మా మావగారికి మొక్కలంటే ఎనలేని మక్కువ. నిజం చెప్పాలంటే మాకు ఇంటి చుట్టూ మట్టి జాగా లేక పోయినా, మా గేటు ముందు ఇరుపక్కలా
కొంత జాగా జాతీయంచేసి, తడిక కట్టించి, చిన్న
సైజు వృక్షాలు పెంచుతున్నారాయన. ఒకవేళ నగర పాలిక వారు చూసినా ‘బ్యూటిఫికేషన్’ క్రింద ఏమీ అనలేరని ఆయన ధీమా. పైగా డాబా మీది మా నీళ్ళ
కుండీ ఓవర్ ఫ్లో అయినప్పుడు అందులోంచి పారే నీరు ఈ మా వీధి తోటలోకి కారేలా పారేలా
ఏర్పాటు చేసారు ‘మావింజినీరుగారు’.
మా డాబా మీద- కుండీలలో, ప్లాస్టిక్ సంచులలో, చిల్లు పడిన బకెట్లలో, పెయింట్
డొక్కుల్లో ఇలా వివిధ
రీతుల్లో మాకు రోజూవారీ
నిత్యపూజకి ఎన్నో రకాల
పువ్వులనిచ్చే మొక్కలు - ఆయన
శ్రమ ఫలితమే. అంతే కాక- మిరపకాయలు, మెంతి కుర, బచ్చలి కూర,
కరివేపాకు, పుదినాతో సహా చాలా
వరకూ మా ‘టెర్రస్ గార్డెన్’ నుండే వాడుకుంటాం. నిజానికి మొక్కల పెంపకంలో మా అత్తగారి పాత్ర
కూడా చెప్పుకోదగ్గదే ఉన్నా, ‘మొక్కల పెంపక శాస్త్రం’ మీద కేవలం తనకే గట్టి పట్టు వుందని
మా మావగారి అభిప్రాయం.
దానికి తోడుగా మార్కెట్లో లభ్యమయ్యే రైతులకి సూచనలిచ్చే పుస్తకాలను ఠంచనుగా కొనుక్కుని అందులో చెప్పబడిన చిట్కాలు మా
బుల్లి తోట పై ప్రయోగిస్తుంటారు కూడా. ఒక్కోసారి
లక్షణంగా పూలు పూస్తున్న మొక్కలు ఎవరో నిప్పంటించినట్లు హఠాత్తుగా మాడిపోతూంటాయి. అదేమిటి మావయ్యగారూ అని ప్రశ్నిస్తే ....’అన్సీజన్ లో (అన్సీజన్ అంటే వాటికి అనువైన సీజన్ కానప్పుడు, ఇది ఆయన స్వీయనిఘంటువు లోని పదం, వెయ్యండి వీరతాడు) అలా అవుతాయమ్మా, మళ్ళీ పుంజుకుంటాయి చూస్తూండు! నీకు
మొక్కల గురించి పెద్దగా తెలీదు కదా! ’ అని గతంలో నేను
వంగ పువ్వుని పూజకి కోసిన సందర్భం
గుర్తుచేస్తూ నా నోరు మూయించటం ఆయనకే చెల్లింది. అలాంటి ఒక సందర్భంలో,
ఆయన వైపు అనుమానంగా చూస్తూ మా అత్తగారు
‘నిన్నా, అటు మొన్నా కూడా మేడమీదకి ఎదో నల్లటి గుండలాటి పదార్థం మోసుకెళ్ళారమ్మా, దాని ఫలితమే అయ్యివుంటుంది.’ అంటూ
నాకు వత్తాసు పలుకుతూ వుంటే ‘నువ్వుండవే! నీకేం తెలీదు,
దాని వల్ల ఏమీ కాదే, ఒకటి ‘జీవామృతం’, ఒకటి ‘వేప
పొడి’, అవి మొక్కలకి ఎంతో మంచివి’
అని దీర్ఘం తీస్తారు మాది తెలిసీతెలియని గోల అన్నట్లు అహం దెబ్బ తిన్న మా ‘వన విరాట్’.
రోజూ ఉదయం స్నానానికి ముందు భాగవత పద్యాలు
వల్లించుకుంటూ మొక్కలన్నిటికీ నీళ్ళు పోసి, స్నానం
అయ్యాక ఏదో ఒక స్తోత్రం చదువుతూ పూజకి పువ్వులు కోసే
డ్యూటీ మావగారు తన భుజ స్కందాలమీదే వేసుకున్నారు. దీనికి రెండు కారణాలు. ఒకటి- ఆరంభంలో చెప్పినట్లు ఆయనకు మొక్కల మీద ఎనలేని మక్కువయితే,
రెండు- నేను గనుక మేడ ఎక్కితే ఒక్క
పువ్వు కూడా మిగల్చకుండా కోసేస్తానెమో! అనే ఆయన భయం. డాబా మీది మొక్కలకి వున్న పువ్వులు వీధిలో
వాళ్లకి కనపడవు కదా! ఎంచక్కా అన్నీ కోసేసి దేవుడికి అలంకరించుకోవచ్చు అనే వాదన
నాదయితే, పువ్వులు మొక్కలకే
ఎక్కువ అందంగా వుంటాయి కాబట్టి అన్నీ కోసేయ్యకూడదనేది ఆయన 'పుష్పవిలాపం'.
ఒక సారైతే మేము మా బాత్రూం లోవున్న బాత్ టబ్ ఇంక అనవసరం అనుకుని
తీయిన్చేసినప్పుడు, చాలా రోజులు
మావగారు దాన్ని డాబా మీద పెట్టి మొక్కలు నాటే ‘ఇన్నోవేటివ్’ ప్రయత్నం చేసి,
అంత పెద్దదాన్నిండా మన్ను నింపితే అది చూరుకి అనవసరమైన బరువవ్వచ్చనే
టెక్నికల్ అనుమానం వచ్చి తన
వినూత్నాలోచనని ఉపసంహరించుకుని టబ్బుని వదిలించుకున్నారు.
ఆయనకు సహాయంగా ఇదివరలో గడ్డి తాత, ఇప్పుడు కృష్ణ తమదైన కృషి చేస్తున్నారు. మా గడ్డితాత నిజంగా తాతే. భుజం మీద ఒక బొరిగి
పట్టుకుని నోట్లో అడ్డ పొగ చుట్ట ఒక్కటి మినహాయిస్తే 'వృద్ధ పరశురాముడి'ని తలపించేవాడంటే నమ్మండి. ఆ వయసులో వాడు కలుపు మొక్కలు ఏరి గొప్పులు
తవ్వటానికే చాల కష్టపడేవాడు. ఉట్టినే డబ్బు సహాయం చేస్తే తీసుకునేవాడు కాదని మా మావగారు కనీసం వారానికి ఒకసారయినా పని చేయించుకున్నాననిపించి ఎంతో కొంత ముట్ట చెప్తూండేవారు. అదే గాక మా
అత్తగారు కడుపునిండా పెట్టె భోజనాన్ని ముఖ్యంగా గోంగూర పచ్చడిని ఎంతో ఆస్వాదిస్తూ ‘ధర్మతల్లులు’ అని ఆమెను కొనియాడుతూ తన ముసలిదానికో 'కోక' కూడా పట్టుకు వెళ్ళేవాడు తెలివైన తాత. కొన్నాళ్ళకు గడ్డితాత రావటం మానేసాడు. ఎక్కడో ఒక చోట బావున్నాడనుకుందాం
అని సరిపెట్టుకుని, కృష్ణని రంగంలోకి దింపారు మావగారు. ఇతను కొంచం హైటెక్కు అనే చెప్పాలి. కొడుకు సెల్ నెంబరు మా మావగారికి ఇచ్చి
పని వున్నప్పుడు ఫోన్ చేస్తే వాల్తాడు- ‘ఆన్ కాల్‘ అన్నమాట. పైగా బొరిగి, పార,
వెదురు గమేలా వంటి అవసరమైన పనిముట్లతో
సర్వఅస్త్రాపరాయణుడై ప్రత్యక్షమవుతాడు.
మా వూరి
మొత్తానికి గెత్తం 'హోం డెలివరీ' చేసే వాడొకడున్నాడు.
బక్క చిక్కిన జోడు ఎడ్లని బండికి కట్టి, నిండా గెత్తం నింపి చెర్నాకోలు ఝళిపిస్తూ ‘గెత్తమండీ గెత్తం!’ అని అరుస్తూ,
ఎందు కోసం కొనరు? ఎవరికోసం కొనరు? అన్నట్టు
వుండే పొలికేక పెడ్తూ వీధి వీధి తిరిగుతాడు. మా వూళ్ళో ‘ఏకైక ఎడ్లబండి ఓనరు’ అతనొక్కడే అంటూ మొన్నీ మధ్య ఒక ఆంగ్ల దినపత్రికలో అతగాడి గురించి ఫోటో వేసి మరీ కథనం వ్రాసారు.
మా మావగారు కనిపిస్తే బంకలా పట్టుకుని వదిలడు. అతగాడి అరుపు వీధి మలుపు నుంచి వినగానే ఇంత పెద్దమనిషీ దాక్కున్నంత
పని చేస్తారు. ఇక గెత్తం వద్దని నేనూ మా అత్తగారూ చెప్పినా, మావగారు
ఇంట్లో లేరని చెప్పినా వినడు. గట్టిగా ‘అయ్యగారిని
పిలవండమ్మా!’ అని దాదాపు దబాయించినట్లు వుండే మాటతీరుకి ఎంతో శాంతమూర్తి అయిన మా
అత్తగారికి సైతం చిర్రెత్తుకొస్తుంది. ఒకసారి పాపం
మావగారు వీధిలో కూర్చుని పేపరు చదువుతూ గెత్తంవాడికి దొరికిపోయారు. ఎలాగో మాటలతో
ఆయన్ని బురిడీ కొట్టించి బండిలోని సగం గెత్తం అంటగట్టాడు.
అతి తొందరగా అతగాడిని వదిలించకోవాలని మా ఇంటి ముందు మినీ తోటలో యకాయకిన గెత్తం మొత్తం
దింపించేసి అతనికి వీడ్కోలు పలికారు
మావగారు. అంతటితో ఆయన పని పూర్తికాదాయే- కృష్ణ కొడుక్కి ఫోన్ చెయ్యాలీ, వాడు దొరికి వాళ్ళ నాన్నకి కబురు తెలియ జేయాలీ, అప్పుడు కృష్ణ వచ్చి గెత్తం అన్ని మొక్కలలో వెయ్యాలి....ఇంత తతంగం
వుంది. గ్రహచారం బాగోక ఆ రోజు, ఆ మరుసటి రోజు కూడా క్రిష్ణకొడుకు
దొరకలేదు, కృష్ణ రాలేదు. ఈ లోపల వీధివనంలో సింగారంగా చిగురు తొడిగిన సంపంగి
మొక్కకాస్తా వంకరగా తోటకూర కాడలా ఎండి వాడిపోయింది. మా
అత్తగారు ఎంతో ముచ్చటపడి సింహాచలం వెళ్లినప్పుడు కొనుక్కున్న తెల్ల సంపంగి మొక్క
అది. దాని వాలకం చూసి ‘అతగాడి దగ్గర గెత్తం వద్దంటే విన్నారుకాదు! పైగా మొత్తం
ఇక్కడ పోగు వేయించారు. చూడండి వేడికి లక్షణంగా పెరిగిన సంపంగి మొక్క పని
అయిపొయింది’ అంటూ భర్తతో వాపోయారు ఉక్రోషంగా. నాకూ నిజమే అనిపించింది సుమీ! రేపో
మాపో ఎంచక్కా పూసే పచ్చని మొక్కని నిష్కారణంగా
హరీమనిపిం చారే! అనుకున్నా. తక్షణ కర్తవ్యంగా స్కూటరెక్కి కృష్ణని
గాలించి వెదికి పట్టుకుని తెచ్చి, గెత్తం వీధిలోమొక్కలకీ, డాబామీద మొక్కలకీ సర్దుబాటు చేయించి, ‘ఎమేవ్! నీకు నువ్వా-నేనా అనే లాంటి సంపంగి మొక్క తెచ్చి వేస్తాను,
చూస్తూండు’ అని ఊరడిస్తూ అర్ధాంగికి వాగ్దానం చేసారు
మా ‘భీష్మావగారు’. 'నువ్వా-నేనా' అని ఆయన అన్నారంటే ఆయన తేవబోయే
మొక్క దేవలోకం నుంచి ఆ
కృష్ణభగవానుడు తెచ్చిన పారిజాత వృక్షం లాగ 'నభూతో న భవిష్యతి' అన్నమాటే.
చాలా రోజులు మా ఇంట్లో తరిగిన కూరల తొక్కలన్నిటి తో పాటూ, వడగట్టిన టీ పొడి, ఫిల్టర్
అడుగున కాఫీపొడి వంటివి రోజూ ఒక డబ్బాలో వేసి భద్రపరచి ఉంచాలనే మావగారి శాసనం అమలులో వుండేది. అవన్నీ డాబా మీద మొక్కలకి ఆర్భాటంగా ‘ఆర్గానిక్ గెత్తం ‘
అయ్యేవి. ఒకోసారి ఆ డబ్బాలోంచి ఇబ్బందికరమయిన (మురుగు) వాసన వస్తోందనిపించి, ఉదోత్తులు
వెలిగించినా లాభంలేకపోఎసరికీ, మేమది మా వీధి వనంలోకి గిరాటేసేవాళ్ళం. అది ఆయనకి సుతరాము
నచ్చేది కాదు కానీ, మా
ఆడవాళ్ళ సుదీర్ఘ సణుగుడుతో తాళలేక ఆ రాజశాసనాన్ని రద్దుచేయక తప్పలేదు ఆయనకి. మరి మామిడి టెంకలూ, జీళ్ళు, సీతాఫలం గింజలూ పెరట్లోకి గానీ వీధిలోకి గానీ విసిరినప్పుడు మాత్రం 'కొంచం దూరంగా విసరండర్రా! మరీ గోడనానుకుని వృక్షాలు పెరిగిపోతే ముందు ముందు
చాలా కష్టం' అని చమత్కారంగా
చింతిస్తూ పగటి కలలు 'మావనమాలీ'. ఈ విషయంలో ఆయనకు ఏమాత్రం తీసిపోని మా
అత్తగారోసారి నేను సీతాఫలం తింటూoటే ‘తల్లీ! గింజలు పెరట్లో, తొక్కలు వీధిలో వెయ్యమ్మా!’
అనగానే నా పరీస్థితి ఆలోచించండి.
ఒకసారి ఎదో పాదు లేచింది మా వీధి గుమ్మంలో, అది
మామూలు గుమ్మడా! బూడిద గుమ్మడా! అనే సస్పెన్స్ తట్టుకోవడం చాలా కష్టం అయింది మావగారికి. ఇక అది బూడిద గుమ్మడి అని తేలాక
ఆయన హడావిడి ఇంతా అంతా కాదు. పింజెలుగా ఉన్న దగ్గర్నుంచీ పంపకాలు మొదలు. అక్కయ్యపాలెం లో ఆయన చెల్లి చాల బాగా వడియాలు పెడుతుందని ఆవిడకీ,
మా ఆడపడుచు అత్తవారి ఇంట్లో బోలెడు
జనాభా ఉన్నారు కాబట్టి వాళ్ళకీ, ఆయన వాకింగ్ స్నేహితుడు వాళ్ల పెరటి అరటి కాయలు ఇదివరలో మాకు ఇచ్చి
వున్నారు కావున ఆయనకీ, మనవరాలి పెళ్లి ముందున్న బాల్య స్నేహితునికి తప్పక ఇవ్వాలనీ, ఇలా వాటాలు వెయ్యసాగారు. ఈ పంపకాల వాగ్వివాదాలు ఒకంతట తెగేవి కాదనుకోండి. పైపెచ్చు వీధిలో పాదు కాబట్టి ఎవరైనా కాయలు తస్కరిస్తారేమో! అనే ఆందోళన కూడా వుండేది ఆయనకి. బూడిద గుమ్మడికాయల్ని నరదృష్టి తగలకుండా గుమ్మానికి వేలాడ దీసే ఆనవాయితీ వున్నది
కనుక, సెంటిమెంటల్గా దాన్ని ఎవరూ
దొంగి లించరని మార్నింగ్
వాక్ లో ఎవరో చప్పాకగానీ ఆయన మనసు కుదుటపడలేదు.
మరోసారి తీయగుమ్మడి పాదు లేచింది. పువ్వు
రాగానే వాటితో ఇంట్లో బజ్జీలు తయారయ్యాయి. పైగా మా
ఎదురింటి వాళ్ల అమ్మాయి పెళ్లి కుదరటం తో కన్యాదానం వేళకి
వాళ్ల కివ్వడానికి ఉపయోగంగా మా పంట చేతికోస్తుందో రాదో! అని తెగ టెన్షన్ పడ్డారు మా పెద్దాయన. ఇక కాకరపాదు లేచినప్పుడయితే, వారానికి కనీసం రెండ్రోజులు
ఇంట్లో అదే కూర కాగా, బంధు మిత్రులందరికీ స్వయంగా తానే సరఫరా
చేసి వచ్చారు ‘మా ఇంటి కాకర’ గుణ గణాలని వల్లించి మరీ.
చివరకు ఆయన ఖాతాలు వున్న బ్యాంకు మేనేజరుగారికి సైతం రమారమి కేజీకి పైగా వెళ్ళాయి. మా
ఇంటికివిచ్చేసిన వారికి రకరకాల ఉచితంగా
అత్తగారి 'కాకరెసిపీ' లతో పాటుగా ‘కాకర
తాంబూలం’ దక్కేది పాదు పచ్చగా
ఉన్నన్ని రోజులూ.
మావగారి మార్నింగ్ వాక్ స్నేహితులొకరు ఒకసారి
వర్షాకాలంలో మారేడు, ఉసిరి మొక్కలు ఇచ్చారు మాకు. వాటిని మా వీధిలోని
చిరు తోటలో వాటిని నాటడం తడవు కార్తీక మాసం వనభోజనం వరకూ కలలు మొదలు మావగారికి. ఉసిరి ఊపిరి పోసుకుని నిలదొక్కుకోగా, మారేడు మాయమయ్యింది.
మా ఊరిని ‘హుద్ హుద్’ అని ఒక పెను తుఫాను తాకి ఒక్క రోజులో చాలా
పచ్చదనాన్ని పొట్టన పెట్టుకుంది నాలుగు సంవత్సరాల క్రితం. సర్కారు వారు యుద్ధ ప్రాతిపదికన ప్రతీ ఇంటికి ముందు ఇరుపక్కలా
రకరకాల మొక్కలు నాటి, వాటి
చుట్టూ రక్షణ కవచాలాగ ‘ట్రీ గార్డ్ ‘ ల ను కూడా అమర్చారు. మా ఇంటి ముందు దేవకాంచన మొక్క వేసారు. మొక్క ఎదిగే సమయంలో దాన్ని ఆవులనుండీ , గేదలనుండీ అప్పుడప్పుడు మధ్యాహ్నం నిద్ర కూడా త్యాగం
చేసి మరీ
రక్షించుకున్నారు మావగారు. దాని ఎదుగుదల ఒక సవాలుగా తీసుకుని మా వీధిలోని మిగతా అన్ని చెట్ల కంటే బాగా పెంచారు. ఇప్పుడది బోలెడు అందమయిన పువ్వులిస్తోంది. దాంతో రోజూ తెల్లవారుఝాము
నుండీ మాకు భక్తుల రద్దీ కూడా పెరిగింది. ‘ఈ పువ్వులు తొందరగా వాడి పోతాయర్రా!’ అని
కొందరికీ, ‘ఈ పువ్వులు పూజకి పనికి రావమ్మా !’ అని ఎందరికో , ‘కొన్ని పువ్వులు చెట్టుకి కూడా ఉండనివ్వండమ్మా’ అని అందరికీ కొంచం గొంతు రెట్టించినా, సకారాత్మకంగా మాత్రం చెప్తారాయన. ఇందులోనూ 'సకారాత్మకత' దేనికా! అని అనుకుంటున్నారా? మరేమీ లేదు మొన్న ఆయన స్నేహితుడు ఒకరు
ఇలాగే ఒకామెను పూలు కోయొద్దని వారించబోతే, 'ఈ రోడ్డు మీ స్వంతమా? పోనీ ఈ చెట్టు మీదా? ఈ పువ్వులు మీవా?' అని గదమాయించిందిట ఆ అపరభక్తురాలు.
ఏది ఏమైనా ప్రకృతి మాతకి జోహార్లమ్మా! అంటూ
తన వనసంపదనీ, వృక్ష
సామ్రాజ్యాన్నీ చూసుకుని ‘మా తోటరాముడు’ మురిసిపోవడం,
ఒక మరపురాని ముచ్చట.
No comments:
Post a Comment