బ్లాగాయనమః
గత సంచిక తరువాయి ...
ఇంతకీ ఇన్నిన్ని ఫోటోలు తీయించుకున్నాక, ఆ తరువాత ఏం జరుగుతోందో దాని గురించి కూడా
మాట్లాడుకోవాలిగా. ఇదివరకటి రోజుల్లో ఒకే ఒక్క ఆల్బం, అదీ సుమారుగా వుండే సైజులో,
దాంట్లో చక్కగా నాలుగు మూలలా చిన్న చిన్న బ్రౌన్ అట్ట ముక్కలు త్రికోణాకారంలో కట్
చేసినవి - వాటిల్లో ఫోటోలని దోపినట్టుగా పేజీకి ఒకటి లేదా రెండు చొప్పున అమర్చేవారు.
రాను రాను ఆల్బంలు పాలిథిన్ కవర్లల రూపం దాల్చి రీలుకి తలా ఒకటి తయారవసాగాయి. ఇంకొంచం కొత్త రకం ఆల్బంలయితే, ఒక డిజైను
కలిగిన అట్టల మీద జిగురు ముందుగానే పూసి
పైన పాలిథీన్ షీట్ కప్పబడి ఉండేవి,
ఆ షీట్ పైకి లాగి, ఒక్కో అట్ట మీద కనీసం
నాలుగు ఫోటోలు అంటిచే వాళ్ళన్నమాట. కానీ ఒక్కోసారి మాత్రం ఆ జిగురు మొత్తం ఫొటోలన్నిటి మీదకి పాకేసి ఫోటోలు
పసుపు రాసుకున్నట్టయ్యేవి, అంటే పాడయ్యేవి. (ఇంత ఘంటాపదంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే,
మా పెళ్లి ఫోటోలకి అదే ‘పసుపుగతి’ పట్టింది పాపం.)
ఇక ఈ రోజుల్లో పెళ్లి ఆల్బం అనగానే ‘చిన్న సూట్ కేస్ ‘ లేదా ’బ్రీఫ్ కేస్’ సైజుల్లో వుంటున్నాయి. మా ఎదురింటి వాళ్ల అమ్మాయి పెళ్లి
తరువాత ఒక సారి ఫోటోలు చూడమంటూ మా ఇంటికి ఆల్బం
(లు ) పంపించారు. వాళ్ల ఇంట్లో పని చేసే
అమ్మాయి నెత్తిమీద పెట్టుకుని మరీ జాగ్రత్తగా
అందించింది మాకు. పెద్ద సోఫాలో నేను ఒక
మూల కూర్చుని ఆల్బం ఒళ్లో పెట్టుకుని ఒక్కో పేజీ తిప్పడం, మా అత్తగారు రెండవ మూల కూర్చుని నేతిప్పిన పేజీ
తన ఒళ్లో కి తీసుకోవడం, ఇలా బ్రహ్మ
ప్రయత్నం చేసి ఫోటోలు ఆస్వాదించాల్సి
వచ్చింది. వయసు పైబడినవాళ్ళకీ , పెషం ట్లకీ ఈ 'విపరీతాల్భం లు' ఫిజియో థెరపీలో భాగంగా వాడోచ్చేమో!
దీనికి పూర్తి విరుద్ధంగా ఇంకొక
పరిచయస్తులు వారి అమ్మాయి ఎంగేజ్మెంట్
ఫోటోల ఆల్బం కేవలం అరచెయ్యి పరిణామంలో
అంటే చొక్కా జేబులో ఎంచక్కా పెట్టేసుకోవచ్చన్నమాట, అలా చేయించారు.
మాకు ఇరుగింట్లో వుండే వాళ్ల
అమ్మాయికి వోణీల పేరంటం (ఒక ఫంక్షన్ హాల్ లో ) జరిగినప్పుడు మమ్మల్ని కూడా
ఆహ్వానించినా మేము ఊళ్ళో లేకపోవడంతో హాజరు కాలేక పోయాం. తరువాతి రోజుల్లో ఒక
సాయంత్రం నేనూ, మా అత్తగారు ఆ అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చే నేపథ్యంలో వాళ్ళింటికి
వెళ్లాం. వాళ్ళు ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో వల్లిస్తూ మా ముందు ఆల్బం ఉంచారు మేము
ఎంత మిస్సయ్యామో ఫోటోలు చూసి మాకే తెలిసి రావాలన్నట్టు. మొదటి రెండు పేజీలు వాళ్ళమ్మాయి
నిలువెత్తు చిత్రాలయితే, తదుపరివన్నీ ఆ అమ్మాయిని ఆశీర్వదించడానికి వచ్చిన జంటలు,
ఆమెకి ఇరుపక్కలా నిలబడి చిన్నప్పుడు మనం ‘దెబ్బకి రెండు ద్రాక్షపళ్ళు’ ఆడుకోవడానికి ఎదురెదురుగా నిలబడి చేతులు
పైకెత్తి నించునే వాళ్ళం కదా? అలాంటి ఫోజుల్లో అక్షింతలు వేస్తూ అన్నమాట. చివరి
పేజీ వరకూ అదే వరుస. పిల్ల పోజు అస్సలు మారలేదు. జంటలు మారారు అంతే. మేము మిస్సయింది అలాంటి ఫోటో తీయించుకునే
సువర్ణావకాశాన్ని అనే సంగతి మటుకూ బాగా అర్ధం అయ్యింది మాకు.
గమనించి తీరాల్సిన విషయం ఏమిటంటే తీసిన ప్రతీ
ఫోటో కీ ఆల్బంలో చోటు దక్కాలంటే దానికి (అంటే ఆ ఫోటోకి ) చాలా మహార్దశ పట్టాలిమరి.
దాదాపు (తక్కువలో ) పదివేలకు పై చిలుకు ఫోటోలు తీస్తే
ఒక రెండొందలకి కూడా ఆల్బంలో చోటు
దక్కదంటే అతిశయోక్తి కాదు. ఇవి కూడా నూతన దంపతులు తీరిక చేసుకుని ఏరి కోరినవై
వుండాలి. అదొక బృహద్కార్యం. దీని బట్టి మనకి అర్ధమయ్యేది ఏమిటంటే, మొదటి పెళ్లి రోజు నాటికి ఆల్బం రెడీ అయివస్తే అదేమంత అపురూపమయిన విషయం కాదన్న మాట. ఎందుకంటే, ఈ లోపల వివిధ మాధ్యమాల ద్వారా అంతర్జాలంలో మాంఛి ఫొటోలన్నీ ‘షేర్’ అయిపోయి లో కవిదితమయిపోతాయిగా. ఎదో పండగలకీ పబ్బాలకీ ఇళ్ళు దులిపుకు నప్పుడు ఆల్బమ్ లు కూడా దులిపేసి మళ్ళీ గూట్లో పెట్టేయ్యడమే!
ఇదండీ సంగతి!
చిన్న మనవి -ఈ బ్లాగులోని రచనలు ఎవరి మనోభావాలనూ గాయపరచడానికి కాదు. నా
అభిప్రాయాలను , అనుభవాలను సరదాగా పంచుకోవడానికి మాత్రమే!
మళ్ళీ కలుస్తా !
Very practical ushaa thalli
ReplyDeleteఅలాగే ఉండాలి బాగా రాస్తున్నావ్ తల్లీ. మా ఆశీస్సులు
ReplyDelete