స్వతహాగా ప్రకృతి మనకిచ్చే ప్రతీదీ మన వంటికి మేలు చేస్తుందని నమ్ముతారు మా మావగారు.
‘వంటికి
మంచిది ‘ అని ఎచట కన్నా సేవించడం, ఎనోట విన్నా పాటించడం తన ‘తక్షణ
కర్తవ్యం ‘గా భావిస్తూ బజారులోకి
వచ్చే ప్రతీ కాయా, ప్రతీ పండూ మా ఇల్లు చేరుస్తారు .
ఆయనతోపాటుగా మేమందరం కూడా అవి
తిని ఆ పౌష్టిక విలువలు పొందవలసిందే అని అత్యంతాపత్రయ పడుతూంటారు. ఇందువల్ల ఒక్కోసారి మా ఇంట్లో మామిడి పళ్ళు, చెట్టున ముగ్గిన అరటిపళ్ళు, రెండు రకాల పుచ్చకాయలు, బత్తా యిలు, జామపళ్ళు , బొప్పాయి, నేరేడు పళ్ళు, పనసతొనలు మొదలగునవి అన్నీ ఒకేసారి కొలువు తీరతాయి. అల్లాంటి
చాలా సందర్భాల్లో మా ‘ఐసు పెట్టె’ అనగా
ఫ్రిజ్జు నిండు గర్భిణిలా కళకళలాడుతూ వుంటుంది.
అందులోనూ రిటైరయ్యాక మరీ ‘హెల్త్ కాంష్య స్’ అయ్యారాయన. మా వూరిలో
కొత్తగా పచ్చి కూర ముక్కలు, పండ్ల ముక్కలు , మొలకలు, చిరు ధాన్యాలు రోజూ ఏవో ఒక ఎడు రకాల
చొప్పున, ప్లాస్టిక్ పోపుల
డబ్బాలో సర్ది ‘రా ఫుడ్డు’ పేరిట నెలకి మూడు వందల రూపాయలకి ఇంటికి సరఫరా
చేసేవాడు పుట్టుకు
రాగానే ఇక చెప్పేదేముంది పండగే ఆయనకి.
మొదట్లో ఎంతో హుషారుగా
గుమ్మంలోకి వచ్చిస్తున్నాడని ఆ వినూత్న వ్యాపారాలోచన
కి
ముచ్చటపడిపోతూ ఇచ్చినవి లాగించేసేవా
రు. నెమ్మదిగా
వులవలు, బీట్ రూట్
ముక్కలు వంటివి వచ్చినరోజు ‘డయాబెటిస్ కి చాల మంచిదే, నువ్వు తిను’ అని ఉచ్చిష్టం
వదల సాగారు మా అత్తగారికి .
మరి కొన్నాళ్ళకి ఒకటి రెండు
సార్లు ఎదో ఒక కారణంతో ‘రాఫుడ్డు’ రాక
పోయేసరికి అదే డబ్బాలో ఇంట్లో
వున్నవి కోసి సర్దేవారు మా అత్తగారు.
ఎవరైనా 'గెష్టులు' ఇంటికి భోజనానికి వస్తేనే, ఇంట్లో పచ్చికూరలు తరిగి సలాడ్
చేస్తారని మమ్మల్ని దేప్పే మా మావగారు, ఆమె 'పతిప్రేమకి' తెగ
మురిసిపోతూ, ‘అనవసరంగా వాడెవడికో డబ్బులు పొయ్యడం ఎందుకు? మనమే రోజూ రెడీ
చేస్కుంటే పోలా ఈ రా ఫుడ్డు? ఇలా అయితే వాడిచ్చినట్టు మరీ నైవేద్యంలా కాకుండా అందరికీ కాస్తంత సరిపడా
తయారు చేసుకోవచ్చు. ఏమ్మా ఉషా! వాట్ డు యు సే?’ అనేసరికీ నిజం
చెప్పాలంటే మరో పని రా దేవుడా! అని
గతుక్కుమన్నాను నేను. ‘పైగా మంచి
నీటితో కడుగుతాడో
లేదోనే వాటినీ? అంటూ కూరలు శుభ్రం చేసే విషయంలో
ఎవ్వరినీ నమ్మని తన శ్రీమతి ఓటు కొట్టేసారు.
పైగా ‘మీక్కావలసిన
త్రుణధాన్యాలు నేను తెస్తానుగా
గిరిజన్ వాడి షాపు నుంచి’ అంటూ
మర్నాటి నుంచే గిరిజన్
వాడికి ప్రోత్సాహం, మాకు సహాయం మొదలు పెట్టారు. కొన్నాళ్ళకు బొబ్బర్లు వంటివి వంటికి
చాలా మంచివంటూ, అవి వడల్లా కూడా వేసుకు తినొచ్చనీ , రాఫుడ్డుకు కొత్త రుచులు అద్దసాగారు.
బ్రౌన్
రైస్ అనగా దంపుడు బియ్యం సర్వరోగ నివారిణి గా పని చేస్తుందని నాలుగు నోళ్లా విని తెలుసుకున్న ఆయన ‘ఏది బాగా
వుడుకుతుందో చూడండి’ అంటూ, సింగిల్ పాలిష్ డబల్ పాలిష్ అంటూ మార్కెట్ లో లభ్యమైన
అన్ని రకాలు తలా కాస్తా కొనుక్కోచ్చారు మా సదుపాయానికి. ఇక మొదట్లో ఒక వారం మా వంటిల్లు ఒక ప్రయోగసాలయ్యింది. ఒక రోజు సగ్గుబియ్యం లాగ పూసల్ల్లా, మరో రోజు బెల్లం పరమాన్నంలాగ ముద్దలా, ఇంకోరోజు బిస్బేళా బాత్ లాగ జారుగా ఇలా పలు రకాల ప్రయత్నప్రయోగాల తరువాత ఆ బియ్యం నిజస్వరూపంలో అన్నంలా వండడం నేర్చుకోవడం జరిగింది మేము.
ఒకసారి
రైతుబజార్లో బ్రోక్కొలి పండించే రైతుని ఆయన తెగ పొగిడేసి అంతటి ఆరోగ్యకరమైన, సుళువుగా దొరకని దివ్య ఔషధం
వంటిదాన్ని మనకి
అందుబాటులోకి తెచ్చినందుకు
ఒకటే హడావిడి చేసారు. ఏడాదికి సుమారు ఎనిమిది నెలలు వేసంగిని తలపించే మా
జిల్లా వాతావరణం వల్లనో ఏమో, అరిటాకు పచ్చ రంగులో ఉండాల్సిన
బ్రోక్కోలి, పూర్తిగా
పసుపు పచ్చగా కాక, ఆకుపచ్చగా కాక, ముదురు గోధుమ రంగులో కాక
మొత్తానికి చూడసోంపు గా తోచలేదు నాకూ మా అత్తగారికీ. మా అభిప్రాయం వెలిబుచ్చక, మొదటి రోజు కొంత భాగం చిటికెడు
ఉప్పు వేసి కుక్కర్ లో ఉడకేసారు అత్తగారు. ఆహా! ఓహో! అనుకుంటూ ఆరగించారు మావగారు. ఆ
సమయంలో విచ్చేసిన
మా ఇంటి అల్లుడు రవి ‘మొదటి రోజు
కదా మావయ్యగారూ ! అలాగే ఉంటుంది’ అని అనుభవపూర్వకంగా
చెప్తూంటే మొహమొహాలు చూసుకున్నాం నేనూ, అత్తగారు . రెండవ రోజు ‘నిన్నటి లా
కుక్కర్లో మెత్తగా ఉడకెయ్యకే! కాస్త కసాగా ఉంటేనే వంటికి ఎక్కువ మేలు’ అని
కొత్తరుచి కోరారు మావగారు. సరే అని విడిగా
గిన్నెలో ఉడికించాము సగం సిలిండరు గ్యాసు అయ్యిందనిపించి. తీరా వడ్డించే వేళకి శాకాహార బ్రొ
క్కోలీతో పాటూ, మాంసాహార
జీవులు కూడా చేరాయన్న విషయం బయటపడింది. అంతే! ఒక్క విసురున ఉడికినదీ, ఫ్రిజ్లో మిగిలిన శేష బ్రొక్కోలీనీ వీధి మొక్కల్లోకి గిరాటేసారు అత్తగారు, ‘సవాలక్ష
మంచివి ఉంటూండగా ఇదే దొరకాలా ఈయనగారికి’ అని
సణుక్కుంటూ. ఈ విషయం
తెలిసిన ఆమె
శ్రీవారు కొంచం
నొచ్చుకున్నారేమో అనిపించి
‘మళ్ళీ సారి కొంచం
జాగ్రత్తగా ఎంచి తెచ్చుకోండి’ అని అనునయించారు సతీసూర్యం . 'నీతో ఇదే వచ్చిన తంటా, అస్తమానం రావోద్దూ
బజారులోకి? అయినా
తెచ్చుకోండి అంటావేంటి? తెచ్చి పెట్టండి అను, ఎదో నా ఒక్కడి
కోసమే అన్నట్లు, మీరందరూ తింటే మీకూ మంచిదే’ అని రివ్వున
లేచి మళ్ళీ ఉపోద్ఘాతం అందుకున్నారు మా 'బ్రొక్కోలి
భాస్కరుడు' .
సరిగ్గా పది రోజులు తిరక్కుండా
మళ్ళీ మా
పట్టువదలని ‘వెజిటబుల్ విక్రమార్కుడి’ కంటికి బ్రొక్కోలి కనపడడం, అది మా ఇల్లు చేరడం జరిగింది. ఎట్టకేలకు ఒక నాడు నేను పాపం మా అత్తగారి అవస్థ అర్ధం చేసుకుని, శ్రీవారు అంతర్జాలంలో చూసి చెప్పగా ‘బ్రొక్కోలి
మిక్స్డ్ వెజ్’ చేసి , రొట్టెలతో వడ్డించాను . ‘అదేవిటి? పథ్యం కూర లాగ నాకే ఇంత పెట్టారు ?‘ అంటూ మొదలెట్టిన మావగారు, ‘చాలా
బావుందమ్మా!’ అని ఓ పక్క నాతో అంటూనే, మా అత్తగారితో ‘ఎవే ! దీని
గమ్మత్తు చూసావా ? రెండూ ఒకలాగే వండినా ఒక పక్క
కాలీ ఫ్లవర్
వెన్నలాగా కరిగి
పోతుంటే , ఈ బ్రొక్కోలీ
మటుకూ ఎక్కువసేపు నవలాలి ’ అనగానే మా అత్తగారు వస్తున్న నవ్వు బిగపెట్టి ‘ఆ
గమ్మత్తులూ, మత్తులూ అన్నీ మీకే తెలియాలి బాబూ! నాకు కాలీఫ్లవరంటేనే పడదూ, ఇంకా బ్రొక్కోలీ కూడానా !’ అంటూ దీర్ఘాలు తీసారు. అంటే ‘మీ
అత్తాకోడళ్ళు ఇద్దరూ అస్స లు ఈ కూర తినరా ? మీకసలు ఆరోగ్యానికి మంచివంటే నే పడవర్రా ! ఫారిన్ లో మాత్రమే లభ్యమయ్యే ఇంతటి హెల్త్ ఫుడ్
ని మనకి దగ్గిరలోని అనంతగిరిలో పండిస్తూ వీధి చివర్న రైతుబజార్లలో అందిస్తున్నందుకు ఆ రైతుల్ని ఎంత అభినందించాలో తెలుసా?' అంటూ ఏకబిగిన లెక్చరు దంచారు మామాశ్రీ . ‘బావుందండీ! కంటికి ఇంపు , నాలుకకి ఇంపు అన్నారు పెద్దలు. రెండూ లేవు . ఎలా తినమంటారు?’ అని సంజాయిషీ ఇస్తూ పొద్దుట మిగిలిన
కూరతో రొట్టెలు కానిచ్చారు వారి
శ్రీమతిగారు. చేసేదిలేక మావగారు నా వైపు జాలిగా చూస్తూ ‘ఈ మిగతా కూర
నువ్వు కానీయమ్మా. గాభరా పడకు.
మళ్ళీ తీసుకు రాను లే' అని భారోసా ఇస్తుంటే, కక్కలేక
మింగలేక ఆ ‘హెల్త్
కర్రీ’ అనే ‘వర్రీ’ ని ఖాళీ అయింది అనిపించాన్నేను.
రంగు రంగుల
పండ్లు, కూరగాయలలో
ఎక్కువ ఖనిజాలుం టాయనీ, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ క్యాప్సికం/సిమ్లా
మిర్చి తెచ్చి ‘అన్నీ కలిపి కూర చేయ్యండ ర్రా!, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు’ అని సెలవిచ్చారు ఓ సారి. కొత్త వింత అన్నట్లు రంగు రంగుల హరివిల్లు లాగ కనిపించే కూర ఒకటి రెండు సార్లు బావున్నట్ట నిపించింది కానీ, ఆ తరువాత పసుపు క్యాప్సికం కి అసలు రుచే
ఉండదనీ, ఎరుపుది కేవలం పచ్చడి కే బావుంటుందనీ , ఆకుపచ్చది మాత్రమే కూర చేయడం కోసమనీ - ఇలాంటి తీర్పులు మొదలయ్యాయి టేబుల్ దగ్గర .
ఇదే పంథాలో
నీలి
క్యాబేజీ మార్కట్ లోకి రాగానే మా ఇల్లు చేరింది . మామూలు క్యాబేజీ తరహాలో వండితే దానికి రంగూ, రుచీ రెండూ లోపిస్తాయన్న సంగతి అనుభవ పూర్వకంగా తెలుసుకుని , పచ్చిది తినడం మొదలు పెట్టారాయన .
కాస్తంత రుచి ఏమైనా తగుల్తుందేమో అని పెరుగు
పచ్చడి రూపంలో
కూడా
ప్రయత్నించాక, ‘కొంచం చిన్న
సైజువి కొనండి' అని
శ్రీవారికి సలహా ఇచ్చే ధైర్యం చేసారు మా
అత్తగారు. ‘నువ్వు మరీనే ! నాకు
తెలీదుటే , ఈ మాత్రం సైజు
బుట్ట (లేడీస్ హెల్మెట్
అంత వుంది ఆ నీలి
క్యాబేజీ ) దాదాపు నెల వస్తుందనీ, నేనొక్కడినే తినాలిమరీ ,ఇంతకంటే
చిన్నవి దొరక్కపోతే ఏం చెయ్యనూ?’ అంటూ తినని మా అందరికీ కామన్
చురకంటించారు అదే అవకాశంగా.
ఓసారి
గుజరాత్ నుంచి వస్తూ సుమారు కేజీకి పైగా పల్లీలు ఏరోప్లేన్
లో
ఎగరేసుకొచ్చారు. ఇక్కడ దొరికేవేగా అంటే, ‘వాళ్ళు చాలా
తెలివయిన వాళ్ళమ్మా! గాంధి గారు జైలు లో
వున్నప్పుడు వేరుసెనగ పలుకులు తెగ తినేవారనీ దాని వల్ల ఆయనకి మంచి స్వాతంత్రాలోచనలు వచ్చాయనే పుకారు పుట్టించి, సాబర్మతి ఆశ్రమం దగ్గర వేరుసేనగపలు కు లు విపరీతంగా అమ్మేస్తున్నారు’ అని చెప్తూ , కానీ తాను మటుకూ ఆ కట్టుకథలవల్ల కాక , అవి ఎక్సలెన్ట్ క్వాలిటీవి కావడం చేత, నిజంగా ఒంటికి మంచివి కాబట్టి, కొన్నాననీ రీజనింగ్ ఇచ్చారు.
ఒక పర్యాయం తన తోడల్లుడింటికి వెళ్ళినప్పుడు ఈయనకంటే ఆరోగ్య సూత్రాలలో
రెండాకులేక్కువ చదివిన ఆయన , డ్రై ఫ్రూట్స్ వంటికి ఎంత
మంచివో అదీ ఈ వయసులో, అంటూ జ్ఞానబోధ చేయడంతో తిరిగి ఇల్లుచేరగానే హోల్సేల్ దుకాణానికి వెళ్లి మరీ డ్రై ఫ్రూట్స్ కొనుక్కుని తనకి అందుబాటులో ఉంచుకున్నారు మా ఆరంభ సూరయ్య . రోజులో అవి తినే టైము దొరక్క కొన్నాళ్ళకి అంత ఖరీదువీ పురుగు పట్టసాగాయి మా వూరి ఉప్పుగాలికి.
వీటన్నిటికీ తోడు ఈనాడు
సుఖీభవ, వసుంధర తప్పక చదవడం అందులో చెప్పిన హెల్త్
టిప్స్ తు. చ. తప్పక పాటించమని మమ్మల్ని శత విధాల పోరడం, ఆయనకి దినచర్యలో ఒక ముఖ్య భాగం. గ్రీన్ టీ లోని ఔషధ గుణాలను వల్లిస్తూ కొన్ని సంవత్సరాలపాటు
తెల్లారే గ్రీన్ టీ
తాగి మార్నింగ్ వాక్ కి వెళ్ళేవారు.
అలాంటిది ఉన్నట్టుండి
'పరగడుపున
గ్రీన్ టీ తాగటం మంచిది కాదు' అని ఒకరోజు తీర్మానించారు. అంతర్జాలం
లో చదివామని ఎవరో
చెప్పారట ఈ సత్యం(!)
గిరిజన ఉత్పత్తులంటే ఎంతో ఇదిగా
ప్రోత్సహించే మా మావగారు
సుగంధి , నన్నరి వంటి షర్బత్
లు-వట్టి వెళ్ళ సారంతో తయారుచేసినవి కాబట్టి ఆరోగ్యానికి ఎంతో
మంచివని వాటిని కొని
తెచ్చి, ఇంటికి ఎవరైనా
వస్తే కాఫీ టీ లకి
బదులుగా అవే ఇవ్వమని ఆర్దరేసారు ఓ పర్యాయం. వచ్చిన వాళ్ళతో
పాటుగా ఆయనకి కూడా ఓ గ్లాసు ఇవ్వటం
మొదలు పెట్టాం. ఏమనుకున్నారో
ఏమో , 'దాన్లో
కొంచం నిమ్మరసం కూడా పిండండి
వెరైటీగా' అంటూ
సూచించారు ఓ రోజు. అంతటితో ఆగకుండా తన మనవలకి సోడాలోకూడా కలిపిచ్చి
వారి చేత 'రుచి భళీ!' అనిపించే
విశ్వప్రయత్నం చేసారు. ఓసారి నేనూ మా
అత్తగారూ ఇంట్లో లేనప్పుడు, మా ఇంట్లో పని చేసే అమ్మాయిలిద్దరికీ టీ కి బదులుగా ఐసు నీళ్ళల్లో షర్బత్ కలిపిచ్చారని
తెలిసి, ఎలాగయినా
కొన్న షర్బత్ సొమ్ము
చెయ్యాలనే ఆయన యత్నానికి అవాక్కయ్యాం.
రోజూ ఉదయం పరగడుపున నాలుగ్లాసుల వెచ్చటి నీళ్ళు తాగితే చాలా మంచిదనీ ! ఎవరో బాగా రిసర్చ్ చేసి మరీ బారెడు మెసేజ్ వాట్సాప్ లో పెట్టారనీ, మాకు అమాంతం వార్త మోసుకొచ్చారో రోజు . తాను ‘మార్నింగ్
వాక్’ కి వెళ్తారు
కాబట్టి, మధ్యలో బాత్రూం అవసరం పడకుండా ఉండాలంటే ముందు రెండు గ్లాసులు తరువాత రెండు గ్లాసులు తాగుతానని తీర్మానించారు మా ఇంటి
పెద్ద. అంతటితో ఆగక, మా అత్త గారిని కూడా తాగమని ఆర్డరేసారు . అసలే చలికాలం, అందులోనూ మధుమేహులకు చెప్పుకోలేని ఇబ్బందులుంటాయన్న స్వానుభవం తో ఆవిడ పాపం ఇరకాటంలో పడ్డారు. ఆ సలహా నావరకూ
రాగానే ఒకేసారి అన్ని నీళ్ళు తాగితే. వాంతి అవటం తథ్యమని బలంగా తోచింది నాకు .
ఇక ఈమధ్యనే ఓ రోజు పేపర్లో గ్రీన్ పీస్ అనగా పచ్చి బటానీ కోత్తరకంవి పండిస్తున్నారనీ, అవి వొలిచి గింజలు తీసాక , తొక్కలు కూడా ప డేయక్కర్లేదనే వార్త పైకి చదువుతూ ‘ఇంక
పశువులకు తొక్కలు
కూడా మిగల్చరన్నమాట’ అని అత్తగారు
ఉస్సూరుమంటుంటే, ‘నీ మొహం! తొక్కల్లో అంత పీచు పదార్ధం
ఉందన్నమాట’ అని హితబోధ చేసారు మా ‘ఆరోగ్య మావా శ్రీ ‘. ఇప్పుడిక పశువుల సేవనార్ధం పాలవాడికి ఇవ్వటం మానేసి ఆ తొక్కలతో కూడా వంటకాలు నేర్చుకోవాలి కాబోలు! అన్నట్టు బేలగా ఒకళ్ళమొహం ఒకరు చూసుకున్నాం నేను మా అత్తగారు.
ఇలా ఎన్ని
చమత్కారబాణాలు మా 'హెల్త్ హిట్లర్ 'మీద సంధించినా 'మన ఆరోగ్యమే మన పిల్లలకి
మహా భాగ్యం ' అనే ఆయన 'స్వీయనానుడి' సింప్లీ
సూపర్. అందుకే ముమ్మూర్తులా ఆయనే మా
స్ఫూర్తి కూడా.
No comments:
Post a Comment