Thursday, 26 January 2017

పసందైన రోజు



బహుకాల బ్రేక్  తరువాత  మళ్ళీ   నా  బ్లాగాభిమానులకు   బ్లాగాయనమః

ఈ వారం  ‘బ్లాగవతం ‘ ఇంకా రాయలేదు!  అని  నా నేస్తం  ప్రశాంతి  నాకు వాట్సాప్ లో కామెంట్  వదిలింది .  భలేవుంది కదండీ?  ‘బ్లాగవతం’ అనే  ఈ కొత్త  పదం.  తనకి   ఓ వీరతాడు వేస్తూ  ముందుకెడదాం.

అరవై  వడిలో పడి  నేటికి   సరిగ్గా  రెండు సంవత్సరాలవుతున్నా ,  పర్మనెంట్ బుగ్గచుక్కతో   ఇప్పటికీ  ఎప్పటికీ  'సంతూర్ సుందరి'  మా అమ్మ.  అని నేనంటే తననెరిగిన   వారందరూ  నాతో  ఏకీభవిస్తారనుకుంటా .

ఏడుగురి సంతానంలో  చివరిదానిగా పుట్టి,  ఆరుగురు సంతానమున్న ఇంట  పెద్దకోడ లిగా మెట్టి,   తనదైన ముద్ర  వేసుకున్న  అమ్మకి  అందరూ అక్కరే . వీరెందుకిలావున్నారూ?  వారెందుకు అలా లేరూ ?  అని  అసమదీయులు -తసమదీయులు  అనే  వ్యత్యాసం  లేకుండా ప్రతీ ఒక్కరిగురించీ  నిరంతరం  ఆయాస  ప్రయాస   పడిపోయే   మనస్తత్వం  ఆమెది.  

తను  అనుకున్నట్టు  పైచదువులు  చదువుకుని  వుండి  వుంటే,  తప్పక   ఓ మంచి లాయర్  అయివుండేదని   తరచూ   ‘ఉచ్ ‘లు  కొడుతూవుంటుంది.   చాలా విషయాలమీద  తను  కనబరిచే   కుతూహలం,  వ్యక్త  పరిచే  నిర్దిష్టమయిన అభిప్రాయాలు ,  తను పడే  అవిరామ ఆందోళన , అన్నిటికీ మించి  తనకి తట్టే  ఆలోచనలు చూసి   తన  లాయర్  కల  పాపం  సమంజసమే   అనిపిస్తుంటుంది  మాకు.  

అమ్మకి  కొత్త  ఎప్పుడూ వింతే  అయినా , పాత మటుకూ ఎప్పటికీ రోతకాదు . తనదగ్గర   దశాబ్దాల  నాటి  పురాతన  వస్తువులతోపాటూ,  మార్కెట్లోకి  వచ్చే  లేటెస్ట్ వన్నీ  కోకొల్లలు.   కొత్త వస్తువులని  చూడటం,  ముచ్చటపడటం,  భీభత్సబేరాలాడి   లాటు లో   కొనటం,  ఇరస్తా పరస్తా  అందరికీ   అవి కానుకలుగా   ఇవ్వటం  - ఇవన్నీ తనకు  విపరీతమయిన  ఆనందాన్నిచ్చే   ఆనవాయితీలు.  పైపెచ్చు   తను  కానుకలుగా  ఇచ్చినవి   అందరూ   అపురూపంగా  వాడుతున్నారా?  లేదా?  అనే  ‘అత్యంతాపత్రయం’ కూడా  లేకపోలేదు . 

భోజ్యేషు మాత  అనే నానుడి కి   నిర్వచనంలా  ఉంటూ  విశ్రమించక,  ఇన్నేళ్ళ  తన పాకశాస్త్ర ప్రవీణ్యా నికి    ఇప్పుడు కూడా  ‘వసుంధర  మరియు బుల్లితెర సౌజన్యంతో’   కొత్త కొత్త మెరుగులు  దిద్దుతూ,   ప్రయోగాలు చేస్తూ ,  రకరకాల  భక్ష్య  (కొరుక్కు తినేవి),  భోజ్య (కలుపుకు తినేవి),  లేహ్య (నాకుతూ తినేవి),  చోడ్య  (జుర్రుతూ తినేవి),  పానీయాలని  ఎప్పటికప్పుడు   కోసరికోసరి  వడ్డిస్తూ  వుంటుంది.   చాలా బావుంది!   అనే ప్రశంస వచ్చిందా ?   ఎలా చేసారు?   అనే ప్రశ్న ఎదురయిందా?   అంతే!  రెట్టించిన ఉత్సాహంతో  ఇంకొంచం పెద్ద ఎత్తున  మళ్ళీ   భారీ ప్రయత్నం  మొదలుపెట్టి   అడిగిన వారింటికి   రవాణా చేసే   ఆమెచేతికి  నిజంగా  ఎముక లేదనే చెప్పాలి .

చుట్టూరా  మనుషులూ , బోలెడు కబుర్లే   తనకు  కొండంత బలం   అని  తనదైన  ధోరణిలో   పలుమార్లు   నొక్కి   వక్కాణిస్తూ  వుండే  మా అమ్మకి  మీ  అందరి తరపున కూడా  అఖిలమైన  మధురమైన  పుట్టినరోజు శుభాకాంక్షలు  తెలుపుతూ ....

మళ్ళీ కలుస్తా !

6 comments:

  1. Happy birthday aunty..nice one usha bhabhi!

    ReplyDelete
  2. Happy birthday aunty..nice one usha bhabhi!

    ReplyDelete
  3. Nice one......
    Happy birthday to your ever-young, beautiful Mom, Ushaji!!

    ReplyDelete
  4. Amma gariki belated birthday wishes .. vaariki paadaabhivandanam .. nenu kothaga jerina blaagudini .. appudappudu ilaa vastuntaanu ..

    ReplyDelete
  5. Amma gariki belated birthday wishes .. vaariki paadaabhivandanam .. nenu kothaga jerina blaagudini .. appudappudu ilaa vastuntaanu ..

    ReplyDelete
  6. "అరవై వడిలో పడి నేటికి సరిగ్గా రెండు సంవత్సరాలవుతున్నా , పర్మనెంట్ బుగ్గచుక్కతో ఇప్పటికీ ఎప్పటికీ 'సంతూర్ సుందరి' మా అమ్మ. అని నేనంటే తననెరిగిన వారందరూ నాతో ఏకీభవిస్తారనుకుంటా ."

    a very good complementto Ramagaru

    ReplyDelete