఆట పట్టించే వారు ఆయన ప్రాణ స్నేహితులు రఘురామం. పెళ్ళయిన కొత్తల్లో సినిమా హాల్లో భార్యకి తినడానికి పూరీ జారుడు కూర(?) పొట్లం కట్టించి తెచ్చి తన ఖ్యాతిని చిరస్మరణీయం చేసుకున్నారు మన సింపుల్ సాయి. (అప్పుడు ఐనాక్స్ థియేటర్లు లేవుగామరి? ఇంకో విషయం ఏమిటంటే, పాపం ఇప్పటికీ ఆయన ఫేవరేట్ టిఫిన్ అదే). 

      మరో సంవత్సరానికి నేనున్నానంటూ తయారయిన నాకు డాడీగా మారారు మన హీరో. సరిగ్గా పదకొండు నెలలకి ‘డాడీ పూయీ బావుందా?’ అన్న నా మెదటి వాక్యం ఇప్పటికి ఆయన కొన్ని కోట్ల సార్లు తల్చుకుని వుంటారు. నాలుగేళ్ళు నేను ఏకచత్రాధిపత్యం చేసాక పుట్టుకొచ్చిన తమ్ముడిని చూస్తే నాకు కుళ్ళుగా వుండేది (ఇప్పుడు లేదనుకోండీ..నిజ్జంగా!). పైగా వాణ్ని ‘డాడీ!’ అని పిలిచేవారు మా డాడీ. ఆయన తన చిన్నతనంలో చేసిన అల్లరి, తిన్న తన్నులు, తమ్ముళ్ళూ, చెల్లెళ్ళని ఆటపట్టించిన తీరు, చదువు ఎగ్గొట్టడానికి తాను వేసిన దొంగెత్తులూ, ఇంకా బాగా చదువుకుని వుంటే ఇంకెన్ని విజయాలు సాధించ గలిగి వుండేవారో వంటి తాను నేర్చుకున్న పాఠాలూ, మాతో తరచూ పంచుకుంటూ మాకు నిజమయిన హీరో అయ్యారు. ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే  వాళ్ళనే ఎక్కువగా చూస్తాం కదా!, అలాంటిది  పిల్లలమైన మాతో వాస్తవాలు, తప్పులతో సైతం షేర్ చేసుకున్నంత మాత్రం చేత తాను ఏమాత్రం తక్కువ అవ్వననే ఆయన నమ్మకం నాకూ తమ్ముడికీ భలే నచ్చేది. పదవి పెరుగుతున్నకొద్దీ, ఇదే అలవాటుతో  ఆయన  బ్యాంకులో తన క్రింద పనిచేసే వాళ్ళని కూడా సునాయాసంగా కట్టి పడేసారు. ఎందరో శిష్యుల్ని పోగేసుకున్నారు మన స్థితప్రజ్ఞ సాయి. 

             చిన్నప్పుడు తొందరగా  నిద్ర లేవని నన్ను ‘బద్ధకంబు సంజ నిద్దర వద్దు సుమీ.....ముద్దు కుమారీ!’ అంటూ చమత్కారంగా మేల్కొలుపు పాడేవారు. పాలు తాగనంటే కళ్ళు మూసుకుని, చిన్న స్కేల్ పుచ్చుకుని పాల గ్లాసు ముందు పెట్టుకుని కూర్చునేవారు డాడీ. ‘ఎవరైనా రెండు జెడలు, పింక్ కలర్ గౌను వేసుకున్న తెల్ల పిల్లి (ఆ రోజు నేను వేసుకున్న డ్రస్సు బట్టి ఆయన వ్యాఖ్యానం మారేది) ఇటు వచ్చి పాలు తాగిందా? దాని పనయిపోయిందంతే! అని నాటకీయంగా అంటూ, మధ్యమధ్యలో టేబుల్ మీద స్కేల్ తో కొడుతూ,  నేను ఉత్సాహంగా ఆయనకు తెలీకుండా పాల గ్లాసు ఖాళీ చేస్తూ ఉంటే, ‘ఎదో గుటుకూ గుటుకూ శబ్దం వస్తోంది’ అని మధ్యలో కామెంట్ చేస్తూ, సడన్ గా కళ్ళు తెరిచి ‘ అరె! ఈ రోజు కూడా తాగేసిందే! రేపు చెప్తాను పిల్లి పని’ అని తల పట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తూ నా చిన్నతనాన్ని రక్తికట్టించిన సూపర్ హీరో డాడీ.

         ఎవరయినా చక్కగా నవ్వితే, వెంటనే ‘ఆహా! ఎంత చక్కగా నవ్వావు తల్లీ!, నీకు మంచి మొగుడు వస్తాడు/మంచి పెళ్ళాం వస్తుంది’ అనీ నవ్వకపోతే ‘కాస్త నవ్వమ్మా! ఇంత చిన్న వయసులో ఎందుకంత దిగులు? వజ్రం కోల్పోయినట్టు మొహం పెట్టావు’ అంటుండేవారు ఎప్పుడూ ‘స్మయిలింగ్ సాయినాథ్’. నలభై రాకుండా జుట్టు ‘గ్రే’ గా నెరిసి పోవడంతో, ఇంగ్లీష్ హీరోలని తలపించేవారు. పైన పేర్కొన్న విధంగా ఎవరితోనయినా మాట్లాడినా ఆయనకి చెల్లిపోయేది. బహుశా (సర్విస్ సెక్టార్) సేవా రంగం లో ముప్పై ఏడేళ్ళు పని చెయ్యడం వల్ల చిరునవ్వు, సానుకూల దృక్పథం ఆయనకి ఆభూషణాలయ్యాయి. ఇప్పటికీ ఏ షాపు వాడయినా నవ్వకపోతే 'నీ ఆస్తి రాయించుకోను లేవోయ్' అని వాళ్ళని కితకితలు పెట్టే ప్రయత్నం మానరు.

     పిల్లలతో ఆయన ఆటలు అమోఘం. మా చిన్నతనంలో నాతో తముడితో సరేసరి, మా అబ్బాయి రామదండు మొత్తానికి ఆయనే రిటైర్ అయిన దగ్గర్నుంచి రింగ్ లీడర్ గా వ్యవహరించి, ప్రతీ సాయంత్రం వారితో ఒక మూడు గంటలు క్రికెట్, షటిల్ వంటివి వీధిలో ఆడి అందరికీ ‘సాయితాత’యిపోయారు. ఓ సారి నన్ను పీచుమిఠాయి బండి అతను  అడిగాడు ‘సాయి తాతగారు ఊర్లో లేరా అమ్మా!’ అని.  మా తమ్ముడి దగ్గరకి అమ్మానాన్నలు లండన్ వెళ్ళినప్పుడు ఈ రామదండు మొత్తానికి సాయితాత పీచుమిఠాయి సప్లై బేరం పోయింది అతనికి పాపం.

       పాత సినిమాలంటే పండగే డాడీకి. ఈటీవీ వాడి ధర్మమా అని సతీ సమేతంగా ఎన్నో ఆ పాత మధురాలను చాలా ఎమోషనల్ గా ఆస్వాదించడం ఆయన విశ్రాంత జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. తారాగణంతో సంబంధం లేకుండా నలుపూ తెలుపూ అయితే చాలు వీలున్నప్పుడల్లా చూడాల్సిందే.

        మొన్నీమధ్య  ఓ ఫంక్షన్లో  ఒకరు నన్ను ‘అమ్మా! మీరు సాయినాథ రావు గారి అమ్మాయా?’ అంటూ చేతులు జోడించి ఎంతో వినయంగా నమస్కరించారు. నా కంటే వయసులో చాలా పెద్దాయన అంతలా  నమస్కరిస్తుంటే ఏదోలా అనిపించి నేను నోరు తెరిచే లోపలే ‘సాయినాథ రావు గారి  లాంటి వ్యక్తులు ఎంతో అరుదుగా ఉంటారమ్మా.  ఆయన మేలు పొందిన చాలా మందిలో నేనూ ఒకడిని! ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. మహానుభావులు! వారికి నా నమస్కారాలు తెలియజేయండి’ అంటూ నన్ను పిత్రోత్సాహంలో ముంచెత్తారు. 

     ఇప్పటికీ ఎవరికయినా నన్ను పరిచయం చెయ్యాల్సివస్తే ‘మా అమ్మాయి- ఎం.కాం, ఎం.హెచ్.ఆర్.ఎం’ అంటూ ఆయన మొదలుపెట్టడం, నేనేమో  ‘ఏంటి డాడీ! ఎదో పెద్ద ఐ.ఐ.టి, ఐ.ఐ.ఎం లాగ’ అని వెటకారం చెయ్యడం మాకు అలవాటే. కానీ, నాలోని ఆత్మ విశ్వాసానికి కారణం అదే అనిపిస్తుంది నాకు.

      ప్రస్తుతం 'నీ సేవపై చిత్తముల్...నీ పై బుద్ధుల్ మాకు నిమ్ము'  అనుకుంటూ భాగవత అంతర్గత జీవితాన్ని నిశ్చలంగా కొనసాగిస్తున్న ఈనాటి మన నిరాడంబర హీరో సాయప్పకి అఖిలం మధురం అవ్వాలని మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ......

మరి ఉంటా....
మళ్ళీ కలుద్దాం