నా ప్రియమైన బ్లాగాభిమానులందరికీ చాలా సారీ! ఈ మధ్య కొంచం సమయం సర్దుబాటు కాకపోవడం వల్ల మీ ముందుకి రాలేక పోయాను. ఆలసించినా ఆశాభంగం కాకూడదుగా...కాబట్టి సమయం సర్దుబాటు కాకపోవడానికి ముఖ్య కారణమే నేటి బ్లాగాంశం...చిత్తగించండి!
చాలా కాలం నుంచీ కర్నాటక సంగీతం
శ్రీమతి వేదుల కమల గారి వద్ద అభ్యసిస్తున్నా, ఒక ‘సర్ఫ్ టికెట్’ చేతిలో
వుంటే ‘ఆ కిక్కే వేరబ్బా’ అనిపించి సరిగ్గా ఆర్నెల్ల క్రితం ప్రముఖ ఆంధ్రా
యూనివర్సిటీ వారు పెట్టిన ‘భక్తి సంగీతం’ అనే డిప్లమా కోర్సులో చేరాను నేను. దీని
వెనుక మా సంగీతం టీచర్ కి వేరే ఊరు బదిలీ అవడం ఓ కారణమయితే...సంగీతంలో నాతో
జతకట్టే నా అర్ధమొగుడి ప్రోద్బలం చాలా ముఖ్యమయిన కారణం ...ముప్పై నాలుగు రకరకాల
పాటలు నేర్చుకోవచ్చు ఎంచక్కా! అంటూ... నేనున్నానుగా అంటూ... నాతో పాటూ మా తోటప్పను
కూడా తోసి తోసి, మొత్తానికి ముగ్గురం ఈ కోర్సులోకి చేరడం జరిగింది. (సకుటుంబ
సపరివార సమేతంగా అన్నమాట... స్వతహాగా సంగీత ప్రియులైన మా మావగార్ని కూడా చేర్చేస్తేనో అనే ఆలోచన కూడా
వచ్చింది సుమండీ! ఇంకా నయం!)
మొత్తానికి ఇరవై మంది తయారయ్యాం మొదటి రోజు
క్లాసుకి. చాలా సంవత్సరాల తరువాత తరగతి గదిలో విద్యార్ధుల్లా కూర్చోవడం, మా వయసుని
సగానికి తగ్గించేసింది సంతూర్ సబ్బులాగ. ఇంతవరకూ కధ బాగానే వుంది. ఎదో నాలుగు భక్తి
పాటలు నేర్పుతారనుకుంటే.... మాకు ఐదు పేపర్ లనీ, వాటిల్లో రెండు థియరీ మూడు
ప్రాక్టికల్స్ అంటే మూడు వ్రాత (వాత) పరీక్షలూ, రెండు మౌఖిక (మోత) పరీక్షలూ అనీ తెలిసింది
మా ప్రాణానికి. సిలబస్ చూసాక ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్
అదే ముందుంది మొసళ్ళ పండగ అని బాగా బోధపడింది.
ఇక మా బ్యాచ్ లో ఇరవై నుంచీ అరవై వరకూ అన్ని
వయసుల వాళ్ళూ వుండడం విశేషం. ‘సాపాసాలు’- సంగీతంలో ఓనమాలు తెలిసిన (తెలుసనుకున్న
అంటే బెటరేమో) వాళ్ళు ఒక అరడజనుమంది వుంటే, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుని
వదిలేసామంటూ మళ్ళీ మొదలెట్టిన వారొక నలుగురూ తప్ప మిగతా అందరూ ఈ కోర్సుతో సంగీతాక్షరాభ్యాసం
చేసినవాళ్ళే.
‘అనంతావై రాగా’ అన్నట్లు మేము పలికించిన రాగాలు ఇన్నీ అన్నీ
కావు. పైగా సంగీతంలో అతి క్లిష్టమయిన అంశం తాళం కావడం ముమ్మాటికీ నిజం అని
నిరూపించాం కూడా. ఒక పల్లవిలో మాకు మూడు సంగతులు నేర్పితే, మూడూ మరచిపోయి నాల్గవది
కనిపెట్టె నైపుణ్యం ఒకరికి వుంటే, ఒకే సరళీస్వరంలో
మూడు రాగాలు పలికించె ఘనత ఒకరిది. అచల స్వరాలను కూడా గమకాలతో పలికే ఒరిజినాలిటీ
ఒకరి సోత్తయితే, గొంతు వణికిస్తే గమకం వచ్చేసినట్లే అనే ధీమా ఇంకోకరిది. ఒకరు భజన్
ని కర్నాటక సాంప్రదాయంలో బరువుగా పాడితే, ఒకరు పట్టయిన రాగాన్ని లైట్ మ్యూజిక్
లాగ పాడడం. ఒకరు ఎదురు తాళం వేస్తే, ఒకరు బెదిరిపోయి
అస్సలు తాళం వెయ్యకుండా, ఒకరు హార్మోనియం మెట్లమీద వేళ్ళు ఆడించినట్లు తాళం
వెయ్యడం. ఒకరు చప్పట్లు కొడుతూ తాళం వేస్తే, ఒకరు తొడలు వాచిపోయేలా వెయ్యడం. ఒకరు
కితకితలు పెడుతున్నట్లు గాల్లో వేళ్ళాడిస్తూ తాళం వేసామనుకోవడం. ఒకరు వేళ్ళకంటే తల
ఎక్కువ ఆడించడం, తారాస్థాయి స్వరాలంటే ఆకాశం వైపు వేలు చూపిస్తూ మరీ పాడడం, ఆరంభం సంగతి
దేవుడెరుగు ముగింపు మటుకూ అమితోత్సాహంగా చేయడం... ఇలా రకరకాల అభినయాలతో భలే రంజకంగా
సాగింది మా సొబగుల సంగీత యాత్ర.
కత్తిలా వుండే ఒక చిన్నది అందరికంటే ముందు క్లాసుకు
వచ్చి కాళ్ళెత్తి మరీ (కొంచం పోట్టిలెండి) బోర్డు మీద ‘శుభసాయంత్రం’ అని
ముత్యాల్లాంటి అక్షరాలతో రాసి మాకు స్వాగతం పలికేది. ఎంత అందంగా నోట్సు రాసుకునేదో
అంత చక్కగానూ పాడేది.
సాఫ్ట్ అండ్ సిన్సియర్ ఇంకొకకావిడ. కంస్ట్రక్షన్ బిజినెస్ లో ఉంటూ ఆఫీసు నుంచి క్లాస్ కి వచ్చి ‘వర్క్ ఫ్రం క్లాస్’ అన్నట్టు ఫోన్ లోంచే ఆఫీసు కధ కూడా నడిపించేది.
బుద్ధిశాలి బూరి మరో టిప్ టాప్ లేడీ. పెన్సిలూ, రబ్బరూ,
చెక్కు మెండరూ సైతం క్లాసుకి తెచ్చుకుని విపరీతంగా అండర్ లైన్ చేస్తూ మరీ నోట్సులు
రాసేది. టూ మచ్ పర్ఫెక్షన్ తో డౌట్లు
అడుగుతుండేది.
కోర్సు మధ్యలో కూతురు విదేశాలనుంచి వచ్చిన
తరుణంలో క్లాసులనుంచి బ్రేక్ తీసుకోవడానికి విలవిల లాడి, కూతుర్ని అలా ఫ్లయిట్
ఎక్కించేసి ఇలా క్లాసులో ప్రత్యక్షమయ్యారు మరో వయోజన విద్యార్ధిని.
నా స్టైలే వేరు అంటూ ప్రతీ క్లాస్ కీ ఒకో స్టైల్
లో బహుదూరం నుంచి వచ్చేవారు వృత్తి రీత్యా బ్యూటీషియన్ అయిన ఇంకో లేడీ. ఆవిడ తన మనవరాలిని
క్లాసుకి తెస్తే అవాక్కయ్యాం నిజ్జంగా!
చక్కని గొంతుతో భజనలన్నీ భలే అవలీలగా పాడేసే
మరొకామెకి కొంచం వర్రీ జాస్తి. పాపం చెప్పింది చెప్పినట్టు పాడకుండా, లెక్ఖలేనన్ని
టెక్నికల్ డౌట్లు పెట్టుకుని అవి తీరక, తీవ్ర అసంతృప్తితో బాబోయ్! అనుకుంటూ వుండేది.
మరొక పొట్టి దిట్ట, క్లాస్ లోకి రాగానే కాలేజి
రోజులు గుర్తొచ్చి కుర్రచేష్టలు చేస్తూ, కళ్ళతోనే పెంకితనం చేస్తూ నవ్వులు చిందిస్తూ...'తాళం వెయ్యకుండా ఏమయినా పాడేస్తాను...వెయ్యమంటేనే కొంచం కష్టం' అంటూ కాలం
గడిపేసేది.
నవ్వులబండీ ఈ వనిత నిండుగా అటెండయిన క్లాసులు
తక్కువే అయినా మిగతావారితో కలసి గొప్ప సందడి చేసేది. పాటలు నేర్చుకుంటాను గానీ,
పరీక్షలు ససేమిరా తనవల్ల కాదని భర్తతో ముందే ఒప్పందం కుదుర్చుకుందట.
ఒక ఇద్దరు పెద్ద టీచరమ్మలు కూడా సరాసరి వాళ్ళ
డిపార్ట్మెంట్ ల నుంచి క్లాసుకి వచ్చేవారు. మిగతా మాలాంటి అల్లరి మూకని చూసి
ఏమనలేక ముసి ముసిగా నవ్వుకునేవాళ్ళు పాపం.
ఒక లాయరమ్మగారయితే ఏకంగా కోర్టునుంచి... అంటే ఆ
కచేరీ నుంచి ఈ కచేరీకి వచ్చేవారన్నమాట.
బ్యాచ్ లో బహు స్పెషల్ ఒక జంట, వారితోపాటే వారి మేనకోడలు, మా లాగే ఫ్యామిలీ ఫ్యామిలీ చేరారు
కోర్సులో. సతి యోగాలో నిష్ణాతురాలయితే, పతి ప్రభుత్వోద్యోగి. ప్రతీ గురువునీ పాఠం
రికార్డ్ చేసి పెట్టమని పోరడం ఆమె వంతయితే, మిగాతావారేవ్వరికీ కలలో కూడా రాని డౌట్లు
అడగడం ఆయన రికార్డు. పాపం ఏక్ నిరంజన్ లాగ, ఇరవై మంది అతివల మధ్యలో ఒకే ఒక పురుష
పుంగవుడు గళం విప్పి పాడడం అంటే మాటలా చెప్పండి. పైగా ఆనందంగా నాట్యం (శాస్త్రీయం
కాదు సుమండీ, భక్తిపరవశ నాట్యం మాత్రమే) చెయ్యడానికి కూడా వీలుగా/హుషారుగా వుండే పాటలు నేర్పమని
ఆయన మా గురువులకి విజ్ఞప్తి కూడా చేసుకున్నారు.
ఇక వారి మేనకోడలికి వచ్చేనెల పెళ్ళండోయ్! కేవలం పెళ్లిచూపుల్లో పాడాల్సిన పాటలకోసం చేరావన్నమాట అని ఆటపట్టించామంతా.
‘నా వయసు నలభై నాలుగు. దాదాపు పుట్టిన
దగ్గర్నుంచీ సంగీతం నేర్చుకుంటున్నాను. ఇప్పటివరకూ నాకు ఎప్పుడూ ఇలాంటి డౌట్లు రాలేదు’
అంటూ వాపోయేది సంగీతం నేర్చుకోవడంలో మా అందరికంటే ఎక్కువ అనుభవం ఉన్న మరొకామె.
అచ్చు మరో టీచరమ్మలా మాకున్న డౌట్లు తీరుస్తూ, స్పెషల్ గా నోట్సులు రాస్తూ, మా
అందరిచేత త్యాగరాజ ఆరాధనోత్సవాలకి ప్రాక్టీసు చేయించి మొత్తానికి మా బృందగానం ‘మంద
గానం ‘ కాకుండా చూసుకుంది మా ఈ సంగీతం ట్యూషన్ టీచర్.
ఆశ లావయిపోయి తను మటుకూ బహు సన్నగా వుండే ఒక
ఇంజినీరింగ్ విద్యార్ధిని కూడా మా బ్యాచ్ మేటే. ఈ వయసులో వీళ్ళకీ
అల్లరేంటి? అని పిచ్చిపిల్ల ముక్కున వేలేసుకుని కుక్కిన పేనులా ఉండేది పాపం క్లాస్ లో.
ఇక కొత్తగా పెళ్ళయిన ఒకమ్మాయి అందర్నీ అక్కా
అని పిలుస్తూ, తను మా వయోజన విద్యలో చేరినా చిన్నదాన్నే అని గుర్తు చేస్తూ సరదాగా
వస్తూ మానేస్తూ...గ్యారంటీగా పుట్టబోయేవారికి
లాలిపాటలవరకూ శ్రావ్యంగా పాడగలిగే సత్తా వరకూ పెంచుకుంది.
ఊరవతల గవర్నమెంట్ స్కూల్ లో టీచరమ్మగా
పనిచేస్తూ ఈ కోర్సులో వేలు పెట్టి పాపం చాలా క్లాసులకి రాలేకపోయినా, కొన్ని
క్లాసులకి సరిగ్గా ప్రసాదం భాక్తురాల్లాగా అటెండేన్సు వేళకి మాత్రమే హాజరయినా,
గొప్పగా మేకప్ చేసిన ఘనురాలు ఒకామె.
ఇక మా గురుత్రయం గురించి, ఆల్ ఇండియా రేడియోలో
మేటి విద్వాంసురాళ్ళు. అలాంటి వాళ్ళకి మా శిష్యరికం ఒక గొప్ప అనుభవమే(?) అయికూర్చుందని
నా గట్టి నమ్మకం.
సంస్కృతంలో లిఖించబడిన కీర్తనలు నేర్పడం ఒక
గురువు వంతు. ఒకే ఒక్క అష్టపదితో ఆమెకి మా సత్తా అర్ధమయ్యి, మాతో ‘ఒరిజినల్స్’ లాభం
లేదని ఎంతో నేర్పుగా కేవలం మా కోసమే సరళమైన రాగాలలో ఒక పది కీర్తనలను స్వరపరచి ఓర్పుగా
నేర్పించి పుణ్యంగట్టుకున్నారు. హ్రస్వాక్షరాలూ,
వొత్తులూ, లేని వాట్సాప్ తెలుగుకి అలవాటుపడిపోయిన మాలాంటి వాళ్లచేత అచ్చు తప్పులు లేకుండా సంస్కృత పదాలను పలకించడం
ఆవిడకి పెద్ద సవాలే అయ్యింది.
ఎదో మన భాష చాలదన్నట్టు ఇతరభాషా కీర్తనలు ఒక
డజను మరో మేడం గారు విప్పవలసిన
చిక్కుముడి. మొదటి పాఠం కన్నడంలో పురందరదాసు కీర్తన అది కూడా ఖండచాపు తాళంలో మొదలుపెట్టి మమ్మల్ని ఖంగుతినిపించి,
మా ప్రావీణ్యానికి ఆవిడ ఖంగారు పడ్డారు. ఒక మూడు క్లాసులు మా అవస్థను గమనించి
ఎట్టకేలకు కొంచం సులభతరంగా వుండే బెంగాలీ, మరాఠీ, తమిళ, వ్రజ్ లోని రచనలతో సిలబస్ పూర్తి
చేసారు. ఇవే కాకుండా మాకు సంగీతంలోని పారిభాషిక పదాలను పరిచయం చెయ్యడం కూడా ఆమె వంతే.
‘సూతుడు శౌనకాది ఋషుల సమక్షంలో యిట్లనియె....తొలి సాంబశివుడు కుమారస్వామితో ఇట్లు
పలికే...’ ఇలా మన వ్రతకధల పుస్తకాలలోని భాషలాగా వుంది మా సంగీత పారిభాషిక భాష.
దీన్ని మొత్తం వాడుక భాషలో మాకు అర్ధం అయ్యేలా చెప్పి మా వ్యవహారం చేక్కబెట్టేసరికీ
పాపం ఆవిడ చిక్కిపోయారు.
ఇక మూడోటీచర్ మా కోర్సు సమయంలోనే తన ‘పీ హెచ్ డీ’ పూర్తి చేసారు. దేనికి ఆమె ఎక్కువ
ఆందోళన పడ్డారంటే కచ్చితంగా మాకు కీర్తనలు నేర్పించడానికే అని ఆవిడ కూడా ఒప్పుకోవడం తథ్యం. ఎందుకంటే పాపం ఒక డజను వివిధ వాగ్గేయకారుల రచనలతో పాటూ
సరళీస్వరాల దగ్గర్నుంచీ హెచ్చు/ దిగువ స్థాయి స్వరాల వరకూ ఒకటి కాదు కనీసం మూడు
రాగాలలో పాదగాలిగేలా మాకు ఆవిడ తర్ఫీదునివ్వాలి. ఇహ ఆవిడకి పాపం జాక్ పాట్ తగిలిననట్టే. దాదాపు ఊరి చివర
నుంచి రెండు గంటల ప్రయాణం చేసి వచ్చి ఎంతో ఇదిగా ఒక మాంచి కీర్తన మొదలుపెట్టడం, మా
‘కంఠ’సోష కి నీరుగారిపోయి, వీళ్ళతో ఎలాగరా భగవంతుడా! అని మొదట్లో తెగ కిందామీదా
పడినా, ఎంతో రుచికరమైన రచనలు ఏరి కోరి నానా తంటాలు పడి మొత్తానికి మాచేత పాడించారు చివరికోచ్చేసరికీ.
ఈమధ్య మా బంధువుల్లో ఒక పెద్దాయన హైదరాబాదు
నుంచి ఫోన్ చేసినప్పుడు మా సంగీతం గురించి
చెప్పగానే, సాధన చేస్తున్నామా లేదా అని వాకబు చేసారు. క్రమం తప్పకుండా చేస్తున్నామనగానే మా ఇంటి వెనుక వున్న కొండ కరిగినట్టు మొన్నీమధ్య పేపర్లో వార్త చదివానన్నారు చమత్కారంగా.
అదేవిటండీ? అంటే ‘పూర్వం జగదేకవీరుని కథలో చూడలేదూ? అలాగే’ అన్నారాయన.
కొండల మాట
దేవుడెరుగు మా గురువుల ఓపికలు తరగకుండా ఎదో మా వొంతు కృషి చేస్తున్నామని అనుకుంటూ ప్రస్తుతానికి
వచ్చే పరీక్షలకి తయారవుతున్నాం. మీ అందరి బెస్ట్ విషెస్ కోరుకుంటూ...
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు