పాకశాస్త్రంలో
ప్రావీణ్యం కాకపోయినా కావలసినంత పరిజ్ఞానం, కొద్దిగా ప్రవేశం వుంది మావగారికి. వెనకటి రోజుల్లో ‘వస్తు
గుణ దీపిక’ అనే గ్రంధమొకటి ఉండేదట. ప్రకృతి సిద్ధంగా మనకి లభ్యమయ్యే ఏ వస్తువుకయినా ఎదో ఒక విశేష గుణముంటుందనీ, ఆ గుణాన్ని వివరంగా తెలిపేదే ‘వస్తు గుణ దీపిక’.
అలాగే ఒక నడిచే ‘వస్తుగుణదీపిక’
అనుకోండి మావగారు. అది ఎలాగంటే, శాకంబరులయిన మావగారు కూరలూ దినుసులూ ఎంచడమే కాదండోయ్! అవి ఎలా ఉపయోగిస్తే లేదా ఎలా వండితే బావుంటాయో కూడా సెలవిస్తుంటారు మనం అడిగినా
అడగకపోయినా. జిహ్వకో
రుచి అన్నట్లు కాక మావగారి జిహ్వకి శతకోటి రుచులు. ఉగాదిపచ్చడి నోట్లో వేసుకోగానే కాస్తంత చేదు తగలకపోతే ‘మీరు
తగినంత వేపపువ్వు వెయ్యలేదర్రా!’ అంటూ తెగ ఫీలయిపోయే మా భోళా భాస్కరుడి రుచులూ అభిరుచులూ
అన్నీ ప్రత్యేకమే! వాటిల్లో కొన్ని మనమూ అస్వాదించాల్సిందే సుమండీ!
కంచం
ముందు కూర్చోగానే కూర నోట
పెట్టడంతో మొదలవుతుంది మావగారి భోజనం. ఈ అలవాటువల్ల
కూర ముక్కలు పెద్దవిగా కనపడకపోగానే ‘మరీ గుండలా
తరగకండర్రా! కాస్త ముక్కలు చేతికి అందనివ్వండి’
అనే సలహా రాక మానదు ఆయన వైపు నుండి. ఒక్కోసారి ‘ఓహో మీరు ఇలా చేసారా? నేనయితే ఏం చేస్తానో తెలుసా?’
అని ఆయన డప్పు మొదలవ్వగానే ‘ఈ రోజు వంట మీ మావయ్యగారికి వదిలేద్దావమ్మా! మనిద్దరం మార్నింగ్ షో సినిమాకెళ్లిపోదాం’
అంటుంటారు ఆయన సతీమణి
. తధాస్తు దేవతలు తిరగడం లేదనుకుంటా లేకపోతే అలా మా అత్తగారన్న మాట గనుక నిజమయివుంటే మావగారు రిటైర్ అయిన దగ్గర్నుంచీ మేమిద్దరం ఇన్నేళ్లల్లో వారానికి కనీసం రెండు సినిమాలు చూసుండేవాళ్ళం ఎంచక్కా. అన్నంలోకి కూరలు పొడిపొడిగా వున్నా పరవాలేదు కానీ,
రొట్టేల్లోకి మాత్రం తడి తడిగా వుండాలనేది మావగారి అభిమతం. అలా అని మరీ జారుగా వుంటే ‘ఎవిటర్రా? నీళ్ళకి నీళ్ళు ప్రసాదం కి ప్రసాదం లాగ?
కూర అతుక్కోవటం లేదు, దీని
సంగతేదో చూడండి, కొంచం పిండి పెట్టండి’
అంటూ సెనగపిండి కలిపి చిక్క బెట్టమనే ‘వారెవ్వా’
టిప్
ఒకటి పారేస్తారు.
‘చిన్నప్పుడు మా ఇంట్లో ఎలా చేసే వాళ్ళమో తెలుసా?’
అంటూ ఆయన ఇదివరలో బహ్మచారులుగా వున్నప్పుడు తనూ వాళ్ళన్నయ్యా చేతులు కాల్చుకున్న తీరు వర్ణిస్తూ, ఆనాటి రుచులు గుర్తు చేస్కుంటూవుంటారు. ఆయన జోరుకి
బ్రేక్ వేసి ‘ ఏమో! ఆ రుచులు నాకు తెలీవు కానీ,నేను ఈ ఇంటికి పెళ్ళయి వచ్చే దాకా వీళ్ళకి అస్సలు రుచులే తేలీవమ్మా ! అన్నిట్లో ఉల్లి మసాలా వేసి వండడం తప్ప. ఓ వారం లేదు వర్జ్యం లేదు, తెల్లారేసరికల్లా అంత ఉల్లిముద్ద నూరెయ్యడమే. ఎదో ఒక కూరతో
కలిపి వండేయ్యడమే. చిత్రం ఏమిటంటే , చివరికి ఉప్మాలో కూడా వెల్లుల్లిపాయ వేసుకునేవారంటే నమ్ము’
అంటూ చల్లగా మా అత్తగారు గాలి తీసేస్తుంటారు. అవునుమరి, ఎడం
చేత్తో షడ్రుచులూ పాతికమందికి అవలీలలగా వండి వార్చేసే అమృతహస్తం ఆవిడది. కానీ ఎ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, గతంలో ఉమ్మడి కుటుంబంగా ఉన్నరోజుల్లో మా మావగారి అన్నయ్య
ఇంట్లో పిల్లల్నందర్నీ సినీమాకి తీసుకెళ్ళిన ఆడవాళ్ళు తిరిగి వచ్చేసరికీ ఉడకపబెట్టిన బంగాళదుంపలతో ‘ఆలూ
ధాం’ అనే గరిటజారు కూర ఇంటిల్లిపాదికీ సిద్ధం చేసి ఉంచేవారట. ఆ కూర రుచి చిరస్మరణీయం అవ్వడానికి కారణం మరేమీ కాదు-
వంటింట్లోని ప్రతీ పదార్ధం (మసాలాలతో సహా ) కాస్తంత అందులో పడి ‘ఆలూ
ధాం’ కాస్తా ‘ఆలూ ఢాం! గా రూపొందడం వల్లే అని అందరి అభిప్రాయం.
ఆవకాయలెంత
రుచికరమయినవో వంటికి అంత మంచివి
కావని భావించే మావాశ్రీ యేటా
ఎండాకాలం వచ్చేసరికీ ‘ఈ సంవత్సరం నుంచీ ఇంక అవస్థ పడకే నువ్వు , ఆవకాయలు ఎలాగో ఎవ్వరం అంతలా తినడంలేదు కదా ! ఒక్క కత్తెర ముక్కలు (పిల్లావకాయ్ లేదా టెంపరరీ బెల్లం ఆవకాయ అన్నమాట) వెయ్యి’
అనడం తప్పనిసరి ఆనవాయితీ. ‘మీరలాగే
అంటారు కానీ కంచం దగ్గర కూర్చున్న దగ్గర్నుంచీ గూట్లో ఆవకాయ సీసాల మీదే మీ దృష్టంతా, మీకు తోచినన్ని కాయలు మోసుకురాక నేను చెప్పినన్ని తెండి చాలు’
అంటున్న సతీసూర్యం వైపు ఒక దొరికిపోయిన
దొంగచూపు పారేసి ‘ఒక్క పెరుగన్నంలోనే వేసుకుంటానే, అదీ ఒక్క ముక్కే, ఉప్పంతా ఊటలోనే కదుటే వుండేది, కదమ్మా ఉషా!’ అంటూ నా వైపు చూస్తుంటారు సపోర్ట్ కోసం. నేను అంతకన్నా ఊరుకోక ‘మరి
విజయవాడ ఆవకాయో మావయ్యగారూ?’
అని మాకు ప్రతీ సంవత్సరం ఒక
నేస్తులు పెట్టి పంపించే కొత్తపల్లి కొబ్బరితో వేసిన కారం ఆవకాయ మీద ఆయనకి వున్న మమకారాన్ని గుర్తుచేసేసరికీ కిమ్మనకుండా అక్కడినుంచి జారుకుంటారు.
మావగారికీ అరటికాయకీ
ఆమడ దూరం. గుమ్మంలోకి అరటికాయలు
అమ్మేవాళ్ళు వస్తే అటునుంచి ఆటే తరివినంత పని చేస్తారు. ఒక్క బజ్జీ చెయ్యడానికి మాత్రమే పనికివచ్చే వస్తువుగా అది పరిగణింపబడి అప్పుడప్పుడు మాత్రమే మా ఇల్లుచేరే అద్రుష్టానికి నోచుకుంటుంది అరటికాయ. దవ్వతో ఆవపెట్టి వండితేనే దానికంటూ ఓ రుచి పుడుతుందని కూడా తీర్మానించేస్తుంటారు. రేగ తోటకూరంటే మావగారికి ప్రాణం. తనంత (ఆరడుగుల) పొడవు రేగ తోటకూర రైతుబజార్లోకి వచ్చిందంటే, మా ఇల్లు చేరిందన్నమాటే. ఆవ, పుల్లా -బెల్లం పెట్టి వండిన కాడలని చూడగానే ‘ఆహా!
ఎలా ఎంచేనంటావ్?’
అని మొదలుపెట్టి,
నోట పెట్టగానే ‘నిజంగా ఎంత బాగా చేసావే! కరిగిపోతున్నాయి కాడలు నోట్లో’ అని సతీసూర్యాన్ని అభినందిస్తూ, 'మీ
అమ్మకి ఈ కూర చాలా ఇష్టం కదూ?' అని తన అత్తగార్ని తలచుకుంటూ, ‘పూర్తిగా ఫైబర్ /పీచు పదార్ధవమ్మా!’ అని అంత ఆరోగ్యకరమయినది తింటున్నందుకు సంబరపడిపోతూ, సాగు చేసిన రైతుని తెగ మేచ్చేసుకుంటూ మావాశ్రీ ఆ కూరని ఓ పట్టు పడుతూంటే చూసి మనం లోట్టలేసితీరాల్సిందే.
సాధారణంగా
రాత్రిపూట రొట్టెలు తినే అలవాటున్న మావగారికి ఎప్పుడయినా అన్నం వడ్డిస్తే, ‘వ్రతం ఎలాగో చెడింది. ఇంకెందుకు? కందిపొడి వేసి పచ్చి ఉల్లిపాయ కొయ్యండి’ అంటూ ఆర్డరేస్తూ ‘కందిగుండా
పొడి అన్నం (పొద్దున్న మిగిలిన అన్నం) తింటావా? నాన్నగారు వచ్చేదాకా మేలుకుంటావా?’
అని ఆయన
చిన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అనడం గుర్తుచేసుకుంటారు ఖచ్చితంగా.
బీరకాయ
ఉల్లికారం కూర బాగా నచ్చుకునే మావగారు, క్యాప్సికం అదే మోడల్లో చేస్తే తెగ సరదా పడిపోయి ఆయనిచ్చే ఉపోద్ఘాతం ఇలా వుంటుంది . ‘ఇలాగే దొండ కాయ చేసుకోవచ్చు , ఆనపకాయ చేసుకోవచ్చు, అంతెందుకు అరిటికాయ కూడా చేసుకోవచ్చు, అసలు
బీరకాయ లో క్యాప్సికం కలిపితే ఎవడైనా వద్దన్నాడా ? అసలు క్యాప్సికం కి దానికంటూ ఒక ఉనికిలేదు తెలుసా? దేంతో అయినా కలిపి వండేయోచ్చు, ఇదే
ఫార్ములా ఫాలో అయిపోండి. ’
అని ఘాటైన చిట్కాలు విసిరే మా ఇంటి చెఫ్ ఉత్సాహాన్ని ‘అలా అన్నిట్లో
అన్నీ వేర్రిలాగ కలిపేసి వండితే, ఏ
రుచీ తెలీకుండా పోతుంది ’ అంటూ
ఉఫ్ అని ఊదేస్తుంటారు
వారి సతీసూర్యం. ‘మీరసలు
వెరైటీలే ట్రై చేయరర్రా! మీతో అదే వచ్చిన తంటా, ఇవే టీవీలో
చూపిస్తే మటుకూ అబ్బో! అనుకుంటూ చూసేస్తారు అంటూ చిన్నబుచ్చుకుంటారు మా పాకశాల వల్లలుడు.
నూలుపిండీ ఆవ కొబ్బరీ
పెట్టి వండిన బచ్చలి కూరకి మావగారి తో పాటూ చిన్న కొడుకూ, అల్లుడూ, వియ్యంకుడూ ఇలా చాలామంది
ఫ్యాన్స్ మా ఇంట్లో. కేవలం మా ఇంటి బచ్చలికూర వండితే అందరికీ సరిపోదనే ఉద్దేశ్యంతో మావగారు ‘దాంట్లో ఆనపకాయ కూడా కలిపి వండండర్రా! కాస్త కూర అద్దుకోవడానికి బావుంటుంది’ అంటుంటారు ఎదో
కొత్త రుచి కనుగొన్న ఫుడీ ఫీలింగిచ్చి.
ప్రపంచ
వ్యాప్తంగా ఆరోగ్యకరమయిన అల్పాహారంగా గుర్తింపబడిన ఇడ్లీని మా ఇంట కూడా అంతే గౌరవంతో ఆదరిస్తారు మావగారు. రోజూ తిన్నా బోరుకోట్టదు అంటూనే చట్నీల కోరికలు మటుకూ వెలిబుచ్చుతుంటారు మనవడితోకలిసి. పైగా కేవలం బోలెడు చట్నీలూ, సాంబారుతో కలిపి వడ్డిస్తాడు కాబట్టే హోటల్ ఇడ్లీకి అంత గిరాకీ అంటూ తమ కోరికను సమర్ధింకుంటారు తాతా మనవడు. ఉల్లి రవదోశలంటే ఎంతో ఇష్టపడే మావగారికి ఎంత పెద్ద హోటల్లో అయినా పెనం మటుకూ చీపురుతోనే శుభ్రపరుస్తారన్న గట్టి నమ్మకం వల్ల ఇంట్లో రవ్వదోశలు వేసిన ప్రతీసారీ ‘ఇంట్లో
కాబట్టి మూడు నాలుగు తినగల్గుతున్నాం గానీ, హోటల్లో ఎవరినయినా రెండో రవ్వదోశ తినమను చూద్దాం!’ అంటూనే లాగిస్తుంటారు.
అన్నీ
సరిపోయాయా లేదా? అంటూ ఏ వంటకమయినా ఆయన్ను రుచి చూడమనాడానికి అస్సలు సాహసించరు అత్తగారు. అలాంటిది పోరపాటున ఎప్పుడయినా ఉప్పూ కారాలూ తేడా వచ్చిన సందర్భాల్లో మటుకు అచ్చం ‘మాస్టర్ చెఫ్’ లో జడ్జి లాగ ఫీలయిపోయి తెగ కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు మా రుచిరాజు భాస్కరులు. పైపెచ్చు
‘నేను
చెప్తే మీరు కొట్టిపారేస్తారు, మీకు వాడే కరక్టు’
అంటూ పిల్లికి ఎలుక సాక్ష్యం లాగ చిన్న మనవడి ఎక్స్పర్ట్ ఒపినియన్ కోరిమరీ టేబుల్ వద్ద కామెడీ చేయడం ఆయనకే చెల్లింది. చోలే , రాజ్మా లాంటివి వండినప్పుడు ఇంకా వుడకాలనే ఆయన కామెంటుకి ‘బోలెడు సేపు కుక్కర్లో వేసి ఉడకబెట్టాం ‘ అని
జవాబిస్తే , ‘మీరు
ఉడుక్కోకండర్రా ! గింజలని
ఇంకాసేపు ఉడకేయ్యండి ‘ అని
ఇంకొంచం వెటకారం చేయడం ఆయనకు పరిపాటి. అదేగాక, పిండివంటలు
చేసే సమయంలో ఆయనిచ్చే విశేషసూచనలకి ‘పెళ్ళయిన యాభై ఏళ్ళకి ఇప్పుడిక మీ దగ్గర్నుంచి నేర్చుకోవాలి నేను’
అంటూ గొణుగుతుంటారు ఆయన సతీమణి.
మురీమిక్సర్ అంటే ఇష్టపడే మావగారికి అది బయట అంటే మా వూర్లో బీచ్ రోడ్డు మీద (చాలా ఫేమస్ లెండి) తినడం అంతగా సోక్కని విషయం. కానీ అమ్మేవాడు సేవ్ , పల్లీలు, మామిడి ముక్కలు ఇలాంటివన్నీ వేసి చేస్తాడు కాబట్టే పిల్లలు ఆ టుమ్రీ బళ్ళ దగ్గరి మిక్సర్ కావాలంటారని ఆయన అభిప్రాయం. అందుకని ఆ ఆధరవులన్నీ కొని తెచ్చి ‘ఇవి
వేసి చేయ్యండర్రా! వెర్రెత్తిపోతారు పిల్లలు’
అంటూ హుకుం జారీ చేస్తుంటారు ఆదివారం వచ్చేసరికీ.
కారణమేదయినా
మగవాళ్ళు తప్ప్పనిసరి పరీస్తితుల్లో తప్ప వంటింట్లోకి రావక్ఖర్లేదు అని బలంగా విశ్వసించే భార్యామణి వల్లే తన
పనితనం మరుగున పడిపోయిందనీ, వంటలూ –వంటలలో సాయం చెయ్యలేకపోతున్నానని తరచూ వాపోతుంటారు మావగారు. ఆయన ప్రజ్ఞకి నిదర్సనంగా
ఎప్పుడో ఏళ్ళక్రితం ఒక్కసారి, మా ఆడపడుచూ, అత్తగారూ ఊరినుంచి దిగే సరికీ దండిగా అన్నం వండి, ముగ్గురు మనుష్యులకి జస్ట్ కుక్కర్ నిండుగా క్యారెట్ ముక్కలేసి మరీ పులుసు పెట్టిన వైనం అవకాసం దొరికినప్పుడల్లా వల్లిస్తుంటారు మా ‘నలభీమ’మామ.