ఎంతో సరదాల ప్రియులయిన మావగారికి పిలుపుల సలుపులూ, విందుల చిందులూ రెండూ విపరీతమే. ఎవరినయినా శుభమా అని
మేము ఆహ్వానించాలంటే ఒకటే హడావిడి , ఎవరయినా శుభమా అని మమ్మల్ని ఓ
ఫంక్షను కి పిలిస్తే
చెప్పలేనంత హడల్ . సాధారణంగా సింపుల్ ఫన్క్షనులకి ఓటేసే మావగారికి, తన
అనూహ్యమయిన పాపులారిటీ వల్ల , మా గుమ్మానికి మావిడి కొమ్మ కట్టినప్పుడల్లా బారెడు గెస్ట్ లిస్టు తయారవుతుంది. ‘ఎవరిని వదిలేస్తాం, అందరూ అర్హులే, మనం
అంటే అవస్థ పడేవాళ్ళే’ అంటూ ఎవ్వరినీ మినహాయించలేక సతమతమవుతుంటారు. ఇదే ధోరణిలో అటు మా అబ్బాయి ఉపనయనానికీ , ఇటు మా ఇంటి గృహప్రవేశా నికీ కూడా కొన్ని వందలు దాటారు (కుదించగా) ఆహ్వానితులు. నేటి
మొబైల్ శకంలో పిలుపులు ఎంత సుళువో అంత అట్టహాసం కూడా. అయితే ఓ వాట్సాప్ మెసేజ్ తో సరిపెట్టేయోచ్చు లేదా, ట్రాఫిక్
ని ఛేదిస్తూ దూరాభారాలు మరచి
స్వయంగా వెళ్లి పిలవనూ వచ్చు. మొదటి పద్ధతికే మావగారు ‘సై ‘ అన్నా సాంప్రదాయం దృష్టిలో ఉంచుకుని రెండో పద్ధతి ఫాలో అవ్వక తప్పలేదు మాకు ప్రతీ సారీ. ఇదివరలో మనం వెళ్ళినప్పుడు ఇంటికి తాళం పెట్టి వుంటే, తలుపు కింద నుంచి కార్డ్ నెట్టేసి వచ్చేవాళ్ళం, మన పని అయిపోయేది. పైగా తరువాత ఆ ఇంటి వాళ్ళే మనకి సారీ చెప్పేవారు ఇంట్లో లేనందుకు. కానీ ఈ రోజుల్లో సారీ మాట దేవుడెరుగు ‘వచ్చేముందు
ఒక్క ఫోన్ చెయ్యొచ్చు కదా!’ అన్న
ప్రశ్న తప్పక ఎదురవుతుంది. రోజురోజుకీ మారిపోతున్న ప్రదేశాలూ, పరిసరాలతో కొండ గుర్తులు పెట్టుకుని, వెళ్ళవలసిన
ఇల్లు కనుక్కోవడం దాదాపు అసంభవమే. ఎదో గుగూల్ తల్లి చలవ వల్ల ఇలాంటి క్లిష్ట పరిస్తితుల నుంచి మ్యాపులు ఆదుకుంటున్నాయి మనల్ని. ఈ సలుపులన్నిటి వల్ల
పిలుపులంటేనే దిగులు మావాశ్రీకి.
ఇక మమ్మల్ని ఎవరయినా ఆహ్వానించబోతే ఆయన స్పందించే తీరే వేరు. పిలుపులకి వచ్చినవారు కాళ్ళకి నమస్కరించి రమ్మని కోరగానే ‘ష్యూర్!
భలే వాళ్ళే ! మీ ఇంట్లో ఫంక్షన్
కి మేము రాకపోతే ఎలా? మేమే
ముందుంటాం ’ అంటారు అభాయహస్తమిచ్చి భలే ఉత్సాహంగా
మా ఉబ్బు లింగడు. ఇక వాళ్ళు వెళ్ళాక ‘పాపం
ఎంతో ఇదిగా పిలిచారర్రా! తప్పకుండా వెళ్ళాలి మనం’ అని
వేడిగా తీర్మానిస్తారు మా ఇంటిపెద్ద. ఇక వెళ్ళవలసిన
తారీకు దగ్గర పడుతున్నకొద్దీ మొదలవుతుంది ఆయన భాస్కర కష్టాల చిట్టా. ఎంతగానో వెళ్ళాలని వున్నా ఎంతో దూరమని అలోచిస్తున్నానని ఒకసారి, లంచ్ అయితే ఫరవాలేదుగానీ డిన్నర్ అయితే తను పుల్కాలు మాత్రమే తింటారు కాబట్టి అపత్యం అయిపోతుందని మరోసారీ , ఈ
మధ్య ఫంక్షన్లు ఎక్కువయిపోయాయనీ, ఇంటిల్లిపాదీ బయలుదేరాలంటే కంగారు పడిపోతూ మేమందరం తప్పక వెళ్తే ఆయన వెళ్లకపోయినా
ఫరవాలేదని ఇంకోసారీ, ఇలా
ఎగ్గొట్టడానికి చిన్న పిల్లల్లా ఎదో ఒక ఎత్తులు వేస్తూనే వుంటారు మావగారు. ఇక తప్పదు వెళ్ళాలి అన్నప్పుడు ఒకటే హడావిడిగా తొందరగా వెళ్తే తొందరగా వెనక్కి రావచ్చని మమ్మలనందరినీ ఖంగారు పెట్టేసి బయలుదేరిన దగ్గర్నుంచీ ట్రాఫిక్కు, పార్కింగు వంటి ఇబ్బందులు ఊహించుకుంటూ ఆనవాయతీగా వర్రీ అయిపోతూంటారు .
ఫంక్షను యొక్క కారణానికి పాపం నిజంగా ఎంతో ఆనందించినా, అసలు చిక్కంతా భోజనం దగ్గిరే వస్తుంది అందరి పెద్ద వాళ్ళలాగానే మావగారికి కూడా. ముఖ్యంగా బఫే భోజనం అంటే ఆయనకీ సుతరామూ నచ్చదు, నప్పదు . చేతిలో పళ్ళాలు పట్టుకుని , చాంతాడంత క్యూలో దేవుడామని నిలబడి, బాబ్బాబు! అంటూ వడ్డన చేయించుకోవడం అంటే ఆయనకు అలర్జీ . ఎన్ని సార్లు క్యూలో నిలబడతాం లెద్దూ! అని
ఒక్కసారే వున్న వంటకాలన్నీ వేయించేసుకుని , అవి
కాస్తా కలగాపులగం అయ్యి, ఏం తిన్నామో కూడా అర్ధం అవ్వని పరీస్థితికి తెగ బాధపడిపోతుంటారాయన. బోలెడు తినుబండారాలు మెనూ లో చూసి ‘మనిషన్న వాడు అసలు ఇన్ని రకాలు తినగలడా?’
అని ఎద్దేవా చేస్తూ పానీ పూరీ, చాట్, నూడుల్స్
ఇతరత్రా జంక్ ఫుడ్ విందులో పెట్టడం అస్సలు జీర్ణించుకోలేరు మావగారు. విందు భోజనానికి అర్ధమే మారిపోయిందనీ, అసలు
బఫే భోజనాలు మన సాంప్రదాయం కావనీ, విందు అంటే
కూర్చోపెట్టి వడ్డించాలనీ, చాగంటి వారు కూడా అదే చెప్పారనీ తరచూ సెలవిస్తుంటారు మావాశ్రీ.
మొన్నొక తెలిసినవాళ్ళింట్లో పెళ్ళిలో, చాగంటివారు
చెప్పినట్లు మావగారికి నచ్చినట్లు
సాంప్రదాయంగా కూర్చోపెట్టి ప్లాస్టిక్ అరిటాకులు వేసి పలు రకాలు కొసరి కొసరి వడ్డించి మరీ భోజనం పెట్టారు. రాత్రి పూట జరిగిన
ఆ వివాహభోజనంబునీ,
వింతయిన వంటకంబులనీ అచ్చు మాయాబజార్లో ఘటోత్కచుడిలా మీసం సర్దుకుంటూ ఆస్వాదించి, భుక్తాయాసంతో ఆపసోపాలు పడి, అంత
సందడిలోనూ ఆ పెళ్లి పెద్దని ఆహా! ఓహో! అంటూ ఆకాశానికి ఎత్తి అభినందించి మరీ ఇల్లు చేరారు మావగారు. తరువాత కొన్నాళ్ళ వరకూ తెలిసిన వాళ్ళందరికీ ఆ విషయాన్ని చాటి చెప్పారనుకోండి.
ఇక వేరేవాళ్ళ ఇళ్ళల్లో జరిగే వెళ్ళడానికి ఆయన సందేహించడానికి మరో బలమయిన
కారణం ఆయన నమ్మే దోమల
శాస్త్రము. మనకి దాదాపు ప్రతీ వూళ్ళో ఈ బెడద ఉన్నదే కదా! దీనిపై ఓ రకంగా రీసర్చే చేసారు మావగారు. దోమలు చాలా తెలివైనవనీ, ఇంట్లో ఉన్నవాళ్ళని ఎప్పుడయినా వేధించొచ్చు కాబట్టి ఇంటికొచ్చిన అతిథుల రక్తాన్ని ముందు తగేస్తాయనీ ఆయన గట్టి అభిప్రాయం. అందరూ దోమల విషయంలో తనంత జాగ్రత్త వహించరేమో అనేది కూడా ఆయకున్న అనుమానం. నిజమే మరి! బజారులోకి వచ్చే ఏ కొత్త దోమల నియంత్రణ మందయినా, పరికరమయినా మా ఇల్లు చేరిందన్నమాటే. పైగా ‘భోజనానికి
రండి!’ అనగానే
ఒక చిన్న 'దోమల చక్రం ముక్క' వెలిగించుకుని కుర్చీకింద పెట్టుకుని మరీ చేతులు కడుక్కుంటారు మా ‘కాయల్
కింగ్’. ఇలాంటి
సదుపాయాలు వేరేవాళ్ళ ఇంట్లోని విందులకి కుదరవుగా!
ఒక్కోసారి
మేము వెళ్ళిన ఫంక్షన్ లలో ఇంకా ఏవయినా ఏర్పాట్లు సరిగ్గా జరగక పోతే తిరుగు ప్రయాణంలోనే ఉపోద్ఘాతం అందుకుంటారు మావాశ్రీ. ‘పాపం బోలెడు ఖర్చు అయ్యుంటుంది కానీ ఏం లాభం అనుకున్నంత బాగా కుదరలేదు వాళ్లకి’
అంటూ ఆ గృహస్తు మీద జాలి పడుతూ ‘మనం
ఎప్పుడూ మన ఇళ్ళల్లో ఇలాగ దొరికిపోకుండా జాగ్రత్త పడాలి’ అంటూ
హెచ్చరిస్తారు పైపెచ్చు.
ఎవరయినా
మమ్మల్ని ఆహ్వానించకపోతే ‘అవునా! ఎంత పని జరిగింది? ఎదో హడావిడిలో
మర్చిపోయుంటారు గానీ తరువాత విషయం గ్రహించుకుని మనల్ని పిలవనందుకు ఎంత బాధపడ
తారో?’
అనో , ‘ఎక్కడో అక్కడ తగ్గించుకోపోతే ఎలాగార్రా! నన్నడిగితే మంచి పని చేసారు సింపుల్ గా తక్కువమందితో కానిద్దామనుకున్నారు’
అనో సరిపెట్టుకుని, వాళ్ళు ఒకవేళ తటస్థ పడితే చిరునవ్వుతో గుడ్ లక్ కూడా చెప్తారు ఎటువంటి పరీస్థితిలోనూ ఎదుటివారిని తప్పు పట్టని మా అజాత శత్రు మావగారు.
వేడుకల్లో ఎవరినయినా మావగారు గుర్తుపట్టి పోల్చుకోలేకపోతే ఆయన అవస్థ, అందులోంచి బయట పడడానికి ఆయన జిత్తులూ
ఆలకించి తీరవలసిందే. ‘బావున్నారా
సార్ ?’
అని పలకరించిన వార్ని చిరునవ్వుతో బుర్ర ఊపి షేక్ హ్యాండ్ పారేసి
తప్పించుకోవడం అన్నిటికంటే సుళువట. వాళ్ళు అంతటితో ఆగక కుశల
ప్రశ్నలు వేస్తే ముక్తసరిగా జవాబు చెప్పి ‘అంతా
బావున్నారా?’
అని తిరిగి ఒకే ఒక్క కుశల ప్రశ్న వేసి ముందుకి సాగడం ఓ ఎత్తు ట. అక్కడితో వదలక మరీ చనువుగా ‘నేనెవరో
చెప్పుకోండి చూద్దాం?’
అని వాళ్ళు సవాలు విసిరితే ‘భాలేవారండీ
! మిమ్మల్నెలా మర్చిపోతాం?’
అంటూ కళ్ళు పెద్దవి చేసి చమత్కారంగా జవాబు చెప్తే అవతలి వాడు ఖచ్చితంగా చిత్తే నట. తరువాత ఇంటికొచ్చి ‘నాతో
ఇంతసేపూ కబుర్లు చెప్పిన వాళ్ళు ఎవరు చెప్మా?’
అని మాతో సందేహ నివృత్తి చేసుకున్న సందర్భాలూ లేకపోలేదు.
మొన్నీమధ్య పేపర్ లో ఎవరో ‘నూట
ఎనిమిది పేజీల శుభలేఖ’ వేయించారన్న వార్త చదివి ‘పిండి
కొద్దీ రొట్టి , డబ్బు ఎలా ఖర్చు చెయ్యాలో తెలీడంలేదు జనాలకి’ అని వాపోయారు మా ఇంటి చాగంటి. మనకి వచ్చిన శుభలేఖలని ఆయా ఫంక్షన్ ల తరువాత, ఏం చెయ్యాలి? దేవుడి
బొమ్మలుం టాయి కాబట్టి చింపకూడదనే అనే సందిగ్ధం వుండే మావగారికి, పాత న్యూస్ పేపర్ ల లో పెట్టేయండనే మా తమ్ముడి సలహా బాగా నచ్చింది. కానీ ఈ నూటెనిమిది పేజీల శుభలేఖ మాత్రం అస్సలు కొరుకుడు పడలేదు. ఇదే పంధాలో
వార్తల్లో బడా బాబూల ఇళ్ళల్లో జరిగే ఖరీదయిన వేడుకల గురించి కూడా తనదైన రీతిలో ఘాటుగా అభిప్రాయాలు వెలిబుచ్చక మానరు ఏ ‘న్యూస్ యాంకర్ ‘కి ఏ
మాత్రం తీసిపోని మా భాస్కర్ .
No comments:
Post a Comment