మా మావగారు బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఓసారి ఒక పెద్దాయన బ్యాంకుకి వచ్చారట. కౌంటర్ వద్ద ఆయన వచ్చిన పని
పూర్తయ్యాక, మావగారు ఫలానా అని పోల్చుకుని ‘ఏవయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా?’
అని అడిగారట ఆ
పెద్దాయన.
మన బుద్ధిశాలి బూరి భాస్కరం ఓ
చిరునవ్వు విసిరి ‘మా అన్నయ్య తో మాట్లాడండి’
అని జవాబిచ్చేసరికీ ఇంకేముంది కట్ చేస్తే పీ... పీ... పీ...డుం...డుం...డుం సన్నాయి మేళమే. అంత
సుళువుగా అయ్యింది యాభై ఏళ్ళ క్రితం ఆయన
వివాహం .
ఇక
మావగారి పిల్లల విషయానికి వస్తే , కూతుర్ని కోరి వరించాడు ఆయన
మేనమామ మనవడు , పెద్దకోడలేమో సంతలో వెతుక్కోకుండా చంకలో ఉన్న వస్తువులాగా కూతురి స్నేహితురాలే. మరి
కోరి వచ్చిన చిన్నకోడలు (అది నేనే) ఆయన సహోద్యోగి కం
స్నేహితుడి కూతురాయే. ఇలా
దాదాపు గుమ్మం దిగక్కర్లేకుండా, వున్న ఊర్లోనే ముగ్గురు వియ్యాలవారూ కయ్యాలవారుకాకుండా అనువుగా కుది రిపోయిన మావగారికి , పిల్లల పెళ్లి సంబంధాలకి కష్టపడ్తున్నామంటూ ఎందుకు అందరూ అంత
అట్టహాసం
చేస్తారో చాలా సందర్భాల్లో అర్ధంకాదు. సంబంధాలు కుదరడం లేదు
అనగానే ‘ఏవిటో ఈ తరం వాళ్ళు తెగఎంచుతారు. తల్లిదండ్రులూ అలాగే తాన తందానా అంటున్నారు సుమీ!’. అంటూ దీర్ఘాలు తీస్తుంటారు.
ఈ మధ్యకాలంలో మొగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న విషయం మీద ఆయన
చాలా వర్రీ అవుతుంటారు. ఓసారి మా ఇంటికి వచ్చిన ఓ పెద్దాయన ‘సరయిన వయసులోనే జెల్ల కొట్టేయాలండీ లేకపోతే కష్టం’ అని
మావగారికి సూక్తిముక్తావళి వినిపించారు. ఇక చెప్పాలా? ఎవరయినా వాళ్ళబ్బాయికి ఈ మధ్యనే ఉద్యోగం వచ్చిందని చెప్పగానే, వారికీ అదే
సూక్తి వినిపించి ‘ఇంక ఆలస్యం చెయ్యకండి, వేట
ప్రారంభించండి ,
అసలే ఆడ పిల్లలు చాలా తక్కువమంది ఉన్నారట ‘ అంటూ వాళ్ళని హెచ్చరిస్తుంటారు.
పైగా ‘ఉపనయనం అయిందా మీ వాడికి?
లేకపోతే పెళ్లి కుదిరినా లాభం లేదు. ఉత్తరాయణం వచ్చేదాకా ఆగాల్సిందే, లేదా పెట్టుడు
ముహూర్తానికి ఉపనయనం అయింది అనిపించాలి, చూసుకోండి మరి’ అంటూ భయపెట్టినంత పని చేస్తుంటారు. తన
మనవలిద్దరికీ పద్నాల్గవ ఏట
గాయత్రోపదేశం చేయించడంలో ఈ
దూరాలోచన కూడా ఓ
కారణమేనండోయ్!
పైగా ఎక్కువ చాన్సు తీసుకోకుండా, తొందరగా ముడి పెట్టెయ్యమని అవకాసమున్నప్పుడల్ల్లా
సెలవిస్తుంటారు.
పిల్ల కోసం వెతుకుతున్నామని అని ఎవరయినా చెప్పడం తడవు, మంచి ఆడపిల్ల ఎక్కడ ఉందా?
అని
బోలెడంత
నెట్వర్క్ వున్న మా పెద్దాయన తన వంతు గాలింపు చర్యలు మొదలు పెడతూంటా రు. ‘సాంప్రదాయసిద్ధమయిన
కుటుంబం, సంసారపక్షంగా వుండే పిల్ల’ ఇది ఆయన పెట్టుకునే కొలమానం. స్వతహాగా ఆడపిల్లలంటే ఎక్కువ ముచ్చటపడే మావగారు ఎవరయినా పిల్ల బాగాలేదు, అందుకే సంబంధం వద్దనుకున్నామని చెప్తే , వాళ్ళని క్షమించరాని నేరం చేసినవాళ్ళు గా పరిగణిస్తూంటారు . అంతెందుకు మొన్నీమధ్య ఒక పెళ్ళికూతురి ఫోటో వాట్స్యాప్ లో వచ్చిందని మా చుట్టాలొకరికి
పంపబోతూ మాకు చూపించారు. పిల్ల బాగా లావుగా ఉందన్న మా అభిప్రాయానికి ఆయన
విస్తుపోయి, ‘అదేంటర్రా మీరు? ఎంచక్కా చీకటితోనే లేచి తండ్రితో వాకింగ్ కి వస్తోందంటే, ఎంత క్రమశిక్షణలో పెరిగుతున్న పిల్ల. ఇంకా ఏం కావాలి? జడా -మె డా బావుంటే చాలు కదా ’ అని మమ్మల్ని కొట్టిపారేశారు. ‘(బరువు ) పెరుగుతున్న పిల్ల కాబట్టే ఆ
క్రమశిక్షణ ‘ అంటూ వాదనలోకి దిగి మొత్తానికి ఆ
ప్రయత్నం అక్కడితో ఆపించాం నేనూ మా ఆడపడుచు.
ఇక ఒకవేళ చక్కని చుక్క లాంటి ఏ
పిల్ల అయినా మావగారి కళ్ళ బడిందా, అంతే సంగతి. ‘ఈ పిల్లని వదలకూడదు , ఎలాగయినా మన వాళ్లకి ఎవరికయినా కుదురిస్తే బావుణ్ణమ్మా!’ అని సంబరపడిపోతూ, వయసులూ, వరుసలూ, కుటుంబ స్థాయిలూ, చదువులూ ఇలాంటివి ఏవీ లేఖ్ఖలోకి తీసుకోకుండా ,
మా ఇరుపక్కల
చుట్టాల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ఎవరా? అని
దీర్ఘాలోచనలో
పడతారు. ఒకోసారి మా అత్తగారు, ‘ మీకు ఆ అమ్మాయి అంత నచ్చేసింది
గానీ,
మనకిద్దరే కొడుకులు, వాళ్ల పెళ్లి ళ్ళయిపోయాయి’
అని గుర్తుచేస్తుంటారు, మరో కొడుకు వుండివుంటేనా అనిపించే అంత ఆయన
అవస్థ చూసి. కానీ ఎమాటకి ఆ మాటే చెప్పుకోవాలిగా , అలా
ఆయనకి బాగా నచ్చిన ఆడపిల్లలు కొంతమంది ఆయన
కోరు కున్నట్టుగానే,
మా ఇళ్ళల్లోనే కోడళ్ళుగా వచ్చారు. అంతటి బలమయినది మా భాస్కర సంకల్పం.
ఇక
సంబంధం చూస్తున్నప్పుడు ఎవరైనా శాఖభేదం, జాతకం వంటి పట్టింపులున్నాయంటే, ‘అవునండీ ! మన సాంప్రదాయం మనం
వదులుకోకూడదు’ అని వారితో, ఇంకెవరయినా మాకు ఏ శాఖ, జాతకం లాంటి ఏ పట్టింపులూ లేవంటే, ‘ఈ
రోజుల్లో అవన్నీ పెట్టుకోకూడదండీ’
అని వారితో ,ఇలా గోడ మీద పిల్లిలా చాలా వరకూ ఎవరికి నచ్చినట్టు వారి దగ్గర 'వాగ్వి
న్యాసం' ప్రదర్శిస్తూ, వారు సత్వర సానుకూల నిర్ణయం తీసుకోవాలని నెడుతూంటారు మా అజాత
శత్రు. ‘మీకెందుకండీ అంత
అవస్థ ? వాళ్లంతట వాళ్ళని సంబంధం కుదుర్చుకోనివ్వండి, విఘ్నేశ్వరుడి బియ్యం దగ్గర్నుంచీ పదహారు రోజుల పండుగ వరకూ మనకి చేతనయిన సహాయమంతా చేద్దాం ‘
అని ఆయన
హుషారుకి హామీలు ఇస్తూనే, బ్రేకులు వేస్తుంటాం మేము
ఇంటిల్లిపాదీ .
కొన్ని సార్లు పెద్దరికంగా పెళ్ళిచూపులకి మావగారు కూడా హాజారవడం , వెళ్ళిన ప్రతీ సంబంధం తిరుగులేనిదే అని ఆయనకి తోచడం తరువాత పరిణామాలకి ఆయన
విస్మయం చెందడం కూడా జరిగాయి. ఓసారి ఓ పెళ్లి కూతురు పెళ్ళికొడుకుతో షాపింగ్ ఇష్టాయిష్టాల గురించి వాగ్వివాదానికి దిగి నిలదీసినంత పని చేసిందట ఆశ్చర్యంగా. పెళ్ళికొడుకు తను
నిర్వర్తించవలసిన కొన్ని బాధ్యతలున్నాయంటే, తనకి బాధ్యతలంటే భయమందిట దాదాపు నెల ఫోను సంభాషణల తరువాత ఇంకో పెళ్ళికూతురు. ఏది ఏమయినా మగపిల్లలు బాగా పెద్దచదువులు చదవాలనీ,
లేకపోతే బుధ్ధిగా చదివేసుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలదే పై చేయనీ వీరబ్రహ్మం గారిలా జోస్యం కూడా చెప్తూంటారు మావాశ్రీ. తన
మనవలని వుత్త ఇంజినీరింగ్ తో చదువు ఆపొద్దనీ, ఎంటెక్ తప్పక చేయమనీ, కెరియర్ సంగతి ఎలా వున్నా పెళ్ళికి పై చదువు చాలా అవసరమనీ హితబోధ కూడా
చేస్తూంటారు.
ఒక
రెండు సంవత్సరాల క్రితం వరకూ మా చుట్టాల్లో మూడు పదులకి చేరువవుతూ లేదా మూడు పదులు దాటేసిన వయసున్న వరులుండేవారు. వారికి మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న తన పెద్ద వియ్యంకుడి సహాయంతో ఎలాగయినా సంబంధాలు చూడాలని కంకణం కట్టారు సతీసమేతంగా మావగారు. ఒకరికి కుదిరి, ఒకరికి కుదరకపోగానే, 'ఇక వీడొక్కకున్నాడు టిక్కు పెట్టడానికి'
అంటూ వరుల లెక్ఖ వల్లి స్తూ కలత
చెందేవారు. వచ్చే నెలలో మా ఇంట్లోనే జరుగబోయే ఆయన చిట్టి మరదలి ఏకైక
పుత్రరత్నం
యొక్క వివాహంతో ఆయన హమ్మయ్య!
అని
ఊపిరి పీల్చుకుంటారేమో చూడాలిమరి.
'మా పిల్లలు పెళ్ళికి ఇంకా ఆగ మంటున్నారు, బాగా సెటిల్ అవ్వాలిట' , అని ఎవరైనా ఆయన ముందు ప్రస్తావిస్తే , ‘ఈ రోజుల్లో తల్లిదండ్రులు పాపం పిల్లల గ్రిప్ లో వున్నారు, ఏం
చెయ్యగలం?’
అని వారిమీద జాలి చూపుతూ, తాము
ఈ విషయంలో చాలా అదృష్టవంతులమనీ అందుకే తొందరగానూ, సుళువుగానూ తెవిలిపోయామనీ మరోసారి శ్రీమతికి గుర్తుచేస్తూ, ఉన్నచోటనే నిలబడి రెండు చేతులూ జోడించి ఆ భగవంతునికి నమస్కరిస్తుంటారు మా
భక్త భాస్కరం.
ఈ అదృష్టం వల్లే అసలు 'పెళ్లిచూపులు ' అనే ఘట్టం లేకుండా పోయిందనీ, మైసూర్ పాకు, లడ్డూ మిక్సరు లాంటివి ఎంచక్కా తిని, పిల్ల నచ్చలేదని చెప్పే కోరిక ఇంట్లో ఎవ్వరికీ తీరలేదని అప్పుడప్పుడు శ్రీవారు నా దగ్గర ఉస్సూరంటూ వుంటారు. ఏదో పెద్ద, పిల్ల నచ్చలేదని చెప్పే అవకాశం వాళ్ల నాన్నగారు ఆయనకి ఇచ్చివుండేవారనే భ్రమలో . పాపం!
No comments:
Post a Comment